ఈసారి కేంద్ర బడ్జెట్ డిజిటల్ మంత్రం జపించింది. అన్నింటా ఆధునికత ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా డిజిటల్ చెల్లింపులు, పేపర్ లెస్ పేమెంట్స్ ప్రక్రియ వేగవంతం చేసేలా పలు నిర్ణయాలు ప్రకటించింది. అయితే సరైన మౌలిక సదుపాయలు లేకుండా ప్రభుత్వం కంటోన్న డిజిటల్ కల నెరవేరుతుందా?
డిజిటల్ ఇండియా లక్క్ష్యంగా చేసుకునే కేంద్రం బడ్జెట్ 2022-23ని ప్రవేశపెట్టిందనే విషయం ఇట్టే తెలిసిపోతోంది. డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ బ్యాంకింగ్‌కు మరింత ప్రోత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ భారత్‌లో భాగంగా మొదలైన కాంటాక్ట్ లెస్ చెల్లింపుల వ్యవహారం.. కరోనా టైంలో ‘నోట్ల ద్వారా వైరస్ వ్యాప్తి’ కారణంగా ఎవరూ ఊహించని స్థాయికి చేరుకుంది. 2016లో డిజిటల్ పేమెంట్స్ 61 బిలియన్ డాలర్లు ఉండగా 2021 నాటికి అది ఏకంగా 300 బిలియన్ డాలర్లకి చేరుకుంది.
టీ కొట్టు నుంచి..
డిజిటల్ పేమెంట్స్‌కి సంబంధించి ప్రభుత్వ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవడంలో స్టార్టప్‌లు కీలకంగా మారాయి. పేటీఎం, ఫోన్‌పే వంటి స్టార్టప్‌లు టీ స్టాల్, పాన్ డబ్బా నుంచి ఫైవ్‌స్టార్ హోటళ్ల వరకు చెల్లింపులు, కరెంటు బిల్లులు, ఫోన్ రీచార్జ్ ఆన్‌లైన్‌లో చేస్తూ డిజిటల్ పేమెంట్ వ్యవస్థను బలోపేతం చేశాయి. డిజిటల్ పేమెంట్స్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న బూమ్ 2026 నాటికి ఏకంగా వన్ ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అయితే అప్పటికీ ఇండియాలో జరిగే పేపర్ లెస్ లావాదేవీల్లో ఈ వన్ ట్రిలియన్ వాటా కేవలం 30 శాతమే అని రీసెర్చ్ సంస్థ సీఎల్ఎస్‌ఏ చెబుతోంది.
మందకొడిగా..
ప్రైవేటు సెక్టార్‌లో త్వరితగతిన డిజిటల్ పేమెంట్స్ జరుగుతుండగా ప్రభుత్వ పరంగా ఆర్టీసీ, రైల్వేస్, రిజిస్ట్రేషన్లు, రేషన్ దుకాణాలు ఇలా చాలా సర్కారీ శాఖల్లో డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ఇంకా ఊపందుకోలేదు. గ్రామీణ భారతంలో ఆర్థిక లావాదేవీలు ఇప్పటికీ నగదు నోట్ల రూపంలోనే జరుగుతున్నాయి. ఇక్కడ పేపర్ లెస్ ట్రాన్జాక‌్షన్స్ లక్ష్యానికి దూరంగా ఉండిపోయాయి. దీన్ని అధిగమించేందుకు డిజిటల్ మంత్రాన్ని కేంద్రం జపిస్తోంది. అందుకే ఈ బడ్జెట్‌లో పెద్ద పీట వేసింది.
డిజిటల్ బడ్జెట్
డిజిటల్ యూనివర్సిటీతో పాటు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల ద్వారా 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదన సైతం బడ్జెట్‌లో ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ కీలకమైన ఇంటర్నెట్ విస్తరణపైనా కేంద్రం దృష్టి సారించింది. పట్టణ ప్రాంతాలు లక్ష్యంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 5జీ సేవలు అందుబాటులోకి తెస్తామంది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల కోసం భారత్‌నెట్ ప్రాజెక్టును చేపట్టింది. భారత్‌నెట్ ద్వారా 2025 నాటికి దేశమంతటా తక్కువ ధరకే బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తామని ప్రభుత్వం అంటోంది. ఏకంగా డిజిటల్ యూనివర్సిటీ కూడా నెలకొల్పుతామంది. ఆఖరికి వివాదాలు, విమర్శలు పక్కన పెట్టి క్రిప్టో కరెన్సీకి కూడా సై అంది కేంద్రం.
స్లో అయితే కష్టం
అయితే ప్రభుత్వం లక్ష్యాలు అర్బన్, సెమీ అర్బన్ రీజియన్ల వరకు ఓకే. మరి రూరల్ భారత్ సంగతి ఏంటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన 5జీ, భారత్‌నెట్ ప్రాజెక్టులు ఇంకా లక్ష్యానికి దూరంగా ఉండి పోయాయి. ఇక రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, వైన్స్ తదితర చోట్ల డిజిటల్ పేమెంట్స్ చేస్తే అదనపు చార్జీలను కస్టమర్ల మీద మోపుతున్నారు. ఇలాంటి వ్యవహారాలకు ఎక్కడా అడ్డుకట్ట పడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ తరుణంలో ప్రభుత్వం జపిస్తున్న డిజిటల్ మంత్ర ఎంత వరకు సిద్ధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. (క్లిక్: కేంద్రం కీలక సంస్కరణ.. దేశంలో ఏకరీతిగా భూ రిజిస్ట్రేషన్..!)
డబుల్ వేగం
వేగవంతమైన ఇంటర్నెట్‌తో యాక్సెస్ వస్తే డిజిటల్ పేమెంట్స్ అందనంత వేగంతో దూసుకుపోతాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2016లో ఉన్న అంచనాల ప్రకారం వచ్చే ఐదేళ్లు 2021 సెప్టెంబరు నాటికి డిజిటల్ పేపెంట్స్ రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటాయనుకున్నారు. అందరీ అంచనాలు తారుమారు చేస్తూ డిజిటల్ పేమెంట్స్ ఏకంగా రూ. 7 లక్షల కోట్లకు చేరాయి. చౌక ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగడంతో యాభైకి పైగా డిజిటల్ పేమెంట్స్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. 250 బ్యాంకులు యూపీఐ పేమెంట్స్‌ని అంగీకరిస్తున్నాయి. సగటున ప్రతీ రోజు యూపీఐ ద్వారా రోజుకు 14 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ లావాదేవీల్లో యాభై శాతం రూ.200లోపువే కావడం గమనార్హం. (క్లిక్: అందుబాటులోకి డిజిటల్ రూపీ.. జారీ చేసేది అప్పటి నుంచే..)
ఇక్కడ ఫోకస్ చేయాల్సిందే
రూరల్ ఇండియా, పేద, మధ్య తరగతి ప్రజలు ముందస్తు అంచనాలు తలకిందులు చేస్తూ వేగంగా డిజిటల్ వైపు మళ్లగా భారీ లావాదేవీలు మాత్రం ఇప్పటికీ నగదుతోనే జరుగుతుంది. ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డుతో జరిగే లావాదేవీల మొత్తం కంటే యూపీఐ లావాదేవీల మొత్తమే ఎక్కువ. కాబట్టి భారీ డీల్స్ కూడా డిజిటల్ పద్దతిలో జరిగేలా ప్రభుత్వం దృష్టి సారించాలంటున్నారు నిపుణులు. భారీ లావాదేవీలను కూడా డిజిటల్ పరిధిలోకి తీసుకువస్తే పారదర్శకత పెరిగి పన్ను వసూళ్లు పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక డిజిటల్ పేమెంట్స్‌కి సంబంధించి ఆన్‌లైన్ మెసాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. సైబర్ సెక్యురిటీ, డేటా ప్రైవసీ విషయంలో ప్రభుత్వం నుంచి నిర్ధిష్టమైన చర్యలు అవసరం.
- సాక్షి, వెబ్ స్పెషల్
Comments
Please login to add a commentAdd a comment