న్యూఢిల్లీ: షేరుకి రూ. 2,080–2,150 ధరలో డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్ చేపట్టిన పబ్లిక్ ఇష్యూకి అంతంతమాత్ర స్పందనే లభిస్తోంది. రెండో రోజు మంగళవారానికల్లా ఇన్వెస్టర్ల నుంచి 48 శాతం బిడ్స్ మాత్రమే దాఖలయ్యాయి. ఐపీవోలో భాగంగా పేటీఎమ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ 4.83 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచింది. అయితే మంగళవారానికల్లా 2.34 కోట్ల షేర్ల కోసమే దరఖాస్తులు లభించాయి.
ఇష్యూ ద్వారా కంపెనీ భారీ స్థాయిలో రూ. 18,300 కోట్లు సమకూర్చుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో కంపెనీ ఆఫర్ చేసిన 2.63 కోట్ల షేర్లకుగాను 1.2 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కోసం 1.31 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 5%కే దరఖాస్తులు వచ్చాయి. ఇక రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 1.23 రెట్లు స్పందన లభించడం గమనార్హం. 87.98 లక్షల షేర్లను కంపెనీ ఆఫర్ చేయగా.. 1.08 కోట్ల షేర్లకు బిడ్స్ లభించాయి. ఇష్యూ నేడు(బుధవారం) ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment