లావాదేవీల్లో 33 శాతం వృద్ధి
పేనియర్‌బై నివేదికలో వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ స్టోర్లలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలు 33 శాతం పెరిగాయి. డిజిటల్ చెల్లింపులు దూసుకెళ్తున్నాయనడానికి ఇది నిదర్శనమని డిజిటల్ బ్యాంకింగ్, నెట్‌వర్క్ సేవల్లో ఉన్న పేనియర్‌బై నివేదిక తెలిపింది. గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాలలో ఆర్థిక, డిజిటల్ సేవలను అందిస్తున్న 10,00,000 కిరాణా, మొబైల్ రీఛార్జ్ వంటి చిన్న రిటైలర్ల నుండి సేకరించిన వాస్తవ లావాదేవీల సమాచారాన్ని విశ్లేíÙంచి ఈ నివేదిక రూపొందించారు.
2024 జనవరి నుండి నవంబర్ వరకు జరిగిన వ్యాపార లావాదేవీల సమాచారాన్ని 2023తో పోల్చారు. ‘ఈ ఏడాది బీమా పాలసీ కొనుగోళ్లు, ప్రీమియం వసూళ్లు లావాదేవీల పరిమాణంలో 127 శాతం పెరిగాయి. కొత్త కస్టమర్లు 96 శాతం అధికం అయ్యారు. భారత్ అంతటా బీమా చొచ్చుకుపోయే సవాళ్లను అధిగమించడంలో డిజిటల్ రిటైల్ దుకాణాలు కీలక పాత్రను పోషిస్తున్నాయి’ అని నివేదిక వివరించింది.
నగదు ఉపసంహరణలు..
‘గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాలలో వ్యాపారం, బంగారం, వ్యక్తిగత రుణాలు, ఓవర్‌డ్రాఫ్ట్ సహా రుణ ఉత్పత్తులలో పరిమాణం 297 శాతం దూసుకెళ్లింది. ఈ గణనీయమైన పెరుగుదల అట్టడుగు స్థాయిలో రుణ పరిష్కారాల పట్ల పెరుగుతున్న అవగాహన, డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది. మైక్రో ఏటీఎం, ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్స్ వద్ద నగదు ఉపసంహరణలు 2024లో తగ్గాయి. లావాదేవీల పరిమాణం, ఒక్కో లావాదేవీకి సగటు నగదు ఉపసంహరణ రెండూ స్వల్ప క్షీణతను చవిచూశాయి.
సగటు నగదు ఉపసంహరణ 2023లో రూ.2,624 నమోదైతే, ఈ ఏడాది ఇది రూ.2,482కి పడిపోయింది. జమ్మూ కాశ్మీర్‌లో నగదు ఉపసంహరణలు విలువలో 58 శాతం, పరిమాణంలో 74 శాతం వృద్ధిని నమోదు చేశాయి’ అని నివేదిక తెలిపింది. బీమా, ఈ–కామర్స్, రుణాల వంటి విభిన్న సేవలను అందించే సాధనాలతో స్థానిక రిటైలర్లను సన్నద్ధం చేయడం ద్వారా.. అట్టడుగు స్థాయిలో ఆర్థిక లభ్యత, ఆర్థిక పురోగతికి కీలక సహాయకులుగా మారడానికి వారిని శక్తివంతం చేస్తున్నాముని పేనియర్‌బై వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ బజాజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment