2029 మార్చి నాటికి మూడింతలు
పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక
న్యూఢిల్లీ: యూపీఐ వినియోగం ఏటేటా గణనీయగా పెరుగుతూనే ఉంది. 2028–29 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి యూపీఐ లావాదేవీలు మూడు రెట్ల వృద్ధితో 439 బిలియన్లకు (ఒక బిలియన్ వంద కోట్లకు సమానం) చేరుకుంటాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక వెల్లడించింది.
2023–24 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు 131 బిలియన్లుగా ఉన్నట్టు తెలిపింది. గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అద్భుతమైన వృద్ధిని చూసినట్టు పేర్కొంది. ఈ కాలంలో లావాదేవీల విలువ రూ.265 లక్షల కోట్ల నుంచి రూ.593 లక్షల కోట్లకు పెరిగినట్టు వెల్లడించింది.
రిటైల్ చెల్లింపుల్లో యూపీఐ హవా
రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో ఇప్పుడు యూపీఐ వాటా 80 శాతాన్ని అధిగమించిందని.. 2028–29 నాటికి 91 శాతానికి చేరుకోవచ్చని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. యూపీఐ ఏటేటా చక్కని వృద్ధిని చూస్తోందంటూ.. లావాదేవీల పరిమాణంలో 57 శాతం వృద్ధి ఉన్నట్టు పేర్కొంది. క్రెడిట్ కార్డ్ విభాగం సైతం 2023–24లో బలమైన వృద్ధిని చూసిందని, కొత్తగా 1.6 కోట్ల కార్డులను పరిశ్రమ జోడించుకున్నట్టు వివరించింది.
దీంతో లావాదేవీల పరిమాణం 22 శాతం మేర, లావాదేవీల విలువ 28 శాతం చొప్పున పెరిగినట్టు వెల్లడించింది. 2028–29 నాటికి క్రెడిట్‌కార్డులు 20 కోట్లకు చేరుకోవచ్చని తెలిపింది. ఇక డెబిట్ కార్డుల వినియోగం తగ్గుతోంది. లావాదేవీల పరిమాణం, విలువలోనూ క్షీణత కనిపించింది. వచ్చే ఐదేళ్లలో చెల్లింపుల పరిశ్రమ ఎకోసిస్టమ్ విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని, ప్రస్తుతమున్న ప్లాట్‌ఫామ్‌లపైనే కొత్త వినియోగ అవకాశాలను గుర్తించొచ్చని పీడబ్ల్యూసీ ఇండియా పేమెంట్స్ పార్ట్‌నర్ మిహిర్ గాంధీ అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment