డిజిటల్ యుగంలో పేమెంట్స్ విధానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు చెల్లింపు లావాదేవీలన్నీ ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే జరుగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లతోపాటు స్మార్ట్ వాచ్‌ల వినియోగం కూడా పెరుగుతన్న క్రమంలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది.
నాయిస్ కంపెనీ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త స్మార్ట్ వాచ్‌ను తీసుకొస్తోంది. తాజాగా జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో దీన్ని పరిచయం చేసింది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) టెక్నాలజీతో పనిచేసే ఈ స్మార్ట్ వాచ్‌లో ఇంటిగ్రేటెడ్ రూపే చిప్ ఉంటుంది. దీన్ని ధరించి మణికట్టు నుంచే ‘మనీ’ లావాదేవీలు పూర్తి చేయొచ్చన్నమాట. పేమెంట్స్-కమ్-ఫిట్‌నెస్ సొల్యూషన్‌గా వస్తున్న ఈ స్మార్ట్ వాచ్‌లో హెల్త్, ఫిట్‌నెస్ మానిటరింగ్ ఫీచర్‌లు కూడా ఉన్నాయి.
స్మార్ట్‌వాచ్ ఫీచర్లు
ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్‌లో డైరెక్ట్, ‘ఆన్ ద గో’ పేమెంట్స్ కోసం డయల్‌లో ఎంబెడెడ్ రూపే చిప్‌ను అమర్చినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్‌సీఎంసీ ఇంటిగ్రేషన్‌తో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ ట్యాప్ అండ్ పే లావాదేవీలకు మద్దతునిస్తుంది. ఈ ఇంటిగ్రేషన్ సౌజన్యంతో దేశంలోని మెట్రోలు, బస్సులు, పార్కింగ్ ప్రదేశాలు ఇంకా మరెన్నో చోట్ల స్మార్ట్‌వాచ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. పిన్‌తో పనిలేకుండా దీని ద్వారా రూ. 5,000 వరకూ పేమెంట్స్ చేయొచ్చు.
ఇక హెల్త్, ఫిట్‌నెస్ ఫీచర్ల విషయానికి వస్తే రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటు, బీపీ పర్యవేక్షణ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది 130 స్పోర్ట్స్ మోడ్‌లను ట్రాక్ చేయగలదు. 150కి పైగా క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లను కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. 550 నిట్స్ బ్రైట్‌నెస్‌తో టీఎఫ్‌టీ ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉందని ఎయిర్‌టెల్ తెలిపింది.
ఇది ఇతర స్మార్ట్‌వాచ్‌ల మాదిరిగానే స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్‌లు, కాల్ రిమైండర్‌లు, సందేశాలను కూడా ప్రదర్శిస్తుంది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఈ స్మార్ట్‌వాచ్ ధరను ఇంకా ప్రకటించలేదు. బ్యాంక్ ఆన్‌లైన్, రిటైల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి త్వరలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment