సాక్షి, సిటీబ్యూరో: క్యాబ్ లేదా ఆటో రైడ్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తున్నారా....జేబులో డబ్బులు ఉంటేనే క్యాబ్ బుక్ చేసుకోండి. లేకుండా కష్టమే. చార్జీలు ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చుననుకుంటే మీరు బుక్ చేసుకున్న క్యాబ్ మరో క్షణంలోనే రద్దయిపోవచ్చు. ఇది నిజమే. నగరంలో ఓలా, ఉబెర్, తదితర క్యాబ్ సంస్థలకు అనుసంధానమై తిరుగుతున్న క్యాబ్‌లు, ఆటోలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆన్‌లైన్, యూపీఐ చెల్లింపులకు నిరాకరిస్తున్నాయి. రైడ్ బుక్ చేసుకున్న మరుక్షణంలోనే డ్రైవర్లు ఫోన్ చేసి అడుగుతున్నారు.
చార్జీలు నగదు రూపంలో చెల్లిస్తేనే వస్తామంటూ పేచీ పెడుతున్నారు. ఆన్‌లైన్‌లో చెల్లిస్తామంటే వెంటనే రైడ్ రద్దు చేస్తున్నారు. దీంతో మరో క్యాబ్ కోసం, ఆటో కోసం తిరిగి మొబైల్ యాప్‌ను ఆశ్రయించాల్సి వస్తుంది. అలా గంటల తరబడి బుకింగ్‌ల కోసమే నిరీక్షించవలసి వస్తుందని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఏదో ఒకటి పట్టుకొని వెళ్లాలనుకొంటే కష్టమే. తీరా గమ్యం చేరుకున్న తరువాత చార్జీల చెల్లించేటప్పుడు బాగా ఇబ్బంది పెడుతున్నారు.’అని సీతాఫల్‌మండికి చెందిన సురేష్ చెప్పారు. సికింద్రాబాద్ నుంచి హైటెక్‌సిటీ వరకు క్యాబ్ బుక్ చేసుకొనేందుకు గంటకు పైగా ఎదురుచూడాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
చినుకు పడితే బండి కష్టమే...
ఒకవైపు ఆన్‌లైన్ చెల్లింపులపైనా రైడ్‌కు డ్రైవర్లు నిరాకరిస్తుండగా ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు క్యాబ్ సంస్థలు సైతం ఉన్నపళంగా చార్జీలను పెంచేస్తున్నాయి. వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నా, ఏ కొంచెం వర్షం కురిసినా చాలు క్యాబ్ లభించడం కష్టంగా మారుతుంది. రద్దీ వేళల నెపంతో చార్జీలను రెట్టింపు చేస్తున్నారు. సాధారణంగా గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్ వరకు రూ.250 నుంచి రూ.300 వరకు చార్జీ ఉంటే వర్షాన్ని సాకుగా చేసుకొని కొన్ని సంస్థలు రూ.550 నుంచి రూ.750వరకు పెంచేస్తున్నాయి.
మార్కెట్‌లో డిమాండ్‌ను పెంచుకొనేందుకు కొన్ని క్యాబ్ సంస్థలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని రెగ్యులర్ ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లోనూ ఇష్టారాజ్యంగా చార్జీలు పెంచేస్తున్నారు. దీంతోపాటు సర్ చార్జీల రూపంలోనూ ప్రయాణకులపైన అదనపు వడ్డింపులకు పాల్పడడం గమనార్హం. ‘ప్రతికూలమైన వాతావరణం వల్ల త్వరగా ఇల్లు చేరాలంటే డిమాండ్ మేరకు చెల్లించక తప్పడం లేదు.’ అని అమీర్‌పేట్‌కు చెందిన నవీన్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చెప్పారు.
క్యాబ్ సంస్థల జాప్యం..
మరోవైపు నగదు చెల్లింపుల పైన డ్రైవర్ల వాదన మరో విధంగా ఉంది. క్యాబ్ సంస్థల ఖాతాలో పడే చార్జీలు తిరిగి తమ ఖాతాలోకి చేరేందుకు పడిగాపులు కాయవలసి వస్తుందని పేర్కొంటున్నారు. డ్రైవర్‌లు ప్రతి రోజు చేసే రైడ్‌లపైన క్యాబ్ సంస్థలు 30 శాతం వరకు కమిషన్ తీసుకొని మిగతా 70 శాతం వారి ఖాతాలో జమ చేయాలి. కానీ డ్రైవర్‌కు చెల్లించవలసిన డబ్బులు రెండు, మూడు రోజుల తరువాత మాత్రమే ఖాతాలో జమ అవుతున్నాయి. దీంతో తమ రోజువారీ అవసరాలకు కష్టమవుతుందని అంబర్‌పేట్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ వెంకటేశ్ తెలిపారు. ఏ రోజుకు ఆ రోజు ఖాతాలో జమ చేయకపోవడం వల్లనే ఈ ఇబ్బంది వస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment