పిల్లలు స్కూల్‌కి, భర్త ఆఫీసుకు వెళ్లాక ఇంటి పనుల్లో తీరికలేకుండా ఉన్న ఉమాదేవికి గేటు దగ్గర నుంచి ‘కొరియర్..’ అన్న కేక వినిపించింది. బయటకు వచ్చి అడిగితే ‘ఉమాదేవి పేరున పార్సిల్ వచ్చింది’ అని చెప్పాడు బాయ్. ‘నా పేరున పార్సిల్ రావడమేంటి? నేనేదీ బుక్ చేయలేదు. ఎవరు పంపించారు’ అంది ఉమాదేవి. ‘మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేశారు మేడమ్. రూ.500 విలువైన పార్సిల్ తీసుకొని, మనీ ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేయమని అడిగాడు. తనకేమీ తెలియదని చెప్పింది ఉమాదేవి.
అయితే, బుకింగ్ క్యాన్సిల్ చేస్తాను అన్నాడు కొరియర్ బాయ్. ‘సరే’ అంది ఉమాదేవి. ‘మీ మొబైల్‌కి ఆర్డర్ కాన్సిల్ ఓటీపీ వచ్చింది, చెప్పండి’ అని అడిగాడు. ఉమాదేవి తన ఫోన్‌కి వచ్చిన ఓటీపీ చెప్పింది. థాంక్యూ చెప్పి కొరియర్ బాయ్ వెళ్లిపోయాడు. ‘పిల్లలు ఫోన్ ఆడుకుంటూ ఏదైనా తెలియక క్లిక్ చేశారా..’ అనుకుంటూ లోపలికెళ్లిపోయింది. పనైపోయాక భర్తకు ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకొని చూసింది. ఫోన్‌లో బ్యాంక్ నుంచి వచ్చిన మెసేజ్ చూసి షాకైంది. తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.65000 డెబిట్ అయినట్టు ఉంది మెసేజ్.
ఇటీవల ఆన్‌లైన్‌లో బుక్ చేయకుండానే కొరియర్ ద్వారా పార్సిల్స్ రావడం, వీటి ద్వారా ఫోన్ నెంబర్, ఓటీపీ, బ్యాంక్ ఖాతా నుంచి నగదు కొల్లగొట్టడం వంటివి అధికంగా జరుగుతున్నాయి. ఈ తరహా మోసానికి గృహిణులను టార్గెట్ చేస్తున్నట్టుగా సైబర్‌క్రైమ్ విభాగం నుంచి నివేదిక. సైబర్ క్రైమ్‌పోలీసులు కూడా ఆర్డర్ చేయకుండానే ఆన్‌లైన్ పార్శిల్స్ వచ్చాయని ఎవరైనా మీ దగ్గరికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేస్తున్నారు.
ఆన్‌లైన్ షాపింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసే హెచ్చరిక..
- ఆన్‌లైన్‌లో చూసినప్పుడు ఒక వస్తువు లేదా సేవ నమ్మశక్యం కాని తక్కువ ధరకు లభిస్తున్నట్టు కనిపిస్తుంది. వాటి ప్రయోజనాలు లేదా ఫీచర్‌లు నిజమని అనిపించేలా ఉంటాయి. ఆ లింక్స్‌ను ఓపెన్ చేయద్దు.
- ఫోన్‌కాల్ ద్వారా తక్షణ చెల్లింపు లేదా ఎలక్ట్రానిక్ నిధుల బదిలీ ద్వారా చెల్లించాలని పట్టుబడితే అనుమానించాలి.
- చౌకైన డీల్ ని యాక్సెస్ చేయడానికి ముందు మీరు వోచర్‌ల కోసం ముందస్తుగా నగదు చెల్లించాలని వారు పట్టుబట్టవచ్చు.
- సోషల్ మీడియా, ఆన్‌లైన్‌లో కొన్ని లింక్స్ తక్కువ ధరలకు ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు చూపుతాయి. ఇది నిజం కాదు.
- వారు ఓటీపీని భాగస్వామ్యం చేయమని లేదా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయమని లేదా చెల్లింపులను స్వీకరించడానికి గూగుల్ ఫారమ్‌లు లేదా షార్ట్ లింక్‌లను పూరించమని మిమ్మల్ని అడగచ్చు.
- కొరియర్ క్యాన్సిల్ కోసం ఓటీపీ చెప్పమని అభ్యర్థించవచ్చు. జాగ్రత్త అవసరం.
సురక్షిత చెల్లింపు కోసం ఇలా చేయండి..
- ఆన్‌లైన్‌లో ప్యాడ్ లాక్ చిహ్నంతో ఉన్న లింకులను మాత్రమే ఓపెన్ చేయాలి.
- ఓటీపీ నంబర్‌లను కొనుగోలుదారు లేదా విక్రేతకు ఏ రూపంలోనూ షేర్ చేయవద్దు.
- మీరు ఫోన్ కాల్‌లో ఉన్నప్పుడు నగదు చెల్లింపు లావాదేవీని ఎప్పుడూ చేయకూడదు.
- కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన ఏవైనా చిన్న లింక్‌లను క్లిక్ చేసి పూరించవద్దు.
- కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన గూగుల్ ఫారమ్‌ల లింక్‌లను పూరించవద్దు.
- క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయవద్దు, మీరు స్కాన్ చేస్తుంటే మీ ఖాతా నుండి డబ్బు డెబిట్ అవుతుందని అర్థం.
- ఏవైనా బ్యాంకింగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి స్మార్ట్‌ఫో¯Œ లలో స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్‌వేర్‌లు ఎనీ డెస్క్, టీమ్‌వ్యూవర్ మొదలైన వాటిని ఉపయోగించడం మానుకోవాలి.
- గూగుల్‌లోనూ లేదా ఏదైనా సోషల్ మీడియాలో మీ యాప్ కస్టమర్ సపోర్ట్ నంబర్‌ల కోసం వెతకద్దు. మీ యాప్ లేదా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ నుండి కస్టమర్ కేర్ నంబర్‌ను తీసుకోవాలి.
ఇన్‌పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్‌బీయింగ్ ఎక్స్‌పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment