House wives
-
త్వరలో గృహిణులకు నెలనెలా రూ. 1000
సాక్షి, చెన్నై: ఇంటి యజమానులుగా ఉన్న గృహిణులకు నెలనెలా రూ. 1000 నగదు పంపిణీ చేసే పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నామని పుదుచ్చేరి సీఎం ఎన్‌రంగస్వామి తెలిపారు. అలాగే అదనంగా 16 వేల మంది వృద్ధులకు పింఛన్లు మంజూరు చేయనున్నామని వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసి కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అభివృద్ధికి రూ. 2000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించారని రూ. 1,400 కోట్లను కేటాయించేందుకు ఆమోదించినట్లు చెప్పారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. విమానాశ్రయం విస్తరణ పనులపై దృష్టి పెట్టామని, అయితే తమిళనాడు ప్రభుత్వం స్థలం ఇంతవరకు కేటాయించ లేదని తెలిపారు. పుదుచ్చేరి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్త.. ఆర్థికంగా, పారిశ్రామికంగా తమ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. హెల్త్ పార్క్.. సేదార పట్టిలో పారిశ్రామిక వాడ కోసం 800 ఎకరాల స్థలాన్ని కేంద్రానికి అప్పగించామని, అయితే ప్రస్తుతం ఆ స్థలం మళ్లీ రాష్ట్రం గుప్పెట్లోకి చేరిందన్నారు. ఈ స్థలానికి మరో 200 ఎకరాలను కలిపి 1000 ఎకరాల్లో హెల్త్‌పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో కుటుంబ యజమానులుగా ఉన్న గృహిణిలకు రూ. 1000 పథకం గురించి బడ్జెట్లో ప్రకటన చేశామని తెలిపారు. దీనిని త్వరలో ఆచరణలో పెట్టనున్నామని వెల్లడించారు. అదనంగా 16 వేల మందికి వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే 2 వేల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నామని ప్రకటించారు. -
బుక్ చేయకుండానే పార్సిల్.. ఆర్డర్ కాన్సిల్ అంటూ ఖాతా ఖాళీ
పిల్లలు స్కూల్‌కి, భర్త ఆఫీసుకు వెళ్లాక ఇంటి పనుల్లో తీరికలేకుండా ఉన్న ఉమాదేవికి గేటు దగ్గర నుంచి ‘కొరియర్..’ అన్న కేక వినిపించింది. బయటకు వచ్చి అడిగితే ‘ఉమాదేవి పేరున పార్సిల్ వచ్చింది’ అని చెప్పాడు బాయ్. ‘నా పేరున పార్సిల్ రావడమేంటి? నేనేదీ బుక్ చేయలేదు. ఎవరు పంపించారు’ అంది ఉమాదేవి. ‘మీరు ఆన్లైన్లో బుక్ చేశారు మేడమ్. రూ.500 విలువైన పార్సిల్ తీసుకొని, మనీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయమని అడిగాడు. తనకేమీ తెలియదని చెప్పింది ఉమాదేవి. అయితే, బుకింగ్ క్యాన్సిల్ చేస్తాను అన్నాడు కొరియర్ బాయ్. ‘సరే’ అంది ఉమాదేవి. ‘మీ మొబైల్‌కి ఆర్డర్ కాన్సిల్ ఓటీపీ వచ్చింది, చెప్పండి’ అని అడిగాడు. ఉమాదేవి తన ఫోన్‌కి వచ్చిన ఓటీపీ చెప్పింది. థాంక్యూ చెప్పి కొరియర్ బాయ్ వెళ్లిపోయాడు. ‘పిల్లలు ఫోన్ ఆడుకుంటూ ఏదైనా తెలియక క్లిక్ చేశారా..’ అనుకుంటూ లోపలికెళ్లిపోయింది. పనైపోయాక భర్తకు ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకొని చూసింది. ఫోన్లో బ్యాంక్ నుంచి వచ్చిన మెసేజ్ చూసి షాకైంది. తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.65000 డెబిట్ అయినట్టు ఉంది మెసేజ్. ఇటీవల ఆన్లైన్లో బుక్ చేయకుండానే కొరియర్ ద్వారా పార్సిల్స్ రావడం, వీటి ద్వారా ఫోన్ నెంబర్, ఓటీపీ, బ్యాంక్ ఖాతా నుంచి నగదు కొల్లగొట్టడం వంటివి అధికంగా జరుగుతున్నాయి. ఈ తరహా మోసానికి గృహిణులను టార్గెట్ చేస్తున్నట్టుగా సైబర్‌క్రైమ్ విభాగం నుంచి నివేదిక. సైబర్ క్రైమ్‌పోలీసులు కూడా ఆర్డర్ చేయకుండానే ఆన్లైన్ పార్శిల్స్ వచ్చాయని ఎవరైనా మీ దగ్గరికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసే హెచ్చరిక.. ఆన్లైన్లో చూసినప్పుడు ఒక వస్తువు లేదా సేవ నమ్మశక్యం కాని తక్కువ ధరకు లభిస్తున్నట్టు కనిపిస్తుంది. వాటి ప్రయోజనాలు లేదా ఫీచర్లు నిజమని అనిపించేలా ఉంటాయి. ఆ లింక్స్‌ను ఓపెన్ చేయద్దు. ఫోన్‌కాల్ ద్వారా తక్షణ చెల్లింపు లేదా ఎలక్ట్రానిక్ నిధుల బదిలీ ద్వారా చెల్లించాలని పట్టుబడితే అనుమానించాలి. చౌకైన డీల్ ని యాక్సెస్ చేయడానికి ముందు మీరు వోచర్ల కోసం ముందస్తుగా నగదు చెల్లించాలని వారు పట్టుబట్టవచ్చు. సోషల్ మీడియా, ఆన్లైన్లో కొన్ని లింక్స్ తక్కువ ధరలకు ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు చూపుతాయి. ఇది నిజం కాదు. వారు ఓటీపీని భాగస్వామ్యం చేయమని లేదా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయమని లేదా చెల్లింపులను స్వీకరించడానికి గూగుల్ ఫారమ్‌లు లేదా షార్ట్ లింక్‌లను పూరించమని మిమ్మల్ని అడగచ్చు. కొరియర్ క్యాన్సిల్ కోసం ఓటీపీ చెప్పమని అభ్యర్థించవచ్చు. జాగ్రత్త అవసరం. సురక్షిత చెల్లింపు కోసం ఇలా చేయండి.. ఆన్లైన్లో ప్యాడ్ లాక్ చిహ్నంతో ఉన్న లింకులను మాత్రమే ఓపెన్ చేయాలి. ఓటీపీ నంబర్లను కొనుగోలుదారు లేదా విక్రేతకు ఏ రూపంలోనూ షేర్ చేయవద్దు. మీరు ఫోన్ కాల్లో ఉన్నప్పుడు నగదు చెల్లింపు లావాదేవీని ఎప్పుడూ చేయకూడదు. కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన ఏవైనా చిన్న లింక్‌లను క్లిక్ చేసి పూరించవద్దు. కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన గూగుల్ ఫారమ్‌ల లింక్‌లను పూరించవద్దు. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయవద్దు, మీరు స్కాన్ చేస్తుంటే మీ ఖాతా నుండి డబ్బు డెబిట్ అవుతుందని అర్థం. ఏవైనా బ్యాంకింగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి స్మార్ట్‌ఫో¯Œ లలో స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్వేర్లు ఎనీ డెస్క్, టీమ్‌వ్యూవర్ మొదలైన వాటిని ఉపయోగించడం మానుకోవాలి. గూగుల్లోనూ లేదా ఏదైనా సోషల్ మీడియాలో మీ యాప్ కస్టమర్ సపోర్ట్ నంబర్ల కోసం వెతకద్దు. మీ యాప్ లేదా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ నుండి కస్టమర్ కేర్ నంబర్‌ను తీసుకోవాలి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
మీ ఇంటికి మీరే ఫైనాన్స్ మినిస్టర్!
వాయనం: ఇంటిని బాగా మేనేజ్ చేయాలంటే డబ్బుని మేనేజ్ చేయడం రావాలి. చాలామంది గృహిణులు డబ్బు వ్యవహారాలు మగాళ్లకు సంబంధించినవని అనుకుంటారు. అది సరికాదు. ఇంట్లో దేనికి ఖర్చు చేయాలి, ఎంత చేయాలి, ఎంత నిల్వ చేయవచ్చు వంటి విషయాలు ఇంటిని చక్కబెట్టే మహిళలకు తెలిసినంతగా వారి భర్తలకు తెలియవు. కాబట్టి మనీ మేనేజ్మెంట్ మీద గృహిణులు దృష్టి పెట్టి తీరాలి. ఆర్థికాంశాలను అర్థం చేసుకోవడం, ఆర్థిక వ్యవహారాలను సమగ్రంగా నిర్వహించడం పెద్ద పనేమీ కాదు. ఎంత వస్తుంది, ఎన్ని ఖర్చులున్నాయి అన్న విషయాలు స్పష్టంగా తెలిస్తే చాలు. చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. ముందుగా మీకున్న ఖర్చులన్నీ ఓ చోట రాసుకోండి. ఆపైన వచ్చే ఆదాయం ఎంత ఉందో చూసుకోండి. ఆదాయం కంటే ఖర్చు ఎప్పుడూ తక్కువగానే ఉండాలన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలా చేసుకోవడం రాక చాలామంది అవస్థ పడుతుంటారు. కానీ కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే అది సాధ్య పడుతుంది. ఇంటి ఖర్చులకెంత, పిల్లలకెంత, మీవారి పాకెట్ మనీకి ఎంత అంటూ అవసరాలను విడగొట్టుకోవాలి. ఆపైన వాటిలో ఎంత పొదుపు చేయగలం అని చూడాలి. ఇంటి ఖర్చులనే తీసుకోండి. ఉప్పు దగ్గర్నుంచి ఏసీ వరకూ ఇప్పుడు ప్రతి వస్తువుకీ రెండు మూడు ఆప్షన్స్ ఉంటున్నాయి. వాటిలో ఏది బెస్ట్ అని చూడటం మానేసి, వాటిలో మన దగ్గరున్న డబ్బుకి ఏది బెస్ట్ అని చూసుకోవడం ఉత్తమం. అలా అని చెత్త వస్తువు కొనమని కాదు. మంచి వాటిలోనే కొంతలో కొంత తక్కువకు వచ్చేది తీసుకోమని. పిల్లల ఫీజుల విషయంలో ఏమీ చేయలేం. కాకపోతే వారికి కొనే వస్తువుల విషయంలో కొంత పొదుపు చేయవచ్చు. ఇప్పుడు ప్రతి చిన్న ఊరిలోనూ ఇంటర్నెట్ ఉంటోంది. కాబట్టి ఆన్లైన్ షాపింగ్ చేయడం నేర్చుకోండి. వంట సామాన్ల దగ్గర నుంచి బేబీ డైపర్స దాకా అక్కడ దొరికినంత తక్కువగా మరెక్కడా దొరకవు. పది నిమిషాల పని. పది రూపాయలు మిగిలినా పొదుపే కదా! మొదట ప్లాన్ చేసుకున్నప్పుడే ఈ నెల ఇంత మిగల్చాలి అను కుని, ఆ మొత్తాన్ని పక్కన పెట్టేసి, అది లేదనుకుని మిగతావన్నీ చేసుకోండి. లేకపోతే పొదుపు చేయడం జన్మలో అలవడదు. పొదుపు మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అర్థమైందిగా, మరి మీ ఇంటి ఫైనాన్స్ మినిస్టర్ పదవిని చేపట్టండిక! ఐస్‌క్యాండీ... మీరే చేయండి! చల్లచల్లని, తీయతీయని ఐస్‌క్యాండీ తినడం పిల్లలకే కాదు... పెద్దలకూ సరదానే. ఉత్తర భారతదేశంలో అందరికీ ప్రీతిపాత్రమైన ఈ ఐస్... మెల్లగా మనవాళ్లకూ దగ్గరయ్యింది. అయితే రోడ్ల పక్కన అమ్మే వీటిని పిల్లలకు కొనివ్వాలంటే తల్లిదండ్రులు కాస్త భయపడుతుంటారు... దుమ్మూ ధూళీ వచ్చి పడివుంటుందని. అలా చెబితే పిల్లలు ఊరుకుంటారా? తినాల్సిందేనని మారాం చేస్తారు. కాబట్టి మీరే ఇంట్లో చేసిచ్చేశారనుకోండి... వాళ్ల కోరికా తీరుతుంది, కలుషితమయ్యిందన్న భయమూ మీకుండదు. ఇదిగో... ఈ బుజ్జి మెషీన్ ఐస్క్యాండీలను చకచకా చేసేస్తుంది. దీని పైభాగం తీసి, ట్రేలాంటి దాంట్లో ఐస్ ముక్కలు వేయాలి. మూత పెట్టేసి, హ్యాండిల్ పట్టుకుని తిప్పితే... మెత్తటి ఐస్ముద్ద కిందపడుతుంది. దీన్ని తీసుకుని, స్టిక్ చుట్టూ పెట్టి ఐస్‌లాగా చేసి... చక్కెర, రంగు కలిపిన నీటిని దానిమీద పోయాలి. అంతే... ఐస్‌క్యాండీ రెడీ! మీకు నచ్చిన రంగులు వేసుకోవచ్చు. వెనిల్లా కలిపిన పాలు, బాదంపాలు వంటివి వేసినా కూడా సూపర్‌గా ఉంటుంది. ఐస్‌క్యాండీ మెషీన్లు సైజును బట్టి రూ. 400 నుంచి రూ. 700 ఖరీదులో లభిస్తున్నాయి. బాగా తక్కువలో కావాలంటే ఆన్లైన్ స్టోర్స్‌లో కొనడం మంచిది. అందులో అయితే రూ. 250కే వచ్చేస్తుంది. -
వాయనం: మొక్కలు... మీకు మంచి నేస్తాలు!
ఇంట్లో ఊరకే ఉంటే బోర్ కొడుతోంది అని కొందరు గృహిణులు ఫీలవుతుంటారు. చదువుకుని కూడా ఇంట్లో కూచోవాలంటే కష్టంగా ఉంది అని కొందరు మహిళలు వాపోతుంటారు. చదువుకోని గృహిణులైనా, చదువుకుని పరిస్థితుల కారణంగా ఇంట్లో ఉండాల్సి వచ్చినవారైనా... బోర్ ఫీలవ్వాల్సిన పని లేదు. చేయాలే కానీ చేతినిండా బోలెడు పనులు. పని అంటే రోజూ చేసే ఇంటిపని లాంటిది కాదు. సంతోషాన్ని, మానసికోల్లాసాన్ని కలిగించే పనులు బోలెడు చేయవచ్చు. వాటిలో గార్డెనింగ్ ఒకటి. పల్లెటూళ్లలో ఇళ్ల ముందు ఖాళీ స్థలం ఉంటుంది. దాంతో రెండు పూలమొక్కలో, నాలుగు కూరగాయ మొక్కలో వేసేస్తుంటారు. వాటికవే పెరుగుతాయి. పూస్తాయి, కాస్తాయి. కానీ పట్టణాల్లో అది సాధ్యం కాదు. అసలు ఇళ్ల దగ్గర స్థలమే ఉండదు. అంతా సిమెంటు చేసి ఉంటుంది. కాబట్టి ఆర్టిఫీషియల్ గార్డెన్‌ని మనమే సృష్టించుకోవాలి. అలాగని దానికి బోలెడంత డబ్బు ఖర్చు చేయాల్సిన పనేమీ లేదు. మొక్కలు కొని తెచ్చుకుంటే చాలు. కుండీలు మన దగ్గరే ఉంటాయి. వాడని గాజు సీసాల్లో మట్టి వేసి విత్తనాలు వే యవచ్చు. తీగల్లాంటి వాటిని పాకించవచ్చు. పాతబడి పోయిన గిన్నెలు, టబ్బులు, బక్కెట్లు వంటి వాటిలో కూడా మొక్కలు వేసుకోవచ్చు. చూడటానికి బాగోదు అనుకుంటే ఓ రెండు పెయింటు డబ్బాలు కొనుక్కురండి. ముందు అన్నిటికీ ఒక రంగు పెయింటు వేసేయండి. ఆరిన తరువాత రెండో రంగు పెయింటుతో ఏవైనా చిన్న చిన్న డిజైన్లు వేయండి. పాతబడి, పాడుబడిన వస్తువులే అందమైన కుండీలుగా మారిపోతాయి. పైగా కుండీలకు పెట్టే ఖర్చులో సగం కంటే తక్కువతో పని అయిపోతుంది. ఇక మొక్కల సంగతి. నీరు ఎక్కువగా దొరకని ప్రదేశాల్లో ఉంటే కనుక... తక్కువ నీటితో పెరిగే మొక్కల్ని తెచ్చుకోవాలి. టీపొడి, గుడ్డు గుల్లలు లాంటి సహజ ఎరువులను వాడితే ఆ ఖర్చు కూడా తగ్గుతుంది. గార్డెన్ అన్నాం కదా అని ఒకేసారి బోలెడు మొక్కలు వేసేయక్కర్లేదు. మెల్లమెల్లగా ఒక్కోటీ తెచ్చుకోండి. కొద్ది రోజులకు మీ ఆవరణ అంతా అందమైన తోటగా మారిపోతుంది. అందమైన ఫలాలను, పుష్పాల అందాలను చూస్తే మీకు గార్డెనింగ్ పట్ల బోలెడంత ఆసక్తి పుడుతుంది. ఉత్సాహమూ పెరుగుతుంది. బోర్ అన్న మాట మీ నుంచి దూరంగా పారిపోతుంది! ఒలవడం, నూరడం... ఇక చిటికెలో పని! వెల్లుల్లిని ఒలవడం అంత సులభం కాదు. దాని తొక్క తీస్తే గోళ్లు నొప్పి పుట్టి పుండ్లవుతాయి. ఇక దాన్ని దంచి పేస్ట్ చేయడం మరో పెద్ద పని. మిక్సీలో వేయవచ్చుగా అనవచ్చు. మిక్సీలో వేయాలంటే కాసిన్ని ఎక్కువ రేకులు వేయాలి. మూడు, నాలుగు వేస్తే పని చేయదు. అయితే ఈ రెండు సమస్యలకూ ఒకేసారి పరిష్కారం దొరుకుతోందిప్పుడు. ఈ ఫోటోల్లో రెండు రకాల పరికరాలున్నాయి. కాస్త పొడవుగా, రంగురంగుల ప్లాస్టిక్ గొట్టాల్లా ఉన్నవి... గార్లిక్ పీలర్స్. ఈ గొట్టంలో వెల్లుల్లి రేకులు వేసి, ఫొటోలో చూపినట్టుగా అటూ ఇటూ తిప్పాలి. ఓ నిమిషం తరువాత తీసి చూస్తే రేకుల నుంచి తొక్క వేరవుతుంది. ఇక పచ్చగా, చిన్న డబ్బాలా ఉన్న రెండో వస్తువు... గార్లిక్ డైసర్. తొక్క తీసిన వెల్లుల్లి రేకులను ఇందులో వేసి, మూత పెట్టి, రెండు నిమిషాల పాటు మూతని గుండ్రంగా తిప్పితే చాలు... రేకులు చిన్ని చిన్ని ముక్కలవుతాయి. పేస్ట్ కావాలంటే ఇంకాసేపు తిప్పితే సరి. తక్కువ మోతాదులో చేసుకోవాలనుకున్నప్పుడు, కరెంటు పోయినప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఖరీదు కూడా చాలా తక్కువ... 200 రూపాయలు. పీలర్ రేటు రూ. 75. కొన్ని ఆన్లైన్ స్టోర్స్‌లో రెండూ కలిపి ప్యాకేజ్‌లా కూడా దొరుకుతున్నాయి. వెల రూ. 245.