వాయనం: మొక్కలు... మీకు మంచి నేస్తాలు! | Plants are making with good friends | Sakshi
Sakshi News home page

వాయనం: మొక్కలు... మీకు మంచి నేస్తాలు!

Published Sun, Jun 8 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 8:27 AM

వాయనం: మొక్కలు... మీకు మంచి నేస్తాలు!

వాయనం: మొక్కలు... మీకు మంచి నేస్తాలు!

ఇంట్లో ఊరకే ఉంటే బోర్ కొడుతోంది అని కొందరు గృహిణులు ఫీలవుతుంటారు. చదువుకుని కూడా ఇంట్లో కూచోవాలంటే కష్టంగా ఉంది అని కొందరు మహిళలు వాపోతుంటారు. చదువుకోని గృహిణులైనా, చదువుకుని పరిస్థితుల కారణంగా ఇంట్లో ఉండాల్సి వచ్చినవారైనా... బోర్ ఫీలవ్వాల్సిన పని లేదు. చేయాలే కానీ చేతినిండా బోలెడు పనులు. పని అంటే రోజూ చేసే ఇంటిపని లాంటిది కాదు. సంతోషాన్ని, మానసికోల్లాసాన్ని కలిగించే పనులు బోలెడు చేయవచ్చు. వాటిలో గార్డెనింగ్ ఒకటి.
 
 పల్లెటూళ్లలో ఇళ్ల ముందు ఖాళీ స్థలం ఉంటుంది. దాంతో రెండు పూలమొక్కలో, నాలుగు కూరగాయ మొక్కలో వేసేస్తుంటారు. వాటికవే పెరుగుతాయి. పూస్తాయి, కాస్తాయి. కానీ పట్టణాల్లో అది సాధ్యం కాదు. అసలు ఇళ్ల దగ్గర స్థలమే ఉండదు. అంతా సిమెంటు చేసి ఉంటుంది. కాబట్టి ఆర్టిఫీషియల్ గార్డెన్‌ని మనమే సృష్టించుకోవాలి. అలాగని దానికి బోలెడంత డబ్బు ఖర్చు చేయాల్సిన పనేమీ లేదు.
 
  మొక్కలు కొని తెచ్చుకుంటే చాలు. కుండీలు మన దగ్గరే ఉంటాయి. వాడని గాజు సీసాల్లో మట్టి వేసి విత్తనాలు వే యవచ్చు. తీగల్లాంటి వాటిని పాకించవచ్చు. పాతబడి పోయిన గిన్నెలు, టబ్బులు, బక్కెట్లు వంటి వాటిలో కూడా మొక్కలు వేసుకోవచ్చు. చూడటానికి బాగోదు అనుకుంటే ఓ రెండు పెయింటు డబ్బాలు కొనుక్కురండి. ముందు అన్నిటికీ ఒక రంగు పెయింటు వేసేయండి. ఆరిన తరువాత రెండో రంగు పెయింటుతో ఏవైనా చిన్న చిన్న డిజైన్లు వేయండి. పాతబడి, పాడుబడిన వస్తువులే అందమైన కుండీలుగా మారిపోతాయి. పైగా కుండీలకు పెట్టే ఖర్చులో సగం కంటే తక్కువతో పని అయిపోతుంది.
 
 ఇక మొక్కల సంగతి. నీరు ఎక్కువగా దొరకని ప్రదేశాల్లో ఉంటే కనుక... తక్కువ నీటితో పెరిగే మొక్కల్ని తెచ్చుకోవాలి.  టీపొడి, గుడ్డు గుల్లలు లాంటి సహజ ఎరువులను వాడితే ఆ ఖర్చు కూడా తగ్గుతుంది.  గార్డెన్ అన్నాం కదా అని ఒకేసారి బోలెడు మొక్కలు వేసేయక్కర్లేదు. మెల్లమెల్లగా ఒక్కోటీ తెచ్చుకోండి. కొద్ది రోజులకు మీ ఆవరణ అంతా అందమైన తోటగా మారిపోతుంది. అందమైన ఫలాలను, పుష్పాల అందాలను చూస్తే మీకు గార్డెనింగ్ పట్ల బోలెడంత ఆసక్తి పుడుతుంది. ఉత్సాహమూ పెరుగుతుంది. బోర్ అన్న మాట మీ నుంచి దూరంగా పారిపోతుంది!  
 
 ఒలవడం, నూరడం... ఇక చిటికెలో పని!  వెల్లుల్లిని ఒలవడం అంత సులభం కాదు. దాని తొక్క తీస్తే గోళ్లు నొప్పి పుట్టి పుండ్లవుతాయి. ఇక దాన్ని దంచి పేస్ట్ చేయడం మరో పెద్ద పని. మిక్సీలో వేయవచ్చుగా అనవచ్చు. మిక్సీలో వేయాలంటే కాసిన్ని ఎక్కువ రేకులు వేయాలి. మూడు, నాలుగు వేస్తే పని చేయదు. అయితే ఈ రెండు సమస్యలకూ ఒకేసారి పరిష్కారం దొరుకుతోందిప్పుడు.
 
 ఈ ఫోటోల్లో రెండు రకాల పరికరాలున్నాయి. కాస్త పొడవుగా, రంగురంగుల ప్లాస్టిక్ గొట్టాల్లా ఉన్నవి... గార్లిక్ పీలర్స్. ఈ గొట్టంలో వెల్లుల్లి రేకులు వేసి, ఫొటోలో చూపినట్టుగా అటూ ఇటూ తిప్పాలి. ఓ నిమిషం తరువాత తీసి చూస్తే రేకుల నుంచి తొక్క వేరవుతుంది. ఇక పచ్చగా, చిన్న డబ్బాలా ఉన్న రెండో వస్తువు... గార్లిక్ డైసర్. తొక్క తీసిన వెల్లుల్లి రేకులను ఇందులో వేసి, మూత పెట్టి, రెండు నిమిషాల పాటు మూతని గుండ్రంగా తిప్పితే చాలు... రేకులు చిన్ని చిన్ని ముక్కలవుతాయి. పేస్ట్ కావాలంటే ఇంకాసేపు తిప్పితే సరి. తక్కువ మోతాదులో చేసుకోవాలనుకున్నప్పుడు, కరెంటు పోయినప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఖరీదు కూడా చాలా తక్కువ... 200 రూపాయలు. పీలర్ రేటు రూ. 75. కొన్ని ఆన్‌లైన్ స్టోర్స్‌లో రెండూ కలిపి ప్యాకేజ్‌లా కూడా దొరుకుతున్నాయి. వెల రూ. 245.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement