మీ ఇంటికి మీరే ఫైనాన్స్ మినిస్టర్!
వాయనం: ఇంటిని బాగా మేనేజ్ చేయాలంటే డబ్బుని మేనేజ్ చేయడం రావాలి. చాలామంది గృహిణులు డబ్బు వ్యవహారాలు మగాళ్లకు సంబంధించినవని అనుకుంటారు. అది సరికాదు. ఇంట్లో దేనికి ఖర్చు చేయాలి, ఎంత చేయాలి, ఎంత నిల్వ చేయవచ్చు వంటి విషయాలు ఇంటిని చక్కబెట్టే మహిళలకు తెలిసినంతగా వారి భర్తలకు తెలియవు. కాబట్టి మనీ మేనేజ్‌మెంట్ మీద గృహిణులు దృష్టి పెట్టి తీరాలి.
ఆర్థికాంశాలను అర్థం చేసుకోవడం, ఆర్థిక వ్యవహారాలను సమగ్రంగా నిర్వహించడం పెద్ద పనేమీ కాదు. ఎంత వస్తుంది, ఎన్ని ఖర్చులున్నాయి అన్న విషయాలు స్పష్టంగా తెలిస్తే చాలు. చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. ముందుగా మీకున్న ఖర్చులన్నీ ఓ చోట రాసుకోండి. ఆపైన వచ్చే ఆదాయం ఎంత ఉందో చూసుకోండి. ఆదాయం కంటే ఖర్చు ఎప్పుడూ తక్కువగానే ఉండాలన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలా చేసుకోవడం రాక చాలామంది అవస్థ పడుతుంటారు. కానీ కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే అది సాధ్య పడుతుంది. ఇంటి ఖర్చులకెంత, పిల్లలకెంత, మీవారి పాకెట్ మనీకి ఎంత అంటూ అవసరాలను విడగొట్టుకోవాలి.
ఆపైన వాటిలో ఎంత పొదుపు చేయగలం అని చూడాలి. ఇంటి ఖర్చులనే తీసుకోండి. ఉప్పు దగ్గర్నుంచి ఏసీ వరకూ ఇప్పుడు ప్రతి వస్తువుకీ రెండు మూడు ఆప్షన్స్ ఉంటున్నాయి. వాటిలో ఏది బెస్ట్ అని చూడటం మానేసి, వాటిలో మన దగ్గరున్న డబ్బుకి ఏది బెస్ట్ అని చూసుకోవడం ఉత్తమం. అలా అని చెత్త వస్తువు కొనమని కాదు. మంచి వాటిలోనే కొంతలో కొంత తక్కువకు వచ్చేది తీసుకోమని. పిల్లల ఫీజుల విషయంలో ఏమీ చేయలేం. కాకపోతే వారికి కొనే వస్తువుల విషయంలో కొంత పొదుపు చేయవచ్చు. ఇప్పుడు ప్రతి చిన్న ఊరిలోనూ ఇంటర్నెట్ ఉంటోంది. కాబట్టి ఆన్‌లైన్ షాపింగ్ చేయడం నేర్చుకోండి. వంట సామాన్ల దగ్గర నుంచి బేబీ డైపర్‌స దాకా అక్కడ దొరికినంత తక్కువగా మరెక్కడా దొరకవు. పది నిమిషాల పని. పది రూపాయలు మిగిలినా పొదుపే కదా!
మొదట ప్లాన్ చేసుకున్నప్పుడే ఈ నెల ఇంత మిగల్చాలి అను కుని, ఆ మొత్తాన్ని పక్కన పెట్టేసి, అది లేదనుకుని మిగతావన్నీ చేసుకోండి. లేకపోతే పొదుపు చేయడం జన్మలో అలవడదు. పొదుపు మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అర్థమైందిగా, మరి మీ ఇంటి ఫైనాన్స్ మినిస్టర్ పదవిని చేపట్టండిక!
ఐస్‌క్యాండీ... మీరే చేయండి!
చల్లచల్లని, తీయతీయని ఐస్‌క్యాండీ తినడం పిల్లలకే కాదు... పెద్దలకూ సరదానే. ఉత్తర భారతదేశంలో అందరికీ ప్రీతిపాత్రమైన ఈ ఐస్... మెల్లగా మనవాళ్లకూ దగ్గరయ్యింది. అయితే రోడ్ల పక్కన అమ్మే వీటిని పిల్లలకు కొనివ్వాలంటే తల్లిదండ్రులు కాస్త భయపడుతుంటారు... దుమ్మూ ధూళీ వచ్చి పడివుంటుందని. అలా చెబితే పిల్లలు ఊరుకుంటారా? తినాల్సిందేనని మారాం చేస్తారు. కాబట్టి మీరే ఇంట్లో చేసిచ్చేశారనుకోండి... వాళ్ల కోరికా తీరుతుంది, కలుషితమయ్యిందన్న భయమూ మీకుండదు.
ఇదిగో... ఈ బుజ్జి మెషీన్ ఐస్‌క్యాండీలను చకచకా చేసేస్తుంది. దీని పైభాగం తీసి, ట్రేలాంటి దాంట్లో ఐస్ ముక్కలు వేయాలి. మూత పెట్టేసి, హ్యాండిల్ పట్టుకుని తిప్పితే... మెత్తటి ఐస్‌ముద్ద కిందపడుతుంది. దీన్ని తీసుకుని, స్టిక్ చుట్టూ పెట్టి ఐస్‌లాగా చేసి... చక్కెర, రంగు కలిపిన నీటిని దానిమీద పోయాలి. అంతే... ఐస్‌క్యాండీ రెడీ! మీకు నచ్చిన రంగులు వేసుకోవచ్చు. వెనిల్లా కలిపిన పాలు, బాదంపాలు వంటివి వేసినా కూడా సూపర్‌గా ఉంటుంది. ఐస్‌క్యాండీ మెషీన్‌లు సైజును బట్టి రూ. 400 నుంచి రూ. 700 ఖరీదులో లభిస్తున్నాయి. బాగా తక్కువలో కావాలంటే ఆన్‌లైన్ స్టోర్స్‌లో కొనడం మంచిది. అందులో అయితే రూ. 250కే వచ్చేస్తుంది.