సాక్షి, చెన్నై: ఇంటి యజమానులుగా ఉన్న గృహిణులకు నెలనెలా రూ. 1000 నగదు పంపిణీ చేసే పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నామని పుదుచ్చేరి సీఎం ఎన్‌రంగస్వామి తెలిపారు. అలాగే అదనంగా 16 వేల మంది వృద్ధులకు పింఛన్లు మంజూరు చేయనున్నామని వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసి కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అభివృద్ధికి రూ. 2000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
ఇందుకు వారు సానుకూలంగా స్పందించారని రూ. 1,400 కోట్లను కేటాయించేందుకు ఆమోదించినట్లు చెప్పారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. విమానాశ్రయం విస్తరణ పనులపై దృష్టి పెట్టామని, అయితే తమిళనాడు ప్రభుత్వం స్థలం ఇంతవరకు కేటాయించ లేదని తెలిపారు. పుదుచ్చేరి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్‌త.. ఆర్థికంగా, పారిశ్రామికంగా తమ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
హెల్త్ పార్క్..
సేదార పట్టిలో పారిశ్రామిక వాడ కోసం 800 ఎకరాల స్థలాన్ని కేంద్రానికి అప్పగించామని, అయితే ప్రస్తుతం ఆ స్థలం మళ్లీ రాష్ట్రం గుప్పెట్లోకి చేరిందన్నారు. ఈ స్థలానికి మరో 200 ఎకరాలను కలిపి 1000 ఎకరాల్లో హెల్త్‌పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో కుటుంబ యజమానులుగా ఉన్న గృహిణిలకు రూ. 1000 పథకం గురించి బడ్జెట్‌లో ప్రకటన చేశామని తెలిపారు. దీనిని త్వరలో ఆచరణలో పెట్టనున్నామని వెల్లడించారు. అదనంగా 16 వేల మందికి వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే 2 వేల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment