Thousand rupees
-
త్వరలో గృహిణులకు నెలనెలా రూ. 1000
సాక్షి, చెన్నై: ఇంటి యజమానులుగా ఉన్న గృహిణులకు నెలనెలా రూ. 1000 నగదు పంపిణీ చేసే పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నామని పుదుచ్చేరి సీఎం ఎన్‌రంగస్వామి తెలిపారు. అలాగే అదనంగా 16 వేల మంది వృద్ధులకు పింఛన్లు మంజూరు చేయనున్నామని వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసి కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అభివృద్ధికి రూ. 2000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించారని రూ. 1,400 కోట్లను కేటాయించేందుకు ఆమోదించినట్లు చెప్పారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. విమానాశ్రయం విస్తరణ పనులపై దృష్టి పెట్టామని, అయితే తమిళనాడు ప్రభుత్వం స్థలం ఇంతవరకు కేటాయించ లేదని తెలిపారు. పుదుచ్చేరి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్త.. ఆర్థికంగా, పారిశ్రామికంగా తమ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. హెల్త్ పార్క్.. సేదార పట్టిలో పారిశ్రామిక వాడ కోసం 800 ఎకరాల స్థలాన్ని కేంద్రానికి అప్పగించామని, అయితే ప్రస్తుతం ఆ స్థలం మళ్లీ రాష్ట్రం గుప్పెట్లోకి చేరిందన్నారు. ఈ స్థలానికి మరో 200 ఎకరాలను కలిపి 1000 ఎకరాల్లో హెల్త్‌పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో కుటుంబ యజమానులుగా ఉన్న గృహిణిలకు రూ. 1000 పథకం గురించి బడ్జెట్లో ప్రకటన చేశామని తెలిపారు. దీనిని త్వరలో ఆచరణలో పెట్టనున్నామని వెల్లడించారు. అదనంగా 16 వేల మందికి వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే 2 వేల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నామని ప్రకటించారు. -
పింఛన్ పోయింది.. గుండె ఆగింది!
కొత్తూరు: సెంటు భూమి కూడా లేని అతనికి పింఛన్ సర్వే కమిటీ సభ్యులు ఏకంగా ఐదు ఎకరాలు ఉన్నట్టు రికార్డుల్లో నమోదు చేశారు. ఫలితంగా సుమారు పదేళ్లుగా తీసుకుంటున్న వృద్ధాప్య పింఛన్‌ను అధికారులు నిలిపివేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన గుండె ఆగిపోయింది.. కుటుంబ సభ్యులను ఆవేదనకు గురి చేసింది. ఈ విషాద ఘటన కొత్తూరు మండలంలోని సిర్సువాడలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నక్క ఎండు (68)కు సెంటు భూమి కూడా లేదు. ఇతను సుమారు పదేళ్లుగా వృద్ధాప్య పింఛన్‌ను అందుకుంటున్నాడు. ఇటీవల టీడీపీ సర్కార్ పింఛన్‌ను వెయ్యి రూపాయలకు పెంచడంతో అతనితోపాటు కుటుంబ సభ్యులు కూడా సంబరపడిపోయూడు. అయితే ఇటీవల ప్రభుత్వం పింఛన్ల సర్వేను చేపట్టింది. ఈ క్రమంలో సెంటు భూమి కూడా లేని ఎండు పేరున ఐదు ఎకరాలు ఉన్నట్టు సర్వే బృందాలు రికార్డుల్లో నమోదు చేయడంతో అతని పింఛన్‌ను అధికారులు నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న అతను అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగి పింఛన్‌ను పునరుద్ధరించాలని వేడుకున్నాడు. అయినా ఎవరూ కనికరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎండు మంచం పట్టి గురువారం మృతి చెందినట్టు అతని భార్య దాలమ్మ రోదిస్తూ చెప్పింది. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎస్ఆర్డీహెచ్ కమిటీ పేరుతో నిరు పేదలమైన తమలాంటి వారి పింఛన్ రద్దు చేయడం దారుణమని వాపోయింది. సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే తన భర్త మృతి చెందాడని, పాలకులే ఆదుకోవాలని డిమాండ్ చేసింది. మృతుడు ఎండుకు భార్త దాలమ్మ, కుమారుడు రాంబాబు, కుమార్తె విజయలక్ష్మిలు ఉన్నారు. -
ఓటర్లు చేతులు చాచడం వల్లే.. : ఎంపీ మాగంటి
నూజివీడు : ఎన్నికలప్పుడు ఓటర్లు ఐదొందలకో, వెయ్యి రూపాయలకో చేతులు చాచడం వల్లనే ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా తమ పదవులను అడ్డంపెట్టుకుని చేతులు చాస్తున్నారని ఏలూరు ఎంపీ మాగంటి బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లా నూజివీడు 28వ వార్డులో మంగళవారం నిర్వహించిన జన్మభూమి సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మాగంటి మాట్లాడుతూ.. ఓటర్లు ఇప్పటికైనా మారితేనే వారి జీవితాల్లో మార్పు వస్తుందని, మారకపోతే ఎప్పటికీ మారవని చెప్పారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు శాసనసభ స్థానాలుండగా, ఆరు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే గెలుపొందారని, నూజివీడులో మాత్రం టీడీపీ అభ్యర్థిని ఓడగొట్టారన్నారు. ఎంపీగా తాను 10 వేల మెజారిటీని కోల్పోయానని, మున్సిపాల్టీలో కూడా పార్టీని ఓడించారని, అదే టీడీపీని గెలిపించినట్లయితే ఎంతో లాభం ఉండేదని వ్యాఖ్యానించారు. ఏపీని ప్రపంచబ్యాంకుకు అడ్డం పెట్టయినా రుణమాఫీ ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ బ్యాంకుకు అడ్డంపెట్టైనా చంద్రబాబు రైతు రుణమాఫీ చేస్తారని ఏలూరు ఎంపీ మాగంటి బాబు అన్నారు. పట్టణంలోని 28వ వార్డులో నిర్వహించిన జన్మభూమి వార్డుసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. టీడీపీ ప్రభుత్వం పింఛన్ నగదును పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. జన్మభూమా...! రాజకీయసభా ! 28వ వార్డులో నిర్వహించిన వార్డుసభ రాజకీయ సభలా మారింది. వార్డుసభలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు పాల్గొనగా, ఆయనతో పాటు టీడీపీ నాయకులు నూతక్కివేణు, కాపా శ్రీనివాసరావు సైతం స్టేజీపైకి ఎక్కారు. దీంతో స్థానికులు ఇది జన్మభూమి కార్యక్రమమా, రాజకీయసభా అని నోరెళ్ల బెట్టారు. ఇదిలా ఉండగా ముసునూరు, చాట్రాయి మండలాల్లోని జన్మభూమి గ్రామసభల్లో పాల్గొన్న టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పట్టణంలో మాత్రం పాల్గొనలేదు. అలాగే ఈ సభల్లో పాల్గొనాల్సిన మంత్రి కామినేని శ్రీనివాస్ పట్టణంలోనే ఉన్నప్పటికీ డుమ్మా కొట్టారు. -
ఏటీఎంలో దొంగ నోటు..?
రాజాం: స్థానిక స్టేట్‌బ్యాంక్ ఏటీఎం నుంచి మంగళవారం వెయ్యి రూపాయల దొంగనోటు బయటపడింది. పట్టణానికి చెందిన న్యాయవాది శాసపు అప్పలనాయుడు రెండు విడతలుగా బ్యాంకు ఏటీఎం నుంచి రూ.40 వేలను విత్ డ్రా చేసి మరో బ్యాంకులో జమ చేయడానికి వెళ్లగా అందులో ఒక వెయ్యి రూపాయల దొంగనోటు బయటపడడంతో బ్యాంకు అధికారులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని స్టేట్‌బ్యాంకు మేనేజర్ వినోద్‌కుమార్ వద్ద అప్పలనాయుడు ప్రస్తావించారు. తాము ఏటీఎంలో పెట్టిన నోట్లున పరిశీలించి పెడతామని, దొంగనోట్లు వచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. బ్యాంకు ఏటీఎంలో పెట్టిన నోట్ల నెంబర్లు మీ వద్ద ఉంటాయా అని న్యాయవాది ప్రశ్నించగా అటువంటివి నమోదు చేయమని, పాత, కొత్త నోట్లు లక్షల రూపాయలను స్థానికంగా ఉన్న నాలుగు ఏటీఎంలలో పెడతామని అన్నారు. దీనిపై ఫిర్యాదు ఇస్తే ఉన్నతాధికారులకు పంపించి చర్యలు తీసుకుంటామని మేనేజర్ స్పష్టం చేశారు. -
మా అమ్మలా ఉంటే బాగుండు!
మనోగతం మా చిన్నప్పుడు ఇంటికెవరొచ్చినా... ఎంతమంది బంధువులొచ్చినా మా అమ్మ ఎలాంటి ఆందోళనా పడకుండా వారికి మర్యాదలు చేసేది. భోజనాలు, చిరుతిళ్లు, వాళ్లు వెళ్లేటప్పుడు ఫలహారాలు అంటూ బోలెడు ఖర్చులుండేవి. అన్నింటినీ అమ్మే చూసుకునేది. అలాగని అమ్మ అడిగినపుడల్లా నాన్నగారు డబ్బులిచ్చే పరిస్థితేమీ ఉండేది కాదు. ఇచ్చిన డబ్బుల్ని మాత్రం అమ్మ చాలా జాగ్రత్తగా ఉపయోగించేది. అనవసరపు ఖర్చులు చేయకుండా ఎప్పుడూ చేతిలో పది రూపాయలు ఉండేలా ప్లాన్ చేసుకునేది. నాన్నగారు ఇచ్చే డబ్బులకు తోడు అప్పుడప్పుడు నెయ్యి అమ్మిన డబ్బులు కూడా అమ్మ పోపులడబ్బాలోకే వచ్చేవి. అక్కలకు, నాకు ఎప్పుడైనా చిన్న చిన్న ఖర్చులుంటే కూడా అమ్మే చూసుకునేది. వంద రూపాయలకు ఇంటినిండా సరుకులొచ్చే రోజుల్లో అమ్మ దగ్గర ఎప్పుడూ యాభై, వందా ఉండేవి. ఇప్పుడు కాలం మారింది...వెయ్యి రూపాయలకు కూడా సరుకుల సంచి సగం నిండడం లేదు. నేను జీతం రాగానే నా భార్యకు ఇంటి ఖర్చుల నిమిత్తం ఇంత మొత్తమని ఇస్తాను. ఆమె కూడా చిన్న ఉద్యోగం చేస్తోంది. ఇంటి ఖర్చుల కోసం ఆమె జీతం కూడా ఖర్చు పెడుతుంది. నేను పెద్ద పొదుపు మాస్టార్ని కాకపోయినా...ఖర్చు మనిషిని కాదు. అయినా మగవాళ్లు ఆడవాళ్లలా డబ్బుల్ని దాచుకోలేరు కదా! విషయమేమిటంటే...నా భార్య దగ్గర కూడా ఎప్పుడూ పైసా ఉండదు. అవసరానికి ఆడవాళ్లే ఆదుకోవడం అనేది ఈ రోజు నేను కోరుకునే కోరిక కాదు. అనాది నుంచి ఇంటికి ఆపద్బాంధవులు ఆడవారే అన్నది అందరిళ్లలో అమ్మలు నిరూపించారు. కానీ ఈతరం ఆడవాళ్లు అంతటి పాత్రను పోషించలేకపోతున్నారు. నా భార్యనే ఉదాహరణగా తీసుకోండి. ఉద్యోగిని అయి ఉండి కూడా చాటున పట్టుమని పది రూపాయలు దాచలేకపోతోంది. అదేంటని అడిగితే ‘ఆ పని మీరు చేయొచ్చు కదా!’ అంటోంది. ఆ మధ్య సడెన్‌గా మా బంధువులెవరో వస్తే....ఇద్దరి చేతుల్లో ఒక్క రూపాయి లేదు. ఆ సమయంలో నాకు అమ్మ గుర్తొచ్చింది. ఈ విషయం నా స్నేహితుల దగ్గర చెబితే...‘చెప్పావులే కొత్త విషయం...మా ఇంట్లో తంతు కూడా ఇంతే’ అన్నారు. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే...నేటి మహిళకు సంపాదించడం వచ్చింది కానీ, దాచుకోవడం రావడం లేదు. అదీ వచ్చి, ఆమె కూడా మా అమ్మలా అయితే ఎంత బాగుండు! - బి. కేశవులు, వేములవాడ