ఓటర్లు చేతులు చాచడం వల్లే.. : ఎంపీ మాగంటి
నూజివీడు : ఎన్నికలప్పుడు ఓటర్లు ఐదొందలకో, వెయ్యి రూపాయలకో చేతులు చాచడం వల్లనే ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా తమ పదవులను అడ్డంపెట్టుకుని చేతులు చాస్తున్నారని ఏలూరు ఎంపీ మాగంటి బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లా నూజివీడు 28వ వార్డులో మంగళవారం నిర్వహించిన జన్మభూమి సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మాగంటి మాట్లాడుతూ.. ఓటర్లు ఇప్పటికైనా మారితేనే వారి జీవితాల్లో మార్పు వస్తుందని, మారకపోతే ఎప్పటికీ మారవని చెప్పారు.
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు శాసనసభ స్థానాలుండగా, ఆరు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే గెలుపొందారని, నూజివీడులో మాత్రం టీడీపీ అభ్యర్థిని ఓడగొట్టారన్నారు. ఎంపీగా తాను 10 వేల మెజారిటీని కోల్పోయానని, మున్సిపాల్టీలో కూడా పార్టీని ఓడించారని, అదే టీడీపీని గెలిపించినట్లయితే ఎంతో లాభం ఉండేదని వ్యాఖ్యానించారు.
ఏపీని ప్రపంచబ్యాంకుకు అడ్డం పెట్టయినా రుణమాఫీ
ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ బ్యాంకుకు అడ్డంపెట్టైనా చంద్రబాబు రైతు రుణమాఫీ చేస్తారని ఏలూరు ఎంపీ మాగంటి బాబు అన్నారు. పట్టణంలోని 28వ వార్డులో నిర్వహించిన జన్మభూమి వార్డుసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. టీడీపీ ప్రభుత్వం పింఛన్ నగదును పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు.
జన్మభూమా...! రాజకీయసభా !
28వ వార్డులో నిర్వహించిన వార్డుసభ రాజకీయ సభలా మారింది. వార్డుసభలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు పాల్గొనగా, ఆయనతో పాటు టీడీపీ నాయకులు నూతక్కివేణు, కాపా శ్రీనివాసరావు సైతం స్టేజీపైకి ఎక్కారు. దీంతో స్థానికులు ఇది జన్మభూమి కార్యక్రమమా, రాజకీయసభా అని నోరెళ్ల బెట్టారు. ఇదిలా ఉండగా ముసునూరు, చాట్రాయి మండలాల్లోని జన్మభూమి గ్రామసభల్లో పాల్గొన్న టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పట్టణంలో మాత్రం పాల్గొనలేదు. అలాగే ఈ సభల్లో పాల్గొనాల్సిన మంత్రి కామినేని శ్రీనివాస్ పట్టణంలోనే ఉన్నప్పటికీ డుమ్మా కొట్టారు.