మన ఆశనే ఆసరాగా చేసుకుని చేసే మోసాలలో ‘పే’ యాప్‌ల ద్వారా క్యాష్‌ను కొల్లగొట్టడం ఒకటి. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎమ్ .. ఏ అప్లికేషన్ ద్వారా అయినా మీరు నగదు లావాదేవీలు చేస్తున్నప్పుడు జాగ్రత్త తప్పనిసరి.
కుమారి (పేరు మార్చడమైనది) టీవీ చూస్తుండగా ఫోన్ కాల్ వచ్చింది. ‘మేడమ్, మీరు ఆన్‌లైన్ షాపింగ్‌లో ఫోన్ కొనుగోలు చేశారు కదా! మీకు రూ.4,999 క్యాష్‌బ్యాక్ ఆఫర్ వచ్చింది. ఆ మనీ మీ బ్యాంక్ అకౌంట్‌లోకి రావాలంటే నేను చెప్పే పద్ధతులను జాగ్రత్తగా ఫాలో అవ్వండి చాలు. ఈ మొత్తం మీ అకౌంట్‌లోకి వచ్చేస్తుంది’ అని చెప్పింది అవతలి వ్యక్తి. దాంతో ఫోన్ పే ద్వారా ఫోన్‌లో అవతలి వ్యక్తి చెబుతున్న విధంగా వివరాలను జాగ్రత్తగా పొందుపరిచింది కుమారి. ‘మీ బ్యాంక్‌లో నగదు జమ అయింది. చెక్ చేసుకోండి మేడమ్, థాంక్యూ’ అని ఫోన్ కట్ అయింది. పే యాప్‌లో చెక్ చేసుకుంది కుమారి. క్రెడిట్ అవ్వాల్సిన నగదు కాస్తా డెబిట్ అయ్యింది. తన అకౌంట్‌లో నుంచి నగదు తగ్గిపోయి, వేరేవాళ్ల అకౌంట్‌లోకి వెళ్లినట్టుగా యాప్ హిస్టరీలో ఉండటంతో షాక్ అయ్యింది కుమారి.
స్మూత్‌గా కొల్లగొడతారు
వేల రూపాయలే కాదు లక్షల్లోనూ డబ్బును యాప్‌ల ద్వారా కొల్లగొట్టే ఉపాయాలు పన్నుతున్నారు మోసగాళ్లు. ఫోన్ మాట్లాడుతూనే క్రెడిట్ చేస్తామని చెప్పిన నగదు మొత్తాన్ని, మన అకౌంట్ నుంచి మన చేత్తోనే డెబిట్ చేసుకుంటారు. పూర్తిగా వారి మాటలతో మనల్ని తమ ఆధీనంలోకి తీసుకుని, నిలువునా ముంచేస్తారు. బోనస్ పాయింట్లు వచ్చాయనో, లాటరీ తగిలిందనో, స్క్రాచ్ కార్డులో క్యాష్‌బ్యాక్ వచ్చిందనో, బ్యాంక్ మేనేజర్ అనో .. ఇలా ఈ కామర్స్ ఫ్రాడ్స్‌కి తెరలేపుతారు. అకౌంట్‌లో ఉన్న నగదును దోచేస్తారు.
పద్ధతిగా మోసం
మీరు ఏదైనా ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా ఒక వస్తువు బుక్ చేశారనుకోండి. ఆ వస్తువు డెలివరీ అయిన అరగంటలో మీకో ఫోన్ కాల్ వస్తుంది. అంటే, రకరకాల మార్గాల ద్వారా మీ ఫోన్ నెంబర్‌ను హ్యాకర్లు హ్యాక్ చేస్తారు. మీ వివరాలన్నీ తెలియజేస్తూ, వాటి పనితనం గురించి చెబుతూ తిరిగి సర్వీస్ అందించాలంటే ఫలానా ఫోన్ నెంబర్‌కి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెబుతారు. ఆ ‘కబుర్ల’ను నమ్మి ఫోన్ చేస్తే, బ్యాంకు వివరాలన్నీ రాబట్టడానికి ఎన్ని పద్ధతులు అవలంబించాలో అన్నీ అమలులో పెట్టేస్తారు.
సులభమైన మార్గాలు
డిజిటల్ లావాదేవీలు జీవితాన్ని సులభతరం చేశాయి. UPI ఇటీవలి కాలంలో ఎంచుకున్న సులభమైన చెల్లింపు పద్ధతుల్లో ఒకటి. మీ ఆర్థిక లావాదేవీకి అధికారం ఇవ్వడానికి మీకు కావలసిందల్లా కేవలం 4 అంకెల పిన్, మొత్తం బదిలీ ప్రక్రియ సెకన్లలో జరుగుతుంది. ఇది చాలా సౌలభ్యంగా ఉంటుంది.
దాదాపు అన్నిUPI యాప్‌లు అంటే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ సాంకేతికంగా సురక్షితమైనవి. అయితే ఫిషింగ్, విషింగ్, స్మిషింగ్, మాల్వేర్,ఐఎమ్ క్లోన్..ఇతరత్రా మార్గాలను ఉపయోగించి డబ్బును దొంగిలించడానికి మోసగాళ్లు రకరకాల ప్రణాళికలు రచిస్తుంటారు. ఇ–మోసగాళ్లకు సామాజిక ఇంజనీరింగ్ వ్యూహాలపై మంచి అవగాహన ఉండటం వల్ల మనం అత్యంత జాగ్రత్తగా ఉండటం అవసరం.
కబుర్లతో వల
మోసగాళ్లు సాధారణంగా ఇతరులను ఆకర్షించడానికి రకరకాల టార్గెట్‌లను ఎంచుకుంటారు. వాటిలో.. వారు తమను తాము బ్యాంక్ ప్రతినిధులుగా చెప్పుకుంటారు, కెవైసీ అప్‌డేట్ చేస్తున్నామని, బోనస్ పాయింట్లు వచ్చాయని, క్యాష్ బ్యాక్‌లను రిడీమ్ చేస్తున్నామని.. వంటి వాటిని ఫోన్ కాల్ రూపంలో మనతో మాట్లాడుతారు. స్క్రీన్ షేరింగ్ అవకాశాలను ఉపయోగించుకుంటారు.
స్కామర్లు మన ఫోన్‌కి వచ్చిన OTPని అడగచ్చు. కోడ్ చెప్పిన తర్వాత వారి ఫోన్ నుండే అనుమతిని ఓకే చేయమని కూడా అడగచ్చు. యాప్‌కు అవసరమైన అన్ని అనుమతులను పొందినప్పుడు, కాలర్ మన ఫోన్‌ని మనకే తెలియకుండా పూర్తిగా నియంత్రించడం ప్రారంభిస్తాడు. పూర్తి యాక్సెస్ పొందిన తర్వాత స్కామర్ పాస్‌వర్డ్‌లను దొంగిలించి, UPI ఖాతాతో లావాదేవీని ప్రారంభిస్తాడు. అకౌంట్‌లో ఉన్న మోత్తాన్ని ఖాళీ చేస్తాడు.
సురక్షిత చెల్లింపులకు
http: // ప్యాడ్ లాక్ సింబల్‌తో ఉన్న URL లింక్‌లను క్లిక్ చేయడం సురక్షితం.
కొనుగోలుదారు లేదా విక్రేతకు OTP/ MPIN/UPI నంబర్లను ఏ రూపంలోనూ షేర్ చేయవద్దు.
ముఖ్యంగా మీరు ఫోన్ కాల్‌లో ఉన్నప్పుడు చెల్లింపు లావాదేవీని ఎప్పుడూ చేయవద్దు.
కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన ఏవైనా షార్ట్ లింక్‌లను క్లిక్ చేసి పూరించవద్దు.
కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన గూగుల్ ఫారమ్‌ల లింక్‌లను అస్సలు పూరించవద్దు.
క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయవద్దు. మీరు స్కాన్ చేస్తున్న సమయంలోనే మీ ఖాతా నుండి డబ్బు డెబిట్ అయ్యే అవకాశం ఉంది.
ఏదైనా బ్యాంకింగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్‌వేర్‌లు అంటే స్క్రీన్ షేర్, ఎనీ డెస్క్, టీమ్ వ్యూయర్ మొదలైన వాటిని స్మార్ట్‌ఫోన్ లలో ఉపయోగించడం పూర్తిగా మానుకోవాలి.మీ యాప్ కస్టమర్ సపోర్ట్ నంబర్‌ల కోసం గూగుల్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల్లో వెతకవద్దు.
Comments
Please login to add a commentAdd a comment