ఇతరుల బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బు దండుకునేందుకు సైబర నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఆన్‌లైన్‌లో అందినకాడికి కొల్లగొట్టడానికి ఇప్పుడు ‘సిమ్ స్వాపింగ్’కు పాల్పడుతున్నారు. అనేక వివరాలు చెప్పినా... వన్ టైమ్ పాస్‌వర్డ్ చెప్పని వినియోగదారులను ఈ తరహాలో బురిడీ కొట్టిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలకు ఉపయోగిస్తున్న ఫోన్ నెంబర్‌ను వారితోనే బ్లాక్ చేయిస్తూ తమ ‘పని’ పూర్తి చేసుకుంటున్నారు. ఈ పంథాలో రూ.లక్ష కోల్పోయిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది.
సాక్షి, సిటీబ్యూరో: బ్యాంకుల కాల్‌సెంటర్ల మాదిరిగా ఫోన్లు చేస్తూ వ్యక్తిగత సమాచారం తెలుసుకుని ఆన్‌లైన్‌లో అందినకాడికి కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. అనేక వివరాలు చెప్పినా... వన్ టైమ్ పాస్‌వర్డ్ చెప్పని వినియోగదారులను ‘సిమ్ స్వాపింగ్’తో బురిడీ కొట్టిస్తున్నారు. వినియోగిస్తున్న సిమ్‌కార్డులను వారితోనే బ్లాక్ చేయిస్తూ తమ ‘పని’ పూర్తి చేసుకుంటున్నారు. ఈ పంథాలో రూ.లక్ష కోల్పోయిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో ఈ కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.
ఇప్పటి వరకు ’ఈ’ రకంగా
బ్యాంకుల పేర్లతో ఫోన్లు చేసి ఖాతాలు ఖాళీ చేసే నేరాలు మూడునాలుగేళ్లుగా జోరుగా సాగుతున్నాయి. జుమ్‌తార, ఢిల్లీ కేంద్రాలుగా వ్యవస్థీకృతంగా ‘ఈ–నేరాలు’ చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఆయా ప్రాంతాల్లో దీని కోసం ప్రత్యేకంగా కాల్‌సెంటర్లను సైతం ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసుకున్న ఉద్యోగులతో దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఖాతాదారులకు ఫోన్లు చేయిస్తుంటారు. తాము ఫలానా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకునే నేరగాళ్లు క్రెడిట్/డెబిట్ కార్డ్‌ను అప్‌గ్రేడ్ చేస్తామనో, ఆధార్ సీడింగ్ అనే చెప్తూ వినియోగదారుల నుంచి కార్డ్, పిన్ నెంబర్లతో పాటు ఓటీపీ సైతం తీసుకుంటున్నారు. ఆపై ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా వారి ఖాతాల్లో ఉన్న నగదు స్వాహా చేయడం, ఈ–కామర్స్ సైట్స్‌లో ఖరీదు చేయడం, ఈ–వ్యాలెట్స్‌లోకి బదిలీ చేసుకోవడం చేసి మోసం చేస్తున్నారు.
వివిధ మార్గాల్లో డేటా సంగ్రహణ...
వివిధ బ్యాంకులకు చెందిన డెబిట్/క్రెడిట్ కార్డుల వినియోగదారుల డేటాను సైబర్ నేరగాళ్లు అనేక మార్గాల్లో చేజిక్కించుకుంటున్నారు. ఆయా బ్యాంకులకు చెందిన కాల్ సెంటర్ల ద్వారా కార్డు నెంబర్, వినియోగదారుడి పేరు ఇతర వివరాలతో పాటు కొన్ని సందర్భాల్లో సీవీవీ కోడ్స్ కూడా సంగ్రహించేస్తున్నారు. అయితే ఖాతాల్లో ఉన్న నగదు కాజేయడానికి ఓటీపీ తప్పనిసరి. సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టిన అవగాహన కార్యక్రమాల ఫలితంగా ఈ తరహా సైబర్ నేరాలు, నేరగాళ్లు చేసే మోసాలపై వినియోగదారులకు కొంతమేర అవగాహన ఏర్పడింది. ఈ కారణంగానే సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు మోసపోయామంటూ ఒకరు సంప్రదిస్తుంటే.. తమను మోసం చేయడానికి ప్రయత్నించారంటూ ఐదారుగురు సమాచారం ఇస్తున్నారు. బ్యాంకుల పేరుతో కాల్స్ చేస్తున్న కేటుగాళ్లకు అనేక వివరాలూ చెప్తున్నప్పటికీ... ఓటీపీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం అనుమానిస్తున్నారు. దీంతో ఆ నెంబర్ చెప్పకుండా ఫోన్లు కట్ చేస్తున్నారు. ఈ రకంగా ‘నష్టపోతున్నామని’ గుర్తించిన సైబర్ నేరగాళ్లు ఇటీవల సిమ్ స్వాపింగ్ ఎత్తు వేస్తున్నారు.
కొత్త సిమ్‌కార్డులు తీసుకుంటున్నారు..
సిమ్ స్వాపింగ్ కోసం సైబర్ నేరగాళ్లు ఉత్తరాదికి చెందిన కొన్ని సిమ్‌కార్డుల విక్రయ కేంద్రాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఎలాంటి గుర్తింపుకార్డులు సమర్పించకుండానే వారి నుంచి టార్గెట్ చేసిన వినియోగదారుడి సెల్ నెంబర్‌తోనే మరో సిమ్‌కార్డు తీసుకుంటున్నారు. ఇది యాక్టివేట్ కావాలంటే అసలు వినియోగదారుడు అప్పటికే వినియోగిస్తున్న సిమ్ నుంచి కొత్త సిమ్‌పై ఉన్న నెంబర్లను సర్వీస్ ప్రొవైడర్‌కు ఎస్సెమ్మెస్ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత మాత్రమే కొత్త సిమ్ యాక్టివేట్ కావడంతో పాటు పాత సిమ్ బ్లాక్ అవుతుంది. సరిగ్గా ఇదే విధానాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ‘మీ సిమ్ బ్లాక్/డ్యామేజ్ అయింది. ఇబ్బందులు సరిదిద్దడానికి మీ సెల్‌కు వచ్చే నెంబర్‌కు ఫలానా నెంబర్ ద్వారా సర్వీస్ ప్రొవైడర్‌కు పంపండి’ అంటూ వివిధ నెంబర్ల నుంచి వినియోగదారులకు సర్వీస్ ప్రొవైడర్ల మాదిరిగా ఎస్సెమ్మెస్‌లు పంపిస్తున్నారు.
అనుమానం రాకుండా ‘పని’ పూర్తి...
సదరు ఎస్సెమ్మెస్ సర్వీసు ప్రొవైడర్ నుంచే వచ్చిందని భావిస్తున్న వినియోగదారులు సదరు సిమ్ నెంబర్‌ను కాల్‌సెంటర్‌కు ఎస్సెమ్మెస్ చేస్తున్నారు. దీంతో కొద్దిసేపటికే ఈ సిమ్ బ్లాక్ కావడంతో పాటు నేరగాళ్ల దగ్గర ఉన్న సిమ్ యాక్టివేట్ అవుతోంది. అప్పటికే సదరు వినియోగదారుడికి సంబంధించిన కార్డ్, పిన్ వివరాలు వారి వద్ద ఉండటంతో వాటితో ఆన్‌లైన్ లావాదేవీలు మొదలుపెడుతున్నారు. అసలు వినియోగదారుడి సెల్ నెంబర్‌కు రావాల్సిన ఓటీపీ సైబర్ నేరగాళ్లు స్వాపింగ్ చేసిన నెంబర్‌కు చేరిపోతోంది. ఇలా వినియోగదారుడికి ఏమాత్రం అనుమానం రాకుండా కొల్లగొట్టేస్తున్నారు. కస్టమర్‌కు ఈ విషయం తెలిసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఎవరైనా వినియోగదారుడు తన సిమ్ బ్లాక్ అయినట్లు గుర్తించినా.. సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించడం, ఫిర్యాదు చేయడం జరిగేసరికే సైబర్ నేరగాళ్లు తమ పని పూర్తి చేసుకుంటున్నారు. నగరానికి చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారికి ఈ తరహాలో టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు మూడు విడతల్లో ఆయన ఖాతాలో ఉన్న రూ.లక్ష కాజేశారు. ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
అప్రమత్తతే పరిష్కారం
‘ఇలాంటి నేరాల బారినపడకుండా ఉండలంటే సెల్‌ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండమే ఉత్తమమైన మార్గం. ఇటీవల కాలంలో సిమ్ బ్లాక్ అనే సమస్య ఉత్పన్నం కావట్లేదు. అలా ఎవరి సిమ్‌కార్డ్ అయినా బ్లాక్ అయినట్లు గుర్తిస్తే తక్షణం అప్రమత్తం కావాలి. తక్షణం బ్యాంకులను సంప్రదించి క్రెడిట్/డెబిట్ కార్డులనే కాకుండా ఆ ఖాతాలనే బ్లాక్ చేయించాలి. ఫలానా నెంబర్‌ను కాల్ సెంటర్‌కు పంపండి అంటూ వచ్చే ఎస్సెమ్మెస్‌లనూ అనుమానించాల్సిందే. సదరు సర్వీసు ప్రొవైడర్ కాల్ సెంటర్‌ను సంప్రదించకుండా ఇలాంటివి పంపకూడదు. మోసపోయిన బాధితులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేయాలి’.
– సిటీ సైబర్ క్రైమ్ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment