ఒకప్పుడు తెలిసిన వారికే డబ్బులు పంపాల్సిన అవసరం వచ్చేది. కానీ, నేడు చెల్లింపులన్నీ డిజిటల్ అయ్యాయి. ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నాం. కూరగాయల దగ్గర్నుంచి ప్రతిదీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నాం. సినిమా, రైలు, బస్సు, ఫ్లయిట్ టికెట్ల బుకింగ్, హోటళ్లలో బుకింగ్‌లు.. ఈ జాబితా చాలా పెద్దదే. కానీ, ఆన్‌లైన్ చెల్లింపుల్లో (యూపీఐ, ఇతరత్రా) ఎంత సౌకర్యం ఉందో, అంతకంటే ఎక్కువే రిస్క్ ఉంటుంది. డిజిటల్ పేమెంట్స్ చేసే సమయంలో ఎవరికి వారు స్వీయ పరిశీలన, జాగ్రత్తలు తీసుకుంటే ఆ సౌకర్యాన్ని ఎంజాయ్ చేయవచ్చు. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. డిజిటల్ ప్రపంచంలో ఒకసారి మోసపోతే కనుక దొంగ దొరికి, పోయిన మొత్తం వెనక్కి రావడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన అంశాలను వివరించేదే ఈ కథనం.
►తెలియని వ్యక్తులతో లావాదేవీలు వద్దు
►తెలియని సంస్థలతోనూ ఇదే పాటించాలి
►యూపీఐకి బదులు , నెఫ్ట్, ఐఎంపీఎస్ మేలు
►ట్రూకాలర్ సాయం తీసుకోవచ్చు
►సామాజిక మాధ్యమాల తోడ్పాటు కూడా తీసుకోవాలి...
► పూర్తి నిర్ధారణ తర్వాతే చెల్లింపు
అదేపనిగా కాల్స్ చేస్తే..
మోసగాళ్లు అయితే కాల్స్, మెస్సేజ్‌ల ద్వారా సులభంగా గుర్తించొచ్చు. ఒకటికి నాలుగు సార్లు కాల్ చేయడం, ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తుంటే ముందుగా అనుమానించాలి. వారితో మాట్లాడినప్పుడు ఈ ఆఫర్/అవకాశం మళ్లీ ఉండదని/రాదని చెప్పడం, వారి మాటల్లో ఏకరూపత లేకపోతే స్కామ్‌గానే సందేహించాలి. అలాగే, వాట్సాప్ చేస్తున్నా ఇలాగే అనుమానించాలి. కొందరు నేరస్థులు ఏ మాత్రం అనుమానం కలగనీయని రీతిలో సంప్రదింపులు చేస్తుంటారు. అటువంటప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ కోరాలి. హోటల్ బుకింగ్ అయితే నేరుగా వచ్చినప్పుడు పేమెంట్ చేస్తానని చెప్పాలి.
మొదటగా తెలియని వ్యక్తులు కాల్ చేసి ఫలానా ఆఫర్ అనో, ప్యాకేజీ అనో, లాటరీ వచ్చిందనో చెప్పే మాటలకు మెతకగా స్పందించడం, ఆసక్తి చూపడం, అయోమయంగా అనిపించేలా వ్యవహరించకండి. అవతలి వ్యక్తి మరింత ముందుకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. తెలియని నంబర్, మెయిల్ ఐడీ నుంచి ఏదైనా ఆఫర్లు, సందేశాలు వస్తే, లింక్‌లు వస్తే వాటిని తెరవడం, అందులోని నంబర్లను సంప్రదించడం చేయవద్దు. పేరున్న సంస్థలు అయితే నేరుగా వాటి సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోవాలి. అంతేకానీ, మొబైల్‌కు తెలియని మూలాల నుంచి ఎస్‌ఎంఎస్, వాట్సాప్, మెయిల్ ద్వారా వచ్చే వెబ్‌లింక్‌లను ఓపెన్ చేయకుండా ఉండాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి కాల్ చేసి, తమది ఫలానా ఎన్‌జీవో, చిన్న పిల్లల ఆరోగ్య అవసరాల కోసం విరాళాలు సమీకరిస్తున్నట్టు చెప్పొచ్చు. ఇలాంటివి అసలు నమ్మనే వద్దు. ఎవరికైనా సాయం చేయాలంటే ప్రత్యక్షంగా చేయడమే మంచిది. అవసరం లేని ఇలాంటి వాటిని ఎంటర్‌టైన్ చేయడం... రిస్క్‌ను ఆహ్వానించడమే.
యూపీఐ వద్దు..
యూపీఐ చెల్లింపులకు బదులు నెఫ్ట్/ఐఎంపీఎస్ నగదు బదిలీ మార్గాలను అనుసరించడం కొంచెం సురక్షితమైనది. యూపీఐ సాధనం సురక్షితమైనదే. కానీ, సరైన వ్యక్తికి పంపినప్పుడే. నగదు స్వీకరించే వ్యక్తి పూర్తి వివరాలు ఇందులో తెలియవు. అదే నెఫ్ట్/ఐఎంపీఎస్‌లో డబ్బు పంపాలంటే పూర్తి వివరాలు కావాల్సిందే. అందుకే అవతలి వ్యక్తి మాటలు నమ్మదగినవిగా అనిపించకపోతే, సందేహం వస్తే ఖాతా వివరాలు ఇవ్వాలని కోరాలి.
కంగారు పడొద్దు...
పెద్ద మొత్తంలో డబ్బులు పంపుతుంటే వేగం ప్రదర్శించొద్దు. సమయం తీసుకోండి. తొందరపడితే ప్రాథమిక అంశాలను కూడా విస్మరిస్తుంటాం. తొందరపడి మోస పోయినట్టుగా ఉంటుంది. అది నిజమా, మోసమా అని గుర్తించేందుకు వ్యవధి ఇవ్వాలి. అవతలి వ్యక్తితో ఒకటికి నాలుగు సార్లు మాట్లాడాలి. కొన్ని రోజులు ఆగి చూడాలి. అప్పుడు అవతలి వ్యక్తి స్పందన ఆధారంగా నిజా, నిజాలను గుర్తించే వెసులుబాటు ఉంటుంది.
ముందే మొత్తం వద్దు..
ఇక నగదు పంపించేందుకు సిద్ధమైతే కనుక మొత్తం ఒకేసారి చెల్లించేయవద్దు. సాధారణంగా నమ్మకం ఏర్పడినప్పుడు ఎక్కువమంది ఒకే విడత డిస్కౌంట్ కోరి చెల్లించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వాయిదాలుగా చెల్లించడం అందరికీ నచ్చదు. ఆన్‌లైన్ మోసాలను నివారించాలంటే.. ఒకేసారి మొత్తం పంపకుండా ఉండడమే మంచి మార్గం. దీనివల్ల మోసం అయితే కొద్ది మొత్తంతోనే ఆగిపోతుంది.
గూగుల్ సెర్చ్..
డబ్బులు పంపే ముందు అవతలి వ్యక్తి ఫోన్ నంబర్, ఈమెయిల్‌ను ఆన్‌లైన్‌లో ఓసారి సెర్చ్ చేయాలి. అదే నంబర్, అదే ఈ మెయిల్ పేరిట అప్పటికే ఎవరైనా మోసపోయి ఉంటే, ఆ వివరాలు లభిస్తాయి. ఒక్కోసారి కాంటాక్ట్ నంబర్‌ను టైప్ చేసి సెర్చ్ ఓకే చేస్తే.. అదే నంబర్ పలు వ్యాపారాలకు సంబంధించి చూపించొచ్చు. గూగుల్‌లో ఒకటికి మించిన కంపెనీలకు ఆ నెంబర్ చూపిస్తే కచ్చితంగా మోసపూరితమైనదే.
ట్రూకాలర్
అయితే, అన్ని ఫోన్ నంబర్ల వివరాలు గూగుల్‌లో కనిపించాలని లేదు కదా? మోసగాళ్లు ఒక్కో పెద్ద మోసానికి ఒక్కో ఫోన్ నంబర్ వాడుతున్న రోజులు ఇవి. కనుక గూగుల్‌లో వివరాలు లభించకపోతే అప్పుడు ఫోన్‌లో ట్రూకాలర్ యాప్ వేసుకుని అందులో సెర్చ్ చేయడమే మార్గం. సదరు నెంబర్‌తో ఎవరైనా మోసపోయి ఉంటే.. ఫ్రాడ్, స్కామ్, స్పామ్‌గా చూపిస్తుంది. కచ్చితంగా దాన్ని ఒక సంకేతంగానే చూడాలి. పూర్తి పేరుతో వస్తే అప్పుడు తదుపరి పరిశీలనకు వెళ్లాలి.
తెలియని పోర్టళ్లు..
తెలియని సంస్థల సేవలకు దూరంగా ఉండడమే భద్రతా పరంగా మంచి విధానం అవుతుంది. ఉదాహరణకు మూవీ టికెట్లు బుక్ చేసుకోవాలని అనుకుంటే బుక్‌మైషో, పేటీఎం ఇలాంటివి అందరికీ తెలుసు. ఇవి నిజమైన వ్యాపార వేదికలు. కానీ, ఎప్పుడూ వినని వెబ్‌సైట్ లేదా యాప్‌లో ఒకటి కొంటే ఒకటి ఉచితానికి ఆశపడొద్దు. ఉచితమేమో కానీ, మన కార్డు వివరాలు, ఇతర కీలక సమాచారం పక్కదారి పట్టొచ్చు. లేదంటే కార్డు నుంచి బ్యాలన్స్‌ను కొట్టేయవచ్చు.
వేరే వారికి స్టీరింగ్
టీమ్ వ్యూవర్, ఎనీడెస్క్ నుంచి వచ్చే రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయవద్దు. చేశారంటే మీ స్క్రీన్‌ను వారితో షేర్ చేసినట్టు అవుతుంది. అప్పుడు మీ తరఫున అవతలి వ్యక్తి లావాదేవీలు నిర్వహిస్తాడు. ఫోన్, కంప్యూటర్‌లోని సమాచారం మొత్తాన్ని కొట్టేస్తారు. ఇటీవలే గచ్చిబౌలిలో పనిచేసే 28 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగికి ఒక కాల్ వచ్చింది. బ్యాంకు కస్టమర్ కేర్ నుంచి అని అవతలి వ్యక్తి చెప్పాడు. క్రెడిట్ కార్డుకు ఇచ్చిన చిరునామా వివరాల్లో తప్పులున్నాయని, వాటిని సరిచేసుకోవాలని తెలిపాడు. ఇందుకోసం ఎనీడెస్క్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించాడు. ఈ విషయాలపై పెద్దగా అవగాహన లేకపోవడంతో ఫోన్ చేసింది బ్యాంకు ఉద్యోగేనని నమ్మి, ఆ వ్యక్తి చెప్పినట్టే చేశాడు. అదే సమయంలో క్రెడిట్ కార్డు నుంచి రూ.52,000 డెబిట్ అయినట్టు సందేశం వచ్చింది. ఇంకేముంది కాల్ కట్. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
ఆత్మ పరిశీలన
ముందు చెప్పుకున్నట్టు కొంత సమయం తీసుకుని, మనలో మనమే ఓ సారి అన్ని అంశాలను బేరీజు వేసుకుని, కచ్చితత్వాన్ని రూఢీ చేసుకోవాలి. ఎక్కడైనా ఏదైనా తేడా ఉందని అనిపిస్తే.. ఇక ఆ డీల్‌కు అంతటితో ముగింపు పలకాలి.
Comments
Please login to add a commentAdd a comment