సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని మద్యం షాపుల్లో త్వరలో డిజిటల్ రూపంలో చెల్లింపుల విధానాన్ని అమలు చేయనున్నామని ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) గురువారం హైకోర్టుకు నివేదించింది. దసరా నాటికి ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఏపీబీసీఎల్ తరఫు న్యాయవాది పి.నరసింహమూర్తి కోర్టుకు వివరించారు. బ్యాంకులు కూడా చెల్లింపులకు అంగీకరించాయన్నారు.
ఈ నేపథ్యంలో మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులకు అవసరమైన పరికరాలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ వివరాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 28కి వాయిదా వేస్తూ సీజే జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో ఆన్‌లైన్/డిజిటల్ రూపంలో చెల్లింపులను ఆమోదించడం లేదని, అన్నిచోట్లా డిజిటల్, ఆన్‌లైన్ చెల్లింపులను ఆమోదించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన దాసరి ఇమ్మాన్యుయెల్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దసరా నాటికి డిజిటల్ చెల్లింపులు..
ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా.. ఏపీబీసీఎల్ న్యాయవాది దసరా కల్లా మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల విధానం అమల్లోకి వస్తుందన్నారు. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది వంకాయలపాటి నాగ ప్రవీణ్ స్పందిస్తూ.. మద్యం విక్రయాలను ఆధార్‌తో అనుసంధానం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. మద్యం విక్రయాలను ఆధార్‌తో అనుసంధానించడం ఏమిటంటూ ప్రశ్నించింది. మద్యం కొనుగోలుదారుల్లో చాలా మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నారని.. వారు రోజూ రూ.200–రూ.300 వరకు మద్యంపై ఖర్చు చేస్తున్నారని ప్రవీణ్ చెప్పారు. మద్యంపై ఎవరెంత ఖర్చు పెడుతున్నారు.. ఎవరెంత తాగుతున్నారో పిటిషనర్‌కెందుకని ధర్మాసనం ప్రశ్నించింది. మద్యం సేవించే గోప్యత కూడా ఇవ్వరా అంటూ నిలదీసింది. ఇతరుల జీవితాల్లోకి ఎందుకు తొంగిచూస్తున్నారని ప్రశ్నించింది. అందరి సమాచారం అడుగుతున్నారు.. మరి పిటిషనర్ ఏం చేస్తుంటారని ప్రశ్నించింది. దీనికి ప్రవీణ్ సమాధానం చెప్పలేకపోయారు. మీ గురించి చెప్పడానికి ఇష్టపడరు.. మిగి లిన వారి గురించి మాత్రం మీకు అన్నీ కావాలా? అంటూ అసహనం వ్యక్తం చేసింది.
‘ఆ ఘటనలో ఎస్‌ఐని సస్పెండ్ చేశాం’
ఇద్దరు వ్యక్తులను నిర్బంధించి కొట్టిన వ్యవహారంలో తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎస్‌ఐని సస్పెండ్ చేశామని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ గురువారం హైకోర్టుకు నివేదించారు. శాఖాపరమైన చర్యలు కూడా ఉంటాయని తెలిపారు. ఇద్దరు వ్యక్తుల ఒంటిపై గాయాలున్నాయన్న వైద్యుల నివేదికను పరిశీలించాక తగిన విధంగా స్పందిస్తామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. వైద్యుల నివేదికను ఏజీకి అందచేయాలంటూ రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్‌కు సమాధానం ఇస్తామని పిటిషనర్ తరఫు న్యాయవాది కె.రాజారెడ్డి చెప్పడంతో హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 28కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
పోలీసులు తన భర్త కంచర్ల నవీన్‌బాబు, అతని స్నేహితుడు అశోక్ బాబులను అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేస్తున్నారని, వారిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలంటూ గుంటూరు జిల్లా, తోకలవానిపాలెంకు చెందిన షేక్ అక్తర్ రోషన్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ధర్మాసనం ఈ వ్యాజ్యంపై గురువారం మరోసారి విచారణ జరిపింది. గత విచారణ సమయంలో నవీన్‌బాబు, అశోక్ బాబులకు వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు వైద్య పరీక్షల నివేదికను ధర్మాసనం ముందుంచారు. ఆ నివేదకను పరిశీలించిన ధర్మాసనం ఇద్దరి ఒంటిపై గాయాలున్నట్లు తెలిపింది. పాదాలపై కొట్టడం ఇక్కడమేన్నా ఆచారంగా వస్తోందా? అంటూ వ్యాఖ్యానించింది. అలాంటిది ఏమీ లేదని ఏజీ చెప్పారు.
‘ఎస్సీ కులధ్రువీకరణ పత్రాలపై సీఎం ఫొటో సరికాదు’
ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలపై సీఎం ఫొటో ముద్రించడాన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా భట్టిప్రోలుకు చెందిన జడా రవీంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు ముఖ్యమంత్రి ఫొటో ముద్రణపై ఉన్న అభ్యంతరాలను వినతిపత్రం రూపంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని పిటిషనర్‌ను ఆదేశించింది. ఆ అభ్యంతరాలపై అధికారులు ఆరు వారాల్లో నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.
హైకోర్టు ముందుకు అధికారులు
కోర్టు ధిక్కార కేసులో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు వాడ్రేవు చిన వీరభద్రుడు గురువారం వ్యక్తిగతంగా హైకోర్టు ముందు హాజరయ్యారు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయాలన్న తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం తగదని హితవు పలికారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో వాదనలు వినిపించేందుకు అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సమయం కోరడంతో న్యాయమూర్తి అందుకు అంగీకరిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 22కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయాలంటూ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదని, వారిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలంటూ గుంటూరుకు చెందిన ప్రైవేటు రికగ్నైజ్డ్ ఎయిడెడ్ పాఠశాలల యజమాన్యాల సంఘంతోపాటు మరికొందరు హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో బి.రాజశేఖర్, వాడ్రేవు చినవీరభద్రుడు, మరికొందరు అధికారులను ప్రతివాదులుగా చేర్చారు. గత విచారణ సమయంలో న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాల మేరకు వారిద్దరూ గురువారం కోర్టు ముందు హాజరయ్యారు.
ఆత్మహత్యలొద్దు.. న్యాయం చేస్తాం: కాంట్రాక్టర్లకు హైకోర్టు విజ్ఞప్తి
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు బిల్లులు రావడం లేదన్న బెంగతో ఆత్మహత్య చేసుకోవద్దని కాంట్రాక్టర్లకు హైకోర్టు గురువారం విజ్ఞప్తి చేసింది. అసహనం, ఆగ్రహం, ఆవేదనతో ప్రాణాలు తీసుకుంటే కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటో ఆలోచించాలని హితవు పలికింది. కొంత ఆలస్యమైనా న్యాయస్థానం ద్వారా న్యాయం జరుగుతుందని తెలిపింది. అధికారుల చర్యల వల్ల ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడానికే న్యాయస్థానాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. ఉపాధి హామీ పనుల బిల్లులను చెల్లించకపోవడంపై దాఖలైన వ్యాజ్యాలపై ఆయన కొద్ది వారాలుగా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యాలపై ఆయన మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. బిల్లులు అందక అనంతపురం జిల్లాలో ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న విషయంపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment