అమరావతిలో హైకోర్టు తొలి తీర్పు | Andhra Pradesh High Court First Verdict | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 5 2019 9:42 AM | Last Updated on Sat, Jan 5 2019 10:08 AM

Andhra Pradesh High Court First Verdict - Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతికి తరలివచ్చిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తన తొలి తీర్పును వెలువరించింది. ఆంధ్రప్రదేశ్‌ బేవరేజీ కార్పొరేషన్‌ (ఏపీబీసీఎల్‌) మద్యం గోడౌన్లలో 40 శాతం మంది హమాలీలను కొత్త గోడౌన్లలో పనిచేసేందుకు అనుమతించాలంటూ హమాలీల సంఘం దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఉమ్మడి హైకోర్టు విభజన అనంతరం ఏపీ హైకోర్టు అమరావతి నుంచి కార్యకలాపాలు మొదలు పెట్టిన తరువాత వెలువడిన తొలి తీర్పు ఇదే కావడం గమనార్హం.

ఇదీ నేపథ్యం
విజయవాడ, గొల్లపూడిలో ఏపీబీసీఎల్‌ మద్యం గోడౌన్‌ నిర్వహించేది. ఇందులో పలువురు హమాలీలు పనిచేసేవారు. అనంతరం నిడమానూరులో కొత్త మద్యం గోడౌన్‌ను ఏపీబీసీఎల్‌ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో గొల్లపూడి గోడౌన్‌లో పనిచేస్తున్న హమాలీల్లో 40 శాతం మందిని నిడమానూరు గోడౌన్‌లో పనిచేసేందుకు అనుమతించాలని కోరుతూ ఏపీబీసీఎల్‌ ఐఎంఎఫ్‌ఎల్‌ హమాలీల సంఘం ఏపీబీసీఎల్‌కు వినతిపత్రం సమర్పించింది. అధికారులు ఈ అభ్యర్థనను తోసిపుచ్చడాన్ని సవాల్‌ చేస్తూ యూనియన్‌ అధ్యక్షుడు ఎ.సతీష్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గతంలో ఈ పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టులో విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ పిటిషనర్‌ అభ్యర్థనను తోసిపుచ్చారు.

దీనిపై సతీష్‌ దాఖలు చేసిన అప్పీల్‌ తాజాగా ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. కొత్త గోడౌన్‌లో 40 శాతం మంది హమాలీలు పనిచేసేందుకు అనుమతిస్తూ గతంలో సర్కులర్‌ ఇచ్చారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది సురేశ్‌కుమార్‌ తెలిపారు. అయితే ఈ సర్కులర్‌ను కేవలం మానవతా దృక్పథంతోనే ఇచ్చామని ఏపీబీసీఎల్‌ తరఫు న్యాయవాది నివేదించారు. స్థానిక, స్థానికేతర హమాలీల మధ్య వివాదం చెలరేగి శాంతిభద్రతల సమస్యకు దారి తీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం యూనియన్‌ తరఫున సతీష్‌ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement