liquor godown
-
ఎలుకను అరెస్టు చేసిన పోలీసులు.. ఎందుకంటే..?
భోపాల్: తప్పు చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేస్తారు. కానీ మధ్యప్రదేశ్‌లో పోలీసులు ఓ ఎలుకను అరెస్టు చేశారు. చిన్న బోనులో బందించి పోలీసు స్టేషన్లోనే ఓ మూలన ఉంచారు. పోలీసు గోదాంలో ఉన్న మద్యం బాటిళ్లను ఎలుకలు ఖాలీ చేసిన కారణంగా దానిని బందించినట్లు పోలీసులు చెబుతున్నారు. చింద్వారా, కోత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన బాటిళ్లకు సంబంధించిన ఆధారాలను న్యాయస్థానంలో సాక్షంగా చూపించాల్సి ఉంది. కానీ ఎలుకలు మద్యం బాటిళ్లను ఖాలీ చేశాయి. ఇక ఏం చేయాలో తెలియక ఎలుకలను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. చాలా ఎలుకల్లో ఒక్క ఎలుక మాత్రమే దొరికిందని తెలిపారు. మిగితావి పరారీలో ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. కోత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి. పలు ప్రభుత్వ పత్రాలను కూడా ధ్వంసం చేశాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల శరీరాన్ని కొరికి తిన్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. ఇదీ చదవండి: జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు -
అమరావతిలో హైకోర్టు తొలి తీర్పు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతికి తరలివచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన తొలి తీర్పును వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ బేవరేజీ కార్పొరేషన్ (ఏపీబీసీఎల్) మద్యం గోడౌన్లలో 40 శాతం మంది హమాలీలను కొత్త గోడౌన్లలో పనిచేసేందుకు అనుమతించాలంటూ హమాలీల సంఘం దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఉమ్మడి హైకోర్టు విభజన అనంతరం ఏపీ హైకోర్టు అమరావతి నుంచి కార్యకలాపాలు మొదలు పెట్టిన తరువాత వెలువడిన తొలి తీర్పు ఇదే కావడం గమనార్హం. ఇదీ నేపథ్యం విజయవాడ, గొల్లపూడిలో ఏపీబీసీఎల్ మద్యం గోడౌన్ నిర్వహించేది. ఇందులో పలువురు హమాలీలు పనిచేసేవారు. అనంతరం నిడమానూరులో కొత్త మద్యం గోడౌన్‌ను ఏపీబీసీఎల్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో గొల్లపూడి గోడౌన్లో పనిచేస్తున్న హమాలీల్లో 40 శాతం మందిని నిడమానూరు గోడౌన్లో పనిచేసేందుకు అనుమతించాలని కోరుతూ ఏపీబీసీఎల్ ఐఎంఎఫ్ఎల్ హమాలీల సంఘం ఏపీబీసీఎల్‌కు వినతిపత్రం సమర్పించింది. అధికారులు ఈ అభ్యర్థనను తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ యూనియన్ అధ్యక్షుడు ఎ.సతీష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఈ పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టులో విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ చల్లా కోదండరామ్ పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చారు. దీనిపై సతీష్ దాఖలు చేసిన అప్పీల్ తాజాగా ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. కొత్త గోడౌన్లో 40 శాతం మంది హమాలీలు పనిచేసేందుకు అనుమతిస్తూ గతంలో సర్కులర్ ఇచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది సురేశ్‌కుమార్ తెలిపారు. అయితే ఈ సర్కులర్‌ను కేవలం మానవతా దృక్పథంతోనే ఇచ్చామని ఏపీబీసీఎల్ తరఫు న్యాయవాది నివేదించారు. స్థానిక, స్థానికేతర హమాలీల మధ్య వివాదం చెలరేగి శాంతిభద్రతల సమస్యకు దారి తీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం యూనియన్ తరఫున సతీష్ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. -
అనంతలో భారీ అగ్నిప్రమాదం.. రూ.21 కోట్ల నష్టం
- భారీగా మద్యం కేసులు దగ్ధం - రూ.21 కోట్ల నష్టం (సాక్షిప్రతినిధి, అనంతపురం): అనంతపురం నగర శివారులోని సోములదొడ్డి వద్దనున్న మద్యం సరఫరా గోడౌన్ (ఐఎంఎల్ డిపో) పూర్తిగా తగలబడిపోయింది. మంగళవారం రాత్రి 9.45 గంటలకు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో సిబ్బంది పరుగు పరుగున బయటకు వచ్చేశారు. చూస్తుండగానే క్షణాల్లో డిపో పూర్తిగా తగలబడిపోయింది. నష్టం సుమారు రూ.21 కోట్లు ఉంటుందని అంచనా. ఈ గోడౌన్ దాదాపు నాలుగు దశాబ్దాల కిందట నిర్మించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలకు ఇక్కడి నుంచే సరఫరా చేస్తుంటారు. ప్రతి నెలా రూ.65కోట్ల విలువైన మద్యాన్ని సరఫరా చేస్తుంటారు. 40 ఏళ్లకిందట చేసిన వైరింగే ఇప్పటిదాకా ఉంది. కరెంటు తీగలు డిపోలో ప్రమాదకరంగా ఉండటాన్ని సిబ్బంది ఇంతకుముందే గుర్తించారు. అయితే, కొత్తగా వైరింగ్ చేయడంపై శ్రద్ధ చూపలేదు. ఇదే ప్రమాదానికి కారణమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే డిపో తగలబడిపోయిందని తెలుస్తోంది. ముందు జాగ్రత్తలేవీ? మద్యం గోడౌన్లో మంటలు ఆర్పేందుకు కార్బన్ సిలిండర్లను ఏర్పాటు చేయలేదు. వీటిపై డిపో అధికారులు ఏనాడూ దృష్టి సారించలేదు. సిలిండర్లు ఉన్నాయా, లేదా అన్న విషయాన్ని అగ్నిమాపక శాఖ అధికారులు కూడా పట్టించుకోలేదు. సిలిండర్లు ఉండి ఉంటే ప్రమాదం జరిగిన వెంటనే మంటలను ఆర్పే అవకాశం ఉండేదని డిపోలోని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. షార్ట్‌సర్క్యూట్ వల్లే జరిగిండొచ్చు - అనురాధ, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చాం. తగలబడిన మద్యం విలువ దాదాపు రూ.5కోట్లు ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తరువాత వెల్లడిస్తాం.