వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేసే విపణిలో ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగదారులే. మారుతున్న కాలాన్ని బట్టి నేడు సామాన్యుడు సైతం అంతర్జాలంలో వస్తువులు, సేవలు కొనుగోలు చేస్తున్నారు. డిజిటల్ రూపంలో నగదు చెల్లింపుల లావాదేవీలు పెరుగుతున్నాయి. ఇది ఎంతో ఉపయుక్తంగా ఉన్నా.. నేరస్థులకు నగదు దోచుకునేందుకు దగ్గరిదారిగా మారింది. గత ఏడాది మనదేశంలో 14 లక్షల సైబర్ నేరాలు జరగడం దీనికి తార్కాణం.
‘వినియోగదారుల రక్షణ చట్టం –2019’లో ‘ఈ–కామర్స్’ లావా దేవీలను స్పష్టంగా నిర్వచించడం జరిగింది. ‘డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ నెట్ వర్క్ ద్వారా డిజిటల్ ఉత్పత్తులతో సహా వస్తువులు లేదా సేవలను కొను గోలు చేయడం లేదా విక్రయించడం’ ఈ–కామర్స్‌గా నిర్వచించబడింది.
‘మీకు లాటరీలో బహుమతి వచ్చింద’నీ; ‘కారు, టీవీ, మోటార్ సైకిల్ గెలుచుకున్నార’ంటూ తప్పుడు ప్రకటనల ద్వారా సైబర్ నేరస్థులు రెచ్చి పోతున్నారు. నిరుద్యోగులే కాదు ఇందులో ఉన్నత చదువులు చదువుకున్న వైద్యులు, ఇంజనీర్లు సైతం చిక్కుకుంటున్నారు. ఇటీవల హైదరాబాదుకు చెందిన యువ వైద్యునికి రోజుకు రూ. 5 వేలు సంపాదించవచ్చంటూ రూ. 20 లక్షల రూపాయలు కాజేసిన ఘటన తెలిసిందే. గ్యాస్ ఏజెన్సీలు ఇస్తా మనీ; హోటళ్ళకు, సినిమాలకు రేటింగ్ ఇస్తామనీ, వ్యాపారంలో భాగ స్వామ్యం అనే ప్రకటనలతో కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక–2021 ప్రకారం చూస్తే, గత ఐదేళ్ళలో సైబర్ నేరాల సంఖ్య 141 శాతం పెరిగింది.
న్యాయమైన వాణిజ్య పద్ధతుల్లో ఆర్థికంగా నష్టం చేకూర్చడం, వినియోగదారులను మోసం చేయడం ద్వారా వినియోగదారుల హక్కులకు ఆటంకం కలిగించే సంస్థలు/కంపెనీలు/వ్యాపారుల గురించి ప్రజలకు తెలియజెప్పడం కోసం భారత్ 1986 డిసెంబర్ 24న ‘వినియోగదారుల రక్షణ చట్టా’న్ని తెచ్చింది. ఆ రోజును ప్రతి ఏడాదీ ‘జాతీయ వినియోగ దారుల హక్కుల దినం’గా పాటిస్తున్నారు.
భద్రత హక్కు, ఎంచుకునే హక్కు, సమాచారం పొందే హక్కు, వినే హక్కు, పరిహారం కోరుకునే హక్కు, వినియోగదారుల విద్య హక్కులను పరిరక్షించడానికీ, వినియోగదారుల ప్రయోజనాలకు హాని కలిగించే లేదా తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించిన విషయాలను నియంత్రించడానికీ 2020 జూలై 20 నుండి ‘సెంట్రల్ కన్సూ్యమర్ ప్రొటెక్షన్ అథారిటీ’ (సీసీపీఏ) స్థాపించబడింది. చెల్లుబాటు అయ్యే ఇండియన్ స్టాండర్డ్స్ (ఐఎస్‌ఐ) మార్క్ లేని వస్తువులను కొనుగోలు చేయకుండా వినియోగదారులను హెచ్చరిస్తూ ఈ సంస్థ రెండు భద్రతా నోటీసులను కూడా జారీ చేసింది.
ఆన్‌లైన్ షాపింగ్ చేసే చాలా మంది వ్యక్తులు తప్పుడు లేదా తప్పుదారి పట్టించే ప్రకటనలు, లోపభూయిష్ఠ ఉత్పత్తులు, ఉత్పత్తుల నకిలీ డెలివరీలు, అసురక్షిత ఉత్పత్తులు, చెల్లింపు సమస్యలు, భద్రత– గోప్యతా సమస్యలు, ఏకపక్ష ఒప్పందాలు వంటి వాటి కారణంగా బాధితులుగా మారారు. కానీ, అధికార పరిధుల సమస్యల కారణంగా చట్టాలను సరిగా అమలు చేయకపోవడం వల్ల బాధిత వినియోగదారులను రక్షించడంలో చట్టాలు విఫలమవుతున్నాయి. ఆన్‌లైన్ లావాదేవీలతో వ్యవహరించేటప్పుడు నేటి జనాభా ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలక్ట్రానిక్ ఒప్పందాలను నియంత్రించేందుకు వినియోగదారుల రక్షణ చట్టం –2019లో అనేక అంశాలు చేర్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినియోగదారుల రక్షణ చట్టం– 2019ని బలో పేతం చేసేందుకు పాఠశాలలో విద్యార్థులతో సుమారు 6,000 వినియోగ దారుల క్లబ్బుల ఏర్పాటు చేయడం జరిగింది. వినియోగదారుల వ్యవహా రాలపై, ఆహార, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో వారికి అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులకు ఈ చట్టంపై శిక్షణ ఇచ్చారు. విద్యార్థి దశ నుండే చట్టంపై అవగాహన కలిగించేందుకు ‘మేము సైతం’ అనే పుస్తకాన్నీ, సుమారు 10 రకాలైన గోడపత్రాలను పౌర సరఫరాల శాఖ రూపొందించింది.
తూనికలు కొలతల శాఖ వారు 3 రకాలైన గోడపత్రాలను రూపొందించడం జరిగింది. గోడపత్రాలనూ పాఠశాలతో పాటు గ్రామ/వార్డు సచి వాలయాలలో, పెట్రోలు బంకులలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరింతగా ఈ చట్టం పట్ల అవగాహన ప్రజలలో కల్పించేందుకు ‘మేలుకొలుపు’ అనే మాస పత్రికను కూడా పౌర సరఫరాల శాఖ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ చట్టం పట్ల ప్రజలందరికీ అవగాహన ఉంటే కొనుగోలు చేసే వస్తువులు / సేవలు / ఆన్‌లైన్ లావాదేవీలలో జరిగే నష్టాలకు పరిహారం పొందే అవకాశం ఉంటుంది.
దాసరి ఇమ్మానియేలు
వ్యాసకర్త ఏపీ వినియోగదారుల సంఘాల సమాఖ్య చైర్మన్ ‘ 90599 90345 (నేడు జాతీయ వినియోగదారుల దినోత్సవం)
ఈ – కామర్స్ వర్తక శకంలో...
Published Sun, Dec 24 2023 4:27 AM | Last Updated on Sun, Dec 24 2023 4:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment