ఓఎన్ డీసీతో ఈ–కామర్స్‌ విప్లవం? | Sakshi Guest Column On ONDC E-Commerce | Sakshi
Sakshi News home page

ఓఎన్ డీసీతో ఈ–కామర్స్‌ విప్లవం?

Published Thu, Jun 1 2023 12:47 AM | Last Updated on Thu, Jun 1 2023 12:57 AM

Sakshi Guest Column On ONDC E-Commerce

ఈ–కామర్స్‌ రంగంలో ఈ మధ్యకాలంలో ఓ విషయం హల్‌చల్‌ చేస్తోంది. భారత రిటైల్‌ రంగాన్ని సమూలంగా మార్చేయగల సత్తా ఉందని చెప్పు కుంటున్న దాని పేరు... ‘ఓఎన్ డీసీ’. వస్తువులు అమ్ముకునే వారికీ, కొనేవారికీ వేదికగా నిలవగల, అందరికీ అందుబాటులో ఉండే నెట్‌వర్క్‌ ఇది. స్థూలంగా చెప్పాలంటే దేశంలోని లక్షలాది చిన్న కంపెనీలు అతితక్కువ ఖర్చుతో ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫార్మ్‌పై తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఈ ప్లాట్‌ఫార్మ్‌కు కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సాహం అందిస్తోంది. అలాగని ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాదు. ప్రైవేట్‌ రంగంలోనే లాభాపేక్ష లేని సంస్థగా కొనసాగనుంది. ఈ–రిటైలింగ్‌ దేశం నలుమూలలకూ విస్తరించేందుకు ఇదో గొప్ప సాధనమవుతుందని అంచనా!

‘ఓఎన్ డీసీ’ అంటే ఓపెన్  నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌. వ్యాపారులు, వినియోగ దారులిద్దరికీ చాలా అనుకూలంగా ఉండే ఈ ప్లాట్‌ఫార్మ్‌కు కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సాహం అందిస్తోంది. అలాగని ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాదు. ప్రైవేట్‌ రంగంలోనే లాభాపేక్ష లేని సంస్థగా కొన సాగనుంది. 

బ్యాంకుల్లాంటి ఆర్థిక సంస్థలు, ఇన్ఫోసిస్‌ ఛైర్మన్  నందన్  నీలెకని వంటివారు ఈ ఓఎన్ డీసీకి దన్నుగా నిలిచారు. నందన్  నీలెకని ఈ మొత్తం ప్రయత్నానికి సూత్రధారి అని కూడా చెబుతున్నారు. ఈ– కామర్స్‌ రంగాన్ని ప్రజాస్వామ్య పథం పట్టించే సామర్థ్యమున్న అతి పెద్ద ఆవిష్కరణ ఇదని నందన్  చెబుతున్నారు. ఓఎన్ డీసీకి ఇచ్చిన నిర్వచనాన్ని పరిశీలించినా ఈ విషయం అర్థమవుతుంది. 

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి ప్లాట్‌ఫార్మ్‌లపై ఏ సంస్థ అయినా తమ ఉత్పత్తులను అమ్ముకోవాలంటే వాటిల్లో ప్రత్యేకంగా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మకాల్లో గరిష్ఠంగా 35 శాతం కమిషన్ను ఈ ప్లాట్‌ఫార్మ్‌లు పొందుతూంటాయి. ఓఎన్ డీసీలో ఈ అవసరం ఉండదు. వినియోగదారులకూ ఇది వర్తిస్తుంది. చిన్న చిన్న కంపెనీలు నేరుగా ఓఎన్ డీసీ ప్లాట్‌ఫార్మ్‌పై తమ ఉత్పత్తులను అమ్ము కునేందుకు వీలేర్పడుతోంది. ఈ ఉత్పత్తులను వినియోగదారులు మాత్రమే కాకుండా... అమెజాన్  వంటి పెద్ద రిటైయిలర్లూ కొనుగోలు చేయవచ్చు.

ఓఎన్ డీసీలో కమిషన్  కేవలం రెండు నుంచి ఐదు శాతం మాత్రమే ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే దేశంలోని లక్షలాది చిన్న కంపెనీలు అతితక్కువ ఖర్చుతో ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫార్మ్‌లపై తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఓఎన్ డీసీని అప్పుడే యూపీఐతో పోలు స్తున్నారు. దేశంలో ఇప్పటికే భారీ విజయం సాధించిన ఈ చెల్లింపుల విధానాన్ని అమలు చేసేందుకు, లేదా యూపీఐలోనే భాగంగా మారేందుకు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. యూపీఐ సాయంతో గూగుల్‌ పే, ఫోన్  పే, జియో, అమెజాన్  వంటి అనేక పేమెంట్‌ పోర్టళ్ల నుంచి చెల్లింపులు చేయవచ్చునన్నది మనకు తెలిసిన విషయమే.

ఓఎన్ డీసీ ఆలోచన చాలా బాగున్నప్పటికీ ప్రస్తుతానికి అది బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. మైక్రోసాఫ్ట్, పేటీఎం, ఫోన్ పే వంటి దిగ్గజ కంపెనీలూ దీంట్లో భాగస్వాములయ్యాయి. ఓఎన్ డీసీ నెట్‌వర్క్‌ను వినియోగదారులు భిన్నరీతుల్లో ఉపయోగిస్తున్నారు. దీనివల్ల కొన్ని వివాదాలూ వస్తున్నాయి. ఉదాహరణకు... కొంత మంది ఓఎన్ డీసీ నెట్‌వర్క్‌పై ఆహారాన్ని ఆర్డర్‌ చేస్తూండటం. జొమాటో, స్విగ్గీ వంటి అప్లికేషన్ల జోలికి పోకుండా వినియోగదారులు నేరుగా ఓఎన్ డీసీ ప్లాట్‌ఫార్మ్‌ పైనే ఫుడ్‌ ఆర్డర్లు పెడుతూండటం... కమిషన్లు తక్కువగా ఉన్న కారణంగా ధరలు తక్కువగా ఉండటం రెస్టారెంట్లను ఆకర్షిస్తోంది.

స్విగ్గీ, జొమాటో లాంటి పెద్ద కంపెనీలు తమను నియంత్రిస్తున్నాయన్న భావనలో ఉన్న రెస్టారెంట్లు ఇప్పుడు ఓఎన్ డీసీ వైపు మళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. సమస్యల్లా ఒక్కటే. సరకుల రవాణా బాధ్యత ఏ కంపెనీ తీసుకోవాలి? ఈ నైపుణ్యం డెలివరీ అప్లికేషన్లది!  ఒకవేళ ఆర్డర్లు సరైన సమయానికి వినియోగదారులకు చేరకపోతే, అందిన సరుకులు సక్రమంగా లేకపోతే బాధ్యత ఎవరిది? ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఫుడ్‌ డెలివరీకి మాత్రమే కాదు, ఇతర విక్రయాలకూ ఈ సమస్యల పరిష్కారం అత్యవసరం.

రవాణా సమస్యల పరిష్కారానికి ‘లాజిస్టిక్స్‌’ రంగంలోని స్టార్టప్‌లతో ప్రయత్నాలు మొదలయ్యాయని ఓఎన్ డీసీ చెబుతోంది. డెలివరీ సమస్యలను ఇవి చూసుకుంటాయని అంటోంది. అయితే కొన్ని అంశాలను ఇంకా సరిచేయాల్సిన అవసరముంది. డిస్కౌంట్లు, తక్కువ కమిషన్  వంటివి ఇలాగే ఎక్కువ కాలంపాటు కొనసాగే అవకాశాలు తక్కువ. ఓఎన్ డీసీ నిర్వాహకులు కూడా పలు సంద ర్భాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నెట్‌వర్క్‌ ఆరంభానికీ, ప్రాచుర్యానికీ ఈ డిస్కౌంట్లు ఉపయోగపడతాయి కానీ... దీర్ఘకాలంలో వీటి రూపురేఖలు మార్కెట్‌ శక్తులపై ఆధారపడి ఉంటాయని వారు చెబుతున్నారు. 

కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఓఎన్ డీసీలో 36,000 మంది విక్రయదారులున్నారు. గత ఏడాది సెప్టెంబరులో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ సాధించిన పురోగతి ఇది. అలాగే నెట్‌వర్క్‌ భాగస్వాముల సంఖ్య 45గా ఉంది. సగటున వారానికి 13 వేల రిటైల్‌ ఆర్డర్లు వస్తూండగా... గరిష్ఠంగా ఒక్క రోజులో 25 వేల వ్యవహారాలు నడిచాయి.

ఈ–రిటైల్‌ రంగం సామర్థ్యం భారీ ఎత్తున పెరగనుందని కూడా ఓఎన్ డీసీ వెబ్‌సైట్‌ ద్వారా తెలుస్తోంది. సుమారు 14 కోట్ల మంది ఆన్‌లైన్  వినియో గదారులతో చైనా, అమెరికా తరువాత భారత్‌ మూడో స్థానంలో ఉందని లెక్క. అయితే దేశంలో ఈ–రిటైల్‌ చొచ్చుకుపోయింది చాలా తక్కువ.

చైనాలో 25 శాతం ప్రాంతాలకు విస్తరించగా, కొరియాలో ఇది 26 శాతంగా ఉంది. అలాగే యూకేలో ఈ–రిటైల్‌ విస్తరణ 23 శాతముంటే, భారత్‌లో కేవలం 4.3 మాత్రమే. దేశంలో ఉండే 75 కోట్ల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులను పరిగణనలోకి తీసుకుంటే ఇది చాలా తక్కువ. బెయిన్  అండ్‌ ఆక్సీల్‌ సంస్థ లెక్కల ప్రకారం 2027 నాటికి దాదాపు కోటీ యాభై లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఆన్‌లైన్‌ క్రయ విక్రయాలకు దిగనున్నాయి.

ప్రస్తుతం ఈ సంఖ్య 60 లక్షలు మాత్రమే. ఈ నేపథ్యంలోనే ఓఎన్ డీసీకి ప్రాధాన్యమేర్పడుతోంది. ఈ–రీటెయిలింగ్‌ దేశం నలుమూలకూ విస్తరించేందుకు ఇదో గొప్ప సాధనమవుతుందని అంచనా. 

ఓఎన్ డీసీ పుట్టి నెలలు కూడా గడవకముందే దీనిపై కొందరు ఇది పనిచేయదని పెదవి విరిచేస్తున్నారు. పనిభారం ఎక్కువవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంటర్నెట్‌ దిగ్గజ కంపెనీలు ఓఎన్‌ డీసీలో భాగం కాకపోతే విజయవంతమయ్యే అవకాశాలు తక్కువన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. గూగుల్‌ ఈ నెట్‌వర్క్‌లో భాగస్వామి అవుతుందని గత ఏడాది మధ్యలో కొన్ని వదంతులైతే వచ్చాయి. కానీ ఆ తరువాత ఎలాంటి సద్దు లేదు. ఈ–కామర్స్‌ సంస్థలు అమెజాన్, వాల్‌మార్ట్‌ ఆధ్వర్యంలోని ఫ్లిప్‌కార్ట్‌ ఇంకా ఓఎన్ డీసీలో చేరలేదు.

అయితే వాల్‌మార్ట్‌కే చెందిన ఫోన్  పే ఇప్పటికే ఇందులో భాగస్వామి కావడం గమనార్హం. ఫోన్  పే... ‘పిన్ కోడ్‌’ అనే ప్రత్యేకమైన అప్లికేషన్‌తో ఓఎన్‌డీసీలో చేరింది. ఓలా, ఊబర్‌లను కూడా చేర్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఈ రంగంలో ఇప్పటివరకూ బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ‘నమ్మ యాత్రి’ అన్న రైడ్‌ హెయి లింగ్‌ సంస్థ మాత్రమే ఓఎన్ డీసీలో భాగంగా ఉంది.
 
ఓఎన్ డీసీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న నెట్‌వర్క్‌. పూర్తి సామర్థ్యాన్ని అందుకునేందుకు కొంత సమయం పడుతుంది. ఈ నెట్‌వర్క్‌లో ఇప్పుడే భాగస్వాములుగా చేరాలనీ, భవిష్యత్తులో చేర్చుకోమనీ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ వ్యాఖ్యానించడం దీని అభివృద్ధికి అంతగా సహకరించేది కాదు. ఓఎన్డీసీ జయాపజయాలు ఆర్థికంగా ఎంతమేరకు అనుకూలం అన్నది భాగస్వాముల చేరిక, ప్రభుత్వ ప్రోత్సాహం వంటి అంశాలపై ఆధారపడి ఉంది.

యూపీఐ, ఆధార్‌ల మాదిరిగా ఓఎన్డీసీ కూడా విప్లవాత్మకమైన ఆలోచనైతే అది దాని సృజనాత్మక డిజైన్  కారణంగానే అవు తుంది కానీ ప్రభుత్వ మార్గదర్శకత్వాల కారణంగా కాదు. ఈ కొత్త ఈ–కామర్స్‌ ప్రపంచం ఎలా పరిణమించనుందో తెలుసుకోవాలంటే వేచి చూడటం కంటే వేరు మార్గం లేదు.
సుష్మా రామచంద్రన్‌ 
వ్యాసకర్త సీనియర్‌ ఆర్థిక వ్యవహారాల జర్నలిస్ట్‌
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement