Indian retail sector
-
ఓఎన్ డీసీతో ఈ–కామర్స్ విప్లవం?
ఈ–కామర్స్ రంగంలో ఈ మధ్యకాలంలో ఓ విషయం హల్చల్ చేస్తోంది. భారత రిటైల్ రంగాన్ని సమూలంగా మార్చేయగల సత్తా ఉందని చెప్పు కుంటున్న దాని పేరు... ‘ఓఎన్ డీసీ’. వస్తువులు అమ్ముకునే వారికీ, కొనేవారికీ వేదికగా నిలవగల, అందరికీ అందుబాటులో ఉండే నెట్వర్క్ ఇది. స్థూలంగా చెప్పాలంటే దేశంలోని లక్షలాది చిన్న కంపెనీలు అతితక్కువ ఖర్చుతో ఈ–కామర్స్ ప్లాట్ఫార్మ్పై తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఈ ప్లాట్ఫార్మ్కు కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సాహం అందిస్తోంది. అలాగని ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాదు. ప్రైవేట్ రంగంలోనే లాభాపేక్ష లేని సంస్థగా కొనసాగనుంది. ఈ–రిటైలింగ్ దేశం నలుమూలలకూ విస్తరించేందుకు ఇదో గొప్ప సాధనమవుతుందని అంచనా! ‘ఓఎన్ డీసీ’ అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. వ్యాపారులు, వినియోగ దారులిద్దరికీ చాలా అనుకూలంగా ఉండే ఈ ప్లాట్ఫార్మ్కు కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సాహం అందిస్తోంది. అలాగని ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాదు. ప్రైవేట్ రంగంలోనే లాభాపేక్ష లేని సంస్థగా కొన సాగనుంది. బ్యాంకుల్లాంటి ఆర్థిక సంస్థలు, ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలెకని వంటివారు ఈ ఓఎన్ డీసీకి దన్నుగా నిలిచారు. నందన్ నీలెకని ఈ మొత్తం ప్రయత్నానికి సూత్రధారి అని కూడా చెబుతున్నారు. ఈ– కామర్స్ రంగాన్ని ప్రజాస్వామ్య పథం పట్టించే సామర్థ్యమున్న అతి పెద్ద ఆవిష్కరణ ఇదని నందన్ చెబుతున్నారు. ఓఎన్ డీసీకి ఇచ్చిన నిర్వచనాన్ని పరిశీలించినా ఈ విషయం అర్థమవుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి ప్లాట్‌ఫార్మ్‌లపై ఏ సంస్థ అయినా తమ ఉత్పత్తులను అమ్ముకోవాలంటే వాటిల్లో ప్రత్యేకంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మకాల్లో గరిష్ఠంగా 35 శాతం కమిషన్‌ను ఈ ప్లాట్ఫార్మ్లు పొందుతూంటాయి. ఓఎన్ డీసీలో ఈ అవసరం ఉండదు. వినియోగదారులకూ ఇది వర్తిస్తుంది. చిన్న చిన్న కంపెనీలు నేరుగా ఓఎన్ డీసీ ప్లాట్ఫార్మ్పై తమ ఉత్పత్తులను అమ్ము కునేందుకు వీలేర్పడుతోంది. ఈ ఉత్పత్తులను వినియోగదారులు మాత్రమే కాకుండా... అమెజాన్ వంటి పెద్ద రిటైయిలర్లూ కొనుగోలు చేయవచ్చు. ఓఎన్ డీసీలో కమిషన్ కేవలం రెండు నుంచి ఐదు శాతం మాత్రమే ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే దేశంలోని లక్షలాది చిన్న కంపెనీలు అతితక్కువ ఖర్చుతో ఈ–కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లపై తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఓఎన్ డీసీని అప్పుడే యూపీఐతో పోలు స్తున్నారు. దేశంలో ఇప్పటికే భారీ విజయం సాధించిన ఈ చెల్లింపుల విధానాన్ని అమలు చేసేందుకు, లేదా యూపీఐలోనే భాగంగా మారేందుకు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. యూపీఐ సాయంతో గూగుల్ పే, ఫోన్ పే, జియో, అమెజాన్ వంటి అనేక పేమెంట్ పోర్టళ్ల నుంచి చెల్లింపులు చేయవచ్చునన్నది మనకు తెలిసిన విషయమే. ఓఎన్ డీసీ ఆలోచన చాలా బాగున్నప్పటికీ ప్రస్తుతానికి అది బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. మైక్రోసాఫ్ట్, పేటీఎం, ఫోన్ పే వంటి దిగ్గజ కంపెనీలూ దీంట్లో భాగస్వాములయ్యాయి. ఓఎన్ డీసీ నెట్‌వర్క్‌ను వినియోగదారులు భిన్నరీతుల్లో ఉపయోగిస్తున్నారు. దీనివల్ల కొన్ని వివాదాలూ వస్తున్నాయి. ఉదాహరణకు... కొంత మంది ఓఎన్ డీసీ నెట్‌వర్క్‌పై ఆహారాన్ని ఆర్డర్ చేస్తూండటం. జొమాటో, స్విగ్గీ వంటి అప్లికేషన్ల జోలికి పోకుండా వినియోగదారులు నేరుగా ఓఎన్ డీసీ ప్లాట్ఫార్మ్ పైనే ఫుడ్ ఆర్డర్లు పెడుతూండటం... కమిషన్లు తక్కువగా ఉన్న కారణంగా ధరలు తక్కువగా ఉండటం రెస్టారెంట్లను ఆకర్షిస్తోంది. స్విగ్గీ, జొమాటో లాంటి పెద్ద కంపెనీలు తమను నియంత్రిస్తున్నాయన్న భావనలో ఉన్న రెస్టారెంట్లు ఇప్పుడు ఓఎన్ డీసీ వైపు మళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. సమస్యల్లా ఒక్కటే. సరకుల రవాణా బాధ్యత ఏ కంపెనీ తీసుకోవాలి? ఈ నైపుణ్యం డెలివరీ అప్లికేషన్లది! ఒకవేళ ఆర్డర్లు సరైన సమయానికి వినియోగదారులకు చేరకపోతే, అందిన సరుకులు సక్రమంగా లేకపోతే బాధ్యత ఎవరిది? ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఫుడ్ డెలివరీకి మాత్రమే కాదు, ఇతర విక్రయాలకూ ఈ సమస్యల పరిష్కారం అత్యవసరం. రవాణా సమస్యల పరిష్కారానికి ‘లాజిస్టిక్స్’ రంగంలోని స్టార్టప్‌లతో ప్రయత్నాలు మొదలయ్యాయని ఓఎన్ డీసీ చెబుతోంది. డెలివరీ సమస్యలను ఇవి చూసుకుంటాయని అంటోంది. అయితే కొన్ని అంశాలను ఇంకా సరిచేయాల్సిన అవసరముంది. డిస్కౌంట్లు, తక్కువ కమిషన్ వంటివి ఇలాగే ఎక్కువ కాలంపాటు కొనసాగే అవకాశాలు తక్కువ. ఓఎన్ డీసీ నిర్వాహకులు కూడా పలు సంద ర్భాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నెట్వర్క్ ఆరంభానికీ, ప్రాచుర్యానికీ ఈ డిస్కౌంట్లు ఉపయోగపడతాయి కానీ... దీర్ఘకాలంలో వీటి రూపురేఖలు మార్కెట్ శక్తులపై ఆధారపడి ఉంటాయని వారు చెబుతున్నారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఓఎన్ డీసీలో 36,000 మంది విక్రయదారులున్నారు. గత ఏడాది సెప్టెంబరులో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ సాధించిన పురోగతి ఇది. అలాగే నెట్వర్క్ భాగస్వాముల సంఖ్య 45గా ఉంది. సగటున వారానికి 13 వేల రిటైల్ ఆర్డర్లు వస్తూండగా... గరిష్ఠంగా ఒక్క రోజులో 25 వేల వ్యవహారాలు నడిచాయి. ఈ–రిటైల్ రంగం సామర్థ్యం భారీ ఎత్తున పెరగనుందని కూడా ఓఎన్ డీసీ వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది. సుమారు 14 కోట్ల మంది ఆన్లైన్ వినియో గదారులతో చైనా, అమెరికా తరువాత భారత్ మూడో స్థానంలో ఉందని లెక్క. అయితే దేశంలో ఈ–రిటైల్ చొచ్చుకుపోయింది చాలా తక్కువ. చైనాలో 25 శాతం ప్రాంతాలకు విస్తరించగా, కొరియాలో ఇది 26 శాతంగా ఉంది. అలాగే యూకేలో ఈ–రిటైల్ విస్తరణ 23 శాతముంటే, భారత్‌లో కేవలం 4.3 మాత్రమే. దేశంలో ఉండే 75 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులను పరిగణనలోకి తీసుకుంటే ఇది చాలా తక్కువ. బెయిన్ అండ్ ఆక్సీల్ సంస్థ లెక్కల ప్రకారం 2027 నాటికి దాదాపు కోటీ యాభై లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఆన్లైన్ క్రయ విక్రయాలకు దిగనున్నాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 60 లక్షలు మాత్రమే. ఈ నేపథ్యంలోనే ఓఎన్ డీసీకి ప్రాధాన్యమేర్పడుతోంది. ఈ–రీటెయిలింగ్ దేశం నలుమూలకూ విస్తరించేందుకు ఇదో గొప్ప సాధనమవుతుందని అంచనా. ఓఎన్ డీసీ పుట్టి నెలలు కూడా గడవకముందే దీనిపై కొందరు ఇది పనిచేయదని పెదవి విరిచేస్తున్నారు. పనిభారం ఎక్కువవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంటర్నెట్ దిగ్గజ కంపెనీలు ఓఎన్ డీసీలో భాగం కాకపోతే విజయవంతమయ్యే అవకాశాలు తక్కువన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. గూగుల్ ఈ నెట్‌వర్క్‌లో భాగస్వామి అవుతుందని గత ఏడాది మధ్యలో కొన్ని వదంతులైతే వచ్చాయి. కానీ ఆ తరువాత ఎలాంటి సద్దు లేదు. ఈ–కామర్స్ సంస్థలు అమెజాన్, వాల్‌మార్ట్ ఆధ్వర్యంలోని ఫ్లిప్‌కార్ట్ ఇంకా ఓఎన్ డీసీలో చేరలేదు. అయితే వాల్‌మార్ట్‌కే చెందిన ఫోన్ పే ఇప్పటికే ఇందులో భాగస్వామి కావడం గమనార్హం. ఫోన్ పే... ‘పిన్ కోడ్’ అనే ప్రత్యేకమైన అప్లికేషన్‌తో ఓఎన్డీసీలో చేరింది. ఓలా, ఊబర్‌లను కూడా చేర్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఈ రంగంలో ఇప్పటివరకూ బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ‘నమ్మ యాత్రి’ అన్న రైడ్ హెయి లింగ్ సంస్థ మాత్రమే ఓఎన్ డీసీలో భాగంగా ఉంది. ఓఎన్ డీసీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న నెట్వర్క్. పూర్తి సామర్థ్యాన్ని అందుకునేందుకు కొంత సమయం పడుతుంది. ఈ నెట్‌వర్క్‌లో ఇప్పుడే భాగస్వాములుగా చేరాలనీ, భవిష్యత్తులో చేర్చుకోమనీ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ వ్యాఖ్యానించడం దీని అభివృద్ధికి అంతగా సహకరించేది కాదు. ఓఎన్డీసీ జయాపజయాలు ఆర్థికంగా ఎంతమేరకు అనుకూలం అన్నది భాగస్వాముల చేరిక, ప్రభుత్వ ప్రోత్సాహం వంటి అంశాలపై ఆధారపడి ఉంది. యూపీఐ, ఆధార్ల మాదిరిగా ఓఎన్డీసీ కూడా విప్లవాత్మకమైన ఆలోచనైతే అది దాని సృజనాత్మక డిజైన్ కారణంగానే అవు తుంది కానీ ప్రభుత్వ మార్గదర్శకత్వాల కారణంగా కాదు. ఈ కొత్త ఈ–కామర్స్ ప్రపంచం ఎలా పరిణమించనుందో తెలుసుకోవాలంటే వేచి చూడటం కంటే వేరు మార్గం లేదు. సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఆర్థిక వ్యవహారాల జర్నలిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
రిటైల్‌లో కొనసాగనున్న కన్సాలిడేషన్
న్యూఢిల్లీ: దేశీ రిటైల్ రంగంలో బడా కంపెనీలు కొత్త ఏడాది తమ స్థానాలను పటిష్టం చేసుకోవడంపై మరింతగా కసరత్తు చేయనున్నాయి. దీంతో 2023లోనూ కన్సాలిడేషన్ కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వృద్ధి అవకాశాలు ఆశావహంగానే కనిపిస్తున్నా, ద్రవ్యోల్బణంపరమైన ప్రతికూలతలు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదలతో ఆందోళనల కారణంగా పరిశ్రమ కొంత ఆచితూచి వ్యవహరించవచ్చని విశ్లేషకులు తెలిపారు. సమర్ధమంతమైన పెద్ద సంస్థలకు చాలా మటుకు చిన్న రిటైలర్లు తమ వ్యాపారాలను విక్రయించి తప్పుకునే అవకాశాలు ఉండటంతో 2023లో కన్సాలిడేషన్ కొనసాగవచ్చని భావిస్తున్నట్లు డెలాయిట్ ఇండియా కన్సల్టింగ్ పార్ట్నర్ రజత్ వాహి చెప్పారు. కస్టమరుకు అత్యుత్తమ అనుభూతిని ఇచ్చేందుకు స్టోర్స్‌లో టెక్నాలజీ వినియోగం మరింత పెరగవచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా మిగతా కీలక మార్కెట్లతో పోలిస్తే భారత్‌లో రిటైల్ విభాగం మెరుగైన వృద్ధి సాధించగలదని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) సీఈవో కుమార్ రాజగోపాలన్ చెప్పారు. ఓఎన్డీసీ (డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్వర్క్) వంటి కాన్సెప్టులతో రాబోయే రోజుల్లో అసంఖ్యాకంగా చిన్న రిటైలర్లు డిజిటల్ కామర్స్‌లో పాలుపంచుకుంటారని వివరించారు. ఆదాయాల్లో 20 శాతం వరకూ వృద్ధి .. 2023 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా సంఘటిత రంగ ఆహార, నిత్యావసరాల రిటైలర్ల ఆదాయాలు 15–20 శాతం శ్రేణిలో పెరగవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన ఒక నివేదిక వెల్లడించింది. అయితే, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్ల కారణంగా నిర్వహణ లాభాల మార్జిన్లు 5–6 శాతం శ్రేణికి పరిమితం కావచ్చని వివరించింది. సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు టెక్నాలజీని వినియోగించుకోవడం, మెట్రో నగరాలను దాటి కార్యకలాపాలను విస్తరించడం తదితర అంశాలపై కంపెనీలు దృష్టి పెట్టనున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై భారత విభాగం లీడర్ (కన్జూమర్ ప్రోడక్ట్స్, రిటైల్) అంశుమన్ భట్టాచార్య తెలిపారు. ఇక, కొత్త ఏడాదిలోకి ప్రవేశించే తరుణంలో ఒకసారి 2022లో రిటైల్‌లో చోటు చేసుకున్న కీలక పరిణామాలు కొన్ని చూస్తే .. ► ఏకంగా 16,600 పైచిలుకు స్టోర్స్‌తో రిలయన్స్ రిటైల్ దేశీయంగా అతి పెద్ద ఆఫ్‌లైన్ రిటైలరుగా ఎదిగింది. 18 బిలియన్ డాలర్ల ఆదాయంతో అంతర్జాతీయంగా టాప్ రిటైలర్లలో 56వ స్థానంలోనూ, అత్యంత వేగంగా ఎదుగుతున్న రిటైలర్లలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. జర్మన్ రిటైల్ సంస్థ మెట్రో ఏజీకి చెందిన భారత కార్యకలాపాలను రూ. 2,850 కోట్లకు కొనుగోలు చేసేందుకు డీల్ కుదుర్చుకుంది. అలాగే, అబు జానీ సందీప్ ఖోస్లా (ఏజేఎస్కే), పర్పుల్ పాండా ఫ్యాషన్స్ మొదలైన పలు ఫ్యాషన్స్ బ్రాండ్స్‌లో, రోబోటిక్స్ కంపెనీ యాడ్వర్బ్లోనూ మెజారిటీ వాటాలు దక్కించుకుంది. ► ఆదిత్య బిర్లా గ్రూప్‌లో బాగమైన టీఎంఆర్‌డబ్ల్యూ సంస్థ ఫ్యాషన్ కేటగిరీలో ఎనిమిది డిజిటల్ ఫస్ట్ లైఫ్‌స్టయిల్ బ్రాండ్స్‌లో మెజారిటీ వాటాలు తీసుకుంది. ► ఆన్లైన్లో కార్యకలాపాలు విస్తరించే దిశగా వీ–మార్ట్ సంస్థ లైమ్‌రోడ్‌ను కొనుగోలు చేసింది. ► దేశీ రిటైల్ పరిశ్రమలో దిగ్గజంగా వెలుగొందిన ఫ్యూచర్ రిటైల్ కుప్పకూలింది. దివాలా పరిష్కార చర్యలు ఎదుర్కొంటోంది. -
రిటైల్‌కు రూ.5.5 లక్షల కోట్ల నష్టం
ముంబై: దేశవ్యాప్తంగా ఏడు కోట్ల మంది వ్యాపారులు ఉన్న రిటైల్ రంగం లాక్డౌన్ కారణంగా రూ.5.5 లక్షల కోట్లు నష్ట పోయిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) వెల్లడించింది. 20 శాతం మంది రిటైలర్లు రానున్న కాలంలో తమ వ్యాపారాలను మూసివేయనున్నట్టు తెలిపింది. ఇటువంటి కష్ట కాలంలో వర్తకులను ఆదుకోవడానికి ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రానికి విన్నవించినట్టు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ వివరించారు. ‘భారత వర్తకుల రోజువారీ వ్యాపారం విలువ రూ.15,000 కోట్లు. లాక్డౌన్ కారణంగా పరిశ్రమకు రూ.5.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో 1.5 కోట్ల మంది వర్తకులు వ్యాపారాలను శాశ్వతంగా మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ వర్తకుల మీద ఆధారపడ్డ 75 లక్షల మంది చిరు వ్యాపారులు కూడా వీరి దారిన నడవాల్సిందే. దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మంది సూక్ష్మ, చిన్నవ్యాపారులు ఉంటారు’ అని తెలిపారు. ప్రభుత్వమే ఆదుకోవాలి.... ‘ఈ విపత్కర పరిస్థితిని తట్టుకునే బలం వ్యాపారులకు లేదు. వర్తకులు తమ ఉద్యోగుల జీతాలు, షాపుల అద్దెలు చెల్లిస్తున్నారు. మరోవైపు కస్టమర్ల ఖర్చు చేయతగ్గ ఆదాయం తగ్గింది. ఈ పరిణామాలతో వ్యాపారాలు సాధారణ స్థితికి రావడానికి 6–9 నెలల సమయం పడుతుంది. ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. అన్ని రంగాల్లో డిమాండ్ తక్కువగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందన్న ఆశలు కోల్పోయాం’ అని ఖండేల్వాల్ వివరించారు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఈ రంగానికి ఊహించని నష్టం వాటిల్లుతుందని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బి.సి.భాటియా అన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే కరోనాను మించిన ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. -
భారత్ కు రెండో ర్యాంక్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ♦ ఆకర్షణీయంగా భారత రిటైల్ రంగం ♦ నిబంధనల సరళీకరణ, జీడీపీ జోరు ప్రధాన కారణాలు ♦ జీఆర్‌డీఐ నివేదిక వెల్లడి సింగపూర్: వ్యాపార నిర్వహణ సులభతరం చేయడంలో భారత్ ఈ ఏడాది రెండో ర్యాంక్‌ను సాధించింది. గ్లోబల్ రిటైల్ డెవలప్మెంట్ ఇండెక్స్(జీఆర్‌డీఐ) రూపొందించిన ఈ జాబితాలో అభివృద్ధి చెందుతున్న 30 దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. భారత్‌లో జనాభా అధికంగా ఉండడం, జీడీపీ జోరు పెరుగుతుండడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ప్రభుత్వం సరళీకరిస్తుండడం వంటి కారణాల వల్ల భారత రిటైల్ మార్కెట్ వృద్ధి జోరుపై విదేశీ రిటైలర్ల ఆసక్తి అధికమైందని ఈ జీఆర్‌డీఐ నివేదిక పేర్కొంది. అందుకనే భారత్‌కు ఈ ర్యాంక్ లభించిందంటున్న ఈ జీఆర్‌డీఐ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు.. ♦ గత ఏడాది ర్యాంక్ నుంచి భారత్ 13 స్థానాలు ఎగబాకింది. ♦ ఈ జాబితాలో చైనాకు మొదటిస్థానం దక్కింది. ♦ సింగిల్-బ్రాండ్ రిటైల్ రంగానికి సంబంధించి పలు కీలక ఎఫ్‌డీఐ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సరళీకరించింది. దీంతో బహుళ జాతి కంపెనీలకు భారత్‌లో ప్రవేశించడానికి మార్గం సుగమం అయింది. ♦ భారత రిటైల్ రంగం 2013-15 కాలంలో 9 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది. వార్షిక విక్రయాలు లక్షకోట్ల డాలర్ల మైలురాయిని అధిగమించాయి. ♦ భారత వృద్ధి జోరును ఈ-కామర్స్ మరింత పెంచడమే కాకుండా, భారత్‌ను మరింత ఆకర్షణీయ మార్కెట్‌గా మారుస్తోంది. ♦ {పపంచంలోనే భారత్ రెండో అతి పెద్ద ఇంటర్నెట్ మార్కెట్. ఆన్లైన్ షాపింగ్ పట్ల భారత వినియోగదారులు ఆసక్తి పెరుగుతుండటంతో వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు ఈ-కామర్స్ రంగంలో పెట్టుబడుల జోరును పెంచుతున్నాయి. -
భాగస్వామ్య వ్యాపారానికి వాల్ మార్ట్, భారతీలు గుడ్ బై!
భారత రిటైల్ రంగంలో భారతీ ఎంటర్ ప్రైజెసెస్, వాల్ మార్ట్ స్టోర్స్ ఇంక్ ల భాగస్వామ్య వ్యాపారానికి తెరపడింది. తమ సంస్థలకు చెందిన వ్యాపార వ్యవహారాలను సొంతంగా నిర్వహించుకునేందుకు భారతీ, వాల్ మార్ట్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. రిటైల్ రంగ వ్యాపారంలో ఫ్రాంచైజీ ఒప్పందాన్ని రద్దు చేస్తూ.. భారత్ లో తమకు అనుకూలంగా ఉండే విధానంలో వ్యాపార కార్యక్రమాల్ని నిర్వహించుకునేందుకు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని ఇరు సంస్థలు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. అవగాహన ఒప్పందాలు, చెల్లింపులు, విధానాలకు సంబంధించిన అంశాలకు అమోదం లభించిన మేరకు ఒప్పందాలుంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అన్ని రకాల వ్యవహారాలు పూర్తయిన తర్వాత భారతీ వాల్ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లోని భారతీ వాటాను వాల్ మార్ట్ సొంతం చేసుకుంటుంది అని..ఆతర్వాతే బెస్ట్ ప్రైస్ మోడర్న్ హోల్ సేల్ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారంపై పూర్తి స్థాయి ఆజామాయిషీ లభిస్తుందని తెలిపారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై భారతీ ఎంటర్ ప్రైజెసెస్ వైస్ చైర్మన్, ఎండీ రంజన్ భారతీ మిట్టల్ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయికి తగ్గట్టూ రిటైల్ వ్యాపారాన్ని విస్తరిస్తాం అని తెలిపారు. ఇప్పటికే తమ సంస్థకు 212 స్టోర్లు ఉన్నాయని.. వ్యాపారాన్ని పెంచడానికి, వినియోగ దారులకు చేరువయ్యేందుకు అన్ని రకాల మార్గాలున్నాయన్నారు.