
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవితకాల నమోదిత యూజర్ల సంఖ్య దేశవ్యాప్తంగా 35 కోట్లు దాటిందని ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే వెల్లడించింది. 2021 జనవరితో పోలిస్తే ఇది 28 శాతం వృద్ధి అని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ‘నలుగురు భారతీయుల్లో ఒకరు ఫోన్‌పే వాడుతున్నారు. డిసెంబర్ నెల యాక్టివ్ యూజర్లు 15 కోట్లు నమోదైంది. గత నెలలో 50 కోట్లకుపైగా లావాదేవీలు జరిగాయి. ఫోన్‌పే వేదికగా ఏడాదిలో రూ.48,34,977 కోట్ల చెల్లింపులు జరిగాయి’ అని వివరించింది.
భారతదేశపు అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌గా అవతరించామని ఫోన్‌పే కంజ్యూమర్ ప్లాట్‌ఫాం, పేమెంట్స్ హెడ్ సోనికా చంద్ర తెలిపారు. లావాదేవీలు విజయవంతంగా పూర్తి అయ్యేలా నిరంతరం శ్రమిస్తున్న సాంకేతిక బృందం కారణంగానే ఇది సాధ్యమైందని చెప్పారు. 15,700 పట్టణాలు, గ్రామాల్లో 2.5 కోట్ల స్టోర్లలో వ్యాపారులు ఫోన్‌పే ద్వారా చెల్లింపులను స్వీకరిస్తున్నట్టు వెల్లడించారు.