ఆర్బీకేల్లో డిజిటల్‌ లావాదేవీలు | Digital transactions in Rythu Bharosa Centers | Sakshi
Sakshi News home page

ఆర్బీకేల్లో డిజిటల్‌ లావాదేవీలు

Published Sun, Feb 13 2022 5:31 AM | Last Updated on Sun, Feb 13 2022 10:57 AM

Digital transactions in Rythu Bharosa Centers - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామాల్లోని వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) సేవల్లో నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అవినీతికి ఆస్కారంలేని రీతిలో మరింత వేగంగా, పారదర్శకంగా సేవలందించే ఏర్పాట్లు చేస్తోంది. నాణ్యమైన ఎరువులు, సబ్సిడీ, నాన్‌సబ్సిడీ విత్తనాలు, పురుగు మందులు, దాణా, రొయ్యలు, చేపల మేత చెల్లింపుల్లో డిజిటల్‌ లావాదేవీలను ప్రారంభిస్తోంది. 

రైతులు ఆర్బీకేల్లో తమకు అవసరమైన వాటిని బుక్‌ చేసుకునే ముందు సబ్సిడీని మినహాయించుకొని మిగతా మొత్తాన్ని సంబంధిత ఏజెన్సీలకు లేదా ఆర్బీకే ఖాతాలకు జమ చేసేవారు. ఈ రసీదును చూపిస్తే సిబ్బంది ఇండెంట్‌ పెట్టేవారు. ఈ ప్రక్రియతో సమయం వృధా అవుతోంది. సాంకేతిక సమస్యలూ వస్తున్నాయి. వాటిని అధిగమించేందుకు ఆర్బీకేల్లోనే నగదు చెల్లింపులకు అనుమతినిచ్చారు.

ఈ సొమ్ము నాలుగైదు రోజులకోసారి ఆర్బీకే ఖాతాల నుంచి సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలకు జమ చేసే వారు. నగదు చేతికొచ్చాక వీఏఏలు ఇండెంట్‌ పెట్టేవారు. తమ ఖాతాలకు జమ కాలేదన్న కారణంతో ఏజెన్సీలు సరుకు పంపడంలో జాప్యం జరిగేది. పైగా వసూలు చేసిన నగదును ఆర్బీకే సిబ్బంది రెండు మూడు రోజులు తమ వద్దే ఉంచుకోవడం, కొన్ని చోట్ల పక్కదారి పట్టించిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల జాప్యం, అవకతవకలకు ఆస్కారం లేని రీతిలో పారదర్శకంగా పంపిణీ చేయొచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. 

ముందుగా విత్తనాలకు 
ఆర్బీకేల ద్వారా సాగు ఉత్పాదకాల పంపిణీలో విత్తనాభివృద్ధి సంస్థదే కీలక పాత్ర. ఏటా రాష్ట్రంలో రూ.1,500 కోట్ల విత్తనాలు విక్రయిస్తున్నారు. దాంట్లో రూ.670 కోట్ల విలువైన సబ్సిడీ విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ అందిస్తుంది. సబ్సిడీ పోను రైతుల నుంచి రూ.400 కోట్లు వసూలు చేస్తుంది. రానున్న ఖరీఫ్‌ నుంచి సబ్సిడీతో పాటు కనీసం పది శాతం నాన్‌ సబ్సిడీ విత్తనాలను ఆర్బీకేల ద్వారా విక్రయించాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో డిజిటల్‌ చెల్లింపులకు శ్రీకారం చుడుతోంది. ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి వాలెట్స్‌ ద్వారా నేరుగా సంస్త ఖాతాకు జమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందుకోసం ఐసీఐసీఐ బ్యాంకుతో చేసుకున్న అవగాహన ఒప్పందం మేరకు ప్రతి ఆర్బీకేకు ఓ క్యూ ఆర్‌ కోడ్‌ ఇస్తారు. చెల్లింపులు బయటకు విన్పించేలా ఓ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ సిస్టమ్‌ను అందిస్తారు. రైతులు వారికి అవసరమైన వాటిని బుక్‌ చేసుకొనే సమయంలో తగిన సొమ్మును స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి చెల్లించాలి. వెంటనే వారికి విత్తనాలను అందిస్తారు. డిజిటల్‌ చెల్లింపులను దశలవారీగా ఎరువులు, పురుగుల మందులు, పశువుల దాణా, రొయ్యలు, చేపల మేతకు కూడా అమలు చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకే 
చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించడంతో పాటు రైతుల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం లక్ష్యంగా డిజిటల్‌ చెల్లింపులకు శ్రీకారం చుడుతున్నాం. రానున్న ఖరీఫ్‌ సీజన్‌ నుంచి డిజిటల్‌ చెల్లింపులతోనే ఆర్బీకేల ద్వారా జరిగే విత్తన విక్రయాలు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 
– గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement