(ఎ.అమరయ్య, సాక్షి ప్రతినిధి, అమరావతి) సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) వ్యవస్థ దేశానికే ఆదర్శమని జాతీయ గ్రామీణ వ్యవసాయాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) చైర్మన్ డాక్టర్ జీఆర్ చింతల చెప్పారు. వ్యవసాయ ఉత్పాదకాలను రైతు ఇంటి ముంగిటే అందించడం దేశంలోనే సరికొత్త ప్రయోగంగా అభివర్ణించారు. ఆర్బీకేలను రైతులు సక్రమంగా ఉపయోగించుకుని ఉత్పత్తి వ్యయం కూడా తగ్గించుకోవచ్చని సలహా ఇచ్చారు. రాష్ట్రానికి చెందిన 50 మంది వ్యవసాయ శాస్త్రవేత్తల జీవనరేఖలతో పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు స్మారక కమిటీ ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సాగు వ్యయాన్ని తగ్గించి రైతు ఆదాయాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషిచేస్తున్నారని ప్రశంసించారు. గతంలో ముఖ్యమంత్రిని కలిసినప్పుడు తానీ విషయాన్ని చెప్పానన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సమగ్ర వ్యవసాయ విధానానికి, వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు నాబార్డ్ సంపూర్తిగా సహకరిస్తుందని, నిధులు సమకూర్చేందుకు వెనుకాడబోనని హామీ ఇచ్చారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
ఆర్బీకేల పనితీరు బాగుంది
ఆ మధ్య రాష్ట్ర పర్యటనకు వెళ్లినప్పుడు నేనొక ఆర్బీకేను, రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని (ఎఫ్‌పీవోను) స్వయంగా పరిశీలించా. అక్కడి రైతులు చెప్పిన దాన్నిబట్టి ఆర్బీకేల ప్రయోగం చాలా సక్సెస్ అయినట్టే. ఇప్పటికే రైతులు ఈ కేంద్రాల నుంచి లక్షలాది ఆర్డర్లు పెడుతున్నారు. ఎరువులు, పురుగుమందులు, నాణ్యమైన విత్తనాలు తమ గ్రామానికి తెప్పించుకుంటున్నట్టు వివరించారు. ఇలా జరగడమంటే రైతుకు చాలా వ్యయప్రయాసలు తప్పినట్టు. నాణ్యమైన ఉత్పాదకాలను 72 గంటల్లోగా రాబట్టడమే వ్యవసాయంలో కీలకం. అందుకే ఆర్బీకేల వ్యవస్థ ఆదర్శనీయం అంటున్నా.
కాలాన్నిబట్టి రైతులు మారాలి
మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులూ మారాల్సిన అవసరం వచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో కొద్దిమంది చేతుల్లో ఎక్కువ భూమి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా ఉన్న 14 కోట్ల మంది రైతుల్లో 86 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. ఏపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ తరహా రైతులు నిలదొక్కుకోవాలంటే ఏదో ఒక్క పంట వేస్తే సరిపోదు. ఉన్న భూమిని పలు రకాలుగా వినియోగించుకోవాలి. ఆ భూమిలోనే ఆహారధాన్యాలు, పండ్లతోట, కూరగాయలు సాగుచేస్తూ.. కోళ్లు, పశువుల పెంపకం చేపట్టాలి. అప్పుడే రైతు సుస్థిరత సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఒక పంట పోయినా మరొకటి ఆదాయాన్నిస్తుంది. అందువల్ల పంటల సరళి, ఆలోచనా ధోరణి మారాలి.
వ్యవసాయ శాఖ, యూనివర్శిటీల కృషి పెరగాలి..
రైతుల ఆదాయాన్ని ఎలా పెంచాలన్న దానిపై ప్రధాన బాధ్యత వ్యవసాయశాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలది. ఈ విభాగాల్లో ఉండే వాళ్ల కృషి ప్రధానం. ప్రస్తుతం కావాల్సింది ఉత్పత్తి కాదు. రైతు సాధికారత. ఆ దిశగా పరిశోధనలు సాగాలి. ఏంచేస్తే రైతు ఆదాయం పెరుగుతుందో, పండించిన ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడం ఎలాగో రైతులకు చెప్పాలి. కమతాలు చిన్నవైన ప్రస్తుత తరుణంలో ఉన్న భూమిపై అదనపు ఆదాయం ఎలా సాధించవచ్చో చూపాలి.
మాగాణిలోను నూనెగింజలు సాగుచేయవచ్చు
వ్యవసాయ రంగంలో ఇప్పుడు హరిత, నీలి, వైట్, రెడ్ విప్లవాలు నడుస్తున్నా.. కావాల్సింది మాత్రం బ్రౌన్ విప్లవమే. నూనెగింజల్ని పండించడమే బ్రౌన్ విప్లవం. సుమారు రూ.1.10 కోట్ల విలువైన వంటనూనెల్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఆ స్థాయిలో మన నూనెగింజల దిగుబడులు లేవు. రైతుకు అదనపు ఆదాయం రావాలంటే నూనెగింజల సాగు చేపట్టాలి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందిస్తున్నాయి. నాబార్డ్ కూడా సహకారం అందిస్తుంది. ఏపీలో మాగాణి భూముల్లో కూడా నూనెగింజల్ని సాగు చేయవచ్చు. దీనిపై రైతులు దృష్టి సారించాలి. ఏయే రకాలు అనువైనవో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు సూచించాలి.
రైతు ఉత్పత్తిదారుల సంఘాలదే భవిష్యత్..
సన్న, చిన్న, మధ్యతరహా రైతుల ప్రధాన సమస్య మార్కెటింగ్. వీళ్లకు బేరసారాలు చేసే శక్తి తక్కువ. అందువల్ల వీళ్లు సంఘటితం కావడం ఒక్కటే మార్గం. 10 మందికి తగ్గకుండా అన్నదాతలు.. రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని (ఎఫ్‌పీవోను) ఏర్పాటు చేసుకుంటే నాబార్డ్ సహకరిస్తుంది. ఈ సంఘం ద్వారా రైతులు తమ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించవచ్చు. ప్రాథమికంగా శుద్ధిచేసి నాణ్యత పెంచవచ్చు. వినియోగదారులను ఆకర్షించేలా ప్యాకింగ్ వంటివి చేయవచ్చు. తద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. ఇందుకు కావాల్సిన నైపుణ్య శిక్షణ కోసం సమీపంలోని నాబార్డ్ అధికారులను సంప్రదించవచ్చు.
విజయవాడలో రాష్ట్ర కార్యాలయం ఉంది. రానున్న ఐదేళ్లలో కనీసం 4 వేల ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలన్నది నాబార్డ్ లక్ష్యం. నాబార్డ్ సంరక్షణ్ పథకం కింద సుమారు రూ.వెయ్యి కోట్లను ఎఫ్‌పీవోలకు రుణంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. రైతులు వినియోగదారులను ఆకట్టుకునేలా తమ ఉత్పత్తులను తీర్చిదిద్దుకోవాలన్నదే నా సలహా. వ్యవసాయ బిల్లులపై జరుగుతున్న ఆందోళనపై త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ ఉంది. ఆ బిల్లులను రద్దుచేసే అవకాశం ఉండకపోవచ్చనేది నా వ్యక్తిగత అభిప్రాయం.
Comments
Please login to add a commentAdd a comment