సాక్షి, అమరావతి: విత్తనాల నుంచి విక్రయాల దాకా అడుగడుగునా అన్నదాతలకు తోడుగా నిలుస్తూ చేయి పట్టి నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కృషితో వ్యవసాయదారులకు బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలను మంజూరు చేస్తున్నాయి. ముందెన్నడూలేని రీతిలో బ్యాంకర్లు రుణ వితరణతో ప్రభుత్వ సంకల్పానికి తోడుగా నిలుస్తున్నారు. గతంలో రుణాల కోసం రైతన్నలు కాళ్లరిగేలా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల ఊబిలో కూరుకు పోయేవారు. గత మూడేళ్లుగా అడిగిందే తడవుగా అన్నదాతలకు రుణాలు మంజూరవుతున్నాయి. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రస్తుత రబీ సీజన్‌లో రుణాల మంజూరుకు శ్రీకారం చుట్టారు.
వంద శాతం లక్ష్యం దిశగా..
2021–22 సీజన్‌లో 1.08 కోట్ల మంది రైతన్నలకు రూ.1.48 లక్షల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటి వరకు 75.78 లక్షల మందికి రూ.1.23 లక్షల కోట్ల మేర మంజూరయ్యాయి. ఖరీఫ్‌లో లక్ష్యం రూ.86,981 కోట్ల రుణాలు కాగా 50.88 లక్షల మంది రైతులకు రూ.70,531 కోట్ల రుణాలు (81 శాతం) ఇవ్వగలిగారు. స్వల్ప కాలిక రుణాలు 45.88 లక్షల మందికి రూ.56,940 కోట్లు అందాయి. దీర్ఘకాలిక రుణాలు 4.72 లక్షల మందికి రూ.10,966 కోట్లు ఇచ్చారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన కోసం 27,345 మందికి రూ.2625 కోట్లు మంజూరు చేశారు.
ప్రస్తుత రబీ సీజన్‌లో 44.19 లక్షల మందికి రూ.61,518 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటికే 34.90 లక్షల కుటుంబాలకు రూ.52,659 కోట్ల రుణాలు మంజూరు చేశారు. షార్ట్ టర్మ్ రుణాలు 13 లక్షల మందికి రూ.28,281 కోట్లు, లాంగ్ టర్మ్ రుణాలు 8.28 లక్షల మందికి రూ.17,948 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి 66,981 మందికి రూ.6,430 కోట్ల రుణాలు మంజూరు చేశారు. రబీలో మంజూరైన రుణాల్లో ఆప్కాబ్, డీసీసీబీల ద్వారా పంట రుణాలు 6,595.64 కోట్లు, షార్ట్ టర్మ్ రుణాలు రూ.4,893.63 కోట్లు, లాంగ్ టర్మ్ రుణాలు రూ.5,255.92 కోట్లు మంజూరు చేశారు. మరోవైపు కౌలుదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సీజన్‌లోనూ ఆర్థిక చేయూత అందిస్తోంది. వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తోంది.
ఇబ్బంది లేకుండా రుణం..
ప్రస్తుత రబీ సీజన్‌లో నాకున్న ఎకరం పొలంలో జొన్న సాగు చేశా. స్థానిక సహకార బ్యాంకులో రూ.లక్ష పంట రుణం తీసుకున్నా. ఆర్బీకేలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నా. ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణం మంజూరైంది. చాలా సంతోషంగా ఉంది.
– పెండ్యాల సురేష్, గొడవర్రు, కృష్ణా జిలా
నూరు శాతం లక్ష్యాన్ని అధిగమిస్తాం..
2021–22 సీజన్‌లో నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలిచ్చేలా చర్యలు చేపట్టాం. మూడో త్రైమాసికం ముగిసే నాటికే 86 శాతం లక్ష్యాన్ని అధిగమించాం. ఈ నెలాఖరులోగా వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటాం.
– వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment