![Payments under Rs 500 are more in Unified Payments Interface - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/30/UPI-APPS.jpg.webp?itok=JNT9PUSa)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు. మొబైల్ నంబర్, క్యూఆర్ కోడ్‌తో క్షణాల్లో వర్తకులకు చెల్లింపులు, నగదు బదిలీ అవుతుంది. బ్యాంకు ఖాతాలు ఎన్ని ఉన్నా ఒకే యాప్‌లో ఇమిడిపోవడం. ప్రతిసారీ కార్డు నంబర్, ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ వివరాలు పొందుపరిచే అవసరం లేకుండా వర్చువల్ అడ్రస్. సులభంగా, సురక్షిత లావాదేవీలు. పైగా ఎటువంటి యూజర్ చార్జీలు లేకపోవడం.
ఇన్ని అనుకూలతలు ఉన్నాయి కాబట్టే ఇన్‌స్టాంట్ రియల్ టైమ్ పేమెంట్ వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌కు (యూపీఐ) భారత్‌లో ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. యూపీఐ చెల్లింపుల వ్యవస్థ అమలులోకి వచ్చిన ఆరేళ్లలోనే లావాదేవీల విలువ, పరిమాణం ఊహకు అందనంత నమోదవుతోంది. ఆర్‌బీఐ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ స్థాపించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ వ్యవస్థను అభివృద్ధి చేసింది.
అంచనాలను మించి..
భారత్‌లో 2016 ఏప్రిల్‌లో యూపీఐ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం అయింది. అదే ఏడాది జూలైలో యూపీఐ ఆధారిత యాప్స్ ద్వారా రూ.38 లక్షల విలువ చేసే 9 వేల లావాదేవీలు జరిగాయి. కోవిడ్ మహమ్మారి రాకతో దేశంలో 2020 జూన్ నుంచి యూపీఐ లావాదేవీల సంఖ్య అనూహ్యంగా దూసుకెళ్లడం ప్రారంభమైంది. అంతకు ముందు గరిష్టంగా ఒక నెలలో రూ.2.22 లక్షల కోట్లు మాత్రమే లావాదేవీలు నమోదయ్యాయి. ప్రతి నెల 2020 సెప్టెంబర్ నుంచి రూ.3 లక్షల కోట్లు, డిసెంబర్ నుంచి రూ.4 లక్షల కోట్లు, 2021 మార్చి నుంచి రూ.5 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. ఆ తర్వాత ప్రతి రెండు మూడు నెలలకే ఒక లక్ష కోట్లు జతకూడుతూ వస్తోంది.
సీజన్‌లో కొత్త గరిష్టం..
2022 మే నెలలో యూపీఐ ఆధారిత యాప్స్ ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ.10 లక్షల కోట్ల మార్కును దాటింది. రూ.10.6 లక్షల కోట్ల లావాదేవీలతో జూలై నెల గరిష్ట స్థాయిని చేరుకుంది. ట్రాన్జాక్షన్స్ సంఖ్య ఏకంగా 628.8 కోట్లను తాకింది. ఆగస్ట్ 1–16 మధ్య మొత్తం రూ.5.71 లక్షల కోట్ల విలువైన 327 కోట్ల లావాదేవీలు రిజిష్టర్ అయ్యాయి. మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగా ఉండడంతో ఈ పండుగల సీజన్లో రూ.13 లక్షల కోట్ల మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తోంది. 2021 జూలైలో 324.78 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.6,06,281 కోట్లు.
చిన్న మొత్తాలదే హవా..
ఈ ఏడాది జూలై నెలలో యూపీఐ ప్లాట్‌ఫామ్ ఆధారిత యాప్స్ ద్వారా వ్యక్తుల నుంచి వ్యక్తులకు రూ.8.32 లక్షల కోట్లు చేతులు మారాయి. లావాదేవీల సంఖ్య 328.9 కోట్లు. వ్యక్తుల నుంచి వర్తకులకు మధ్య రూ.2.3 లక్షల కోట్ల ట్రాన్జాక్షన్స్ జరిగాయి. లావాదేవీల సంఖ్య 300 కోట్లు. ఆసక్తికర విషయం ఏమంటే రూ.500 లోపు విలువ చేసే లావాదేవీలదే అగ్ర స్థానం. వీటి సంఖ్య ఏకంగా 69 శాతం వాటాతో 434.4 కోట్లు ఉందంటే ఆశ్చర్యం వేయక మానదు. వినియోగదార్లు నగదు నుంచి క్రమంగా డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లుతున్నారనడానికి ఈ గణాంకాలే ఉదాహరణ.
పెరిగిన బ్యాంకులు..
యూపీఐ సేవల్లో 22 థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి. 338 బ్యాంక్స్ పాలుపంచుకుంటున్నాయి. ఇందులో పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లుగా 55 బ్యాంక్స్ ఉన్నాయి. యూపీఐ సేవలు అందిస్తున్న బ్యాంకుల సంఖ్య పెరగడం కూడా ఈ స్థాయి వృద్ధికి కారణం. యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై 2021 జూలైలో 235 బ్యాంక్స్ నమోదయ్యాయి. ఏడాదిలో 100కుపైగా బ్యాంకులు తోడు కావడం విశేషం. జూలైలో ఫోన్‌పే 299.4 కోట్ల లావాదేవీలకుగాను రూ.5.24 లక్షల కోట్లు, గూగుల్ పే 213 కోట్ల లావాదేవీలతో రూ.3.66 లక్షల కోట్లు, పేటీఎం 93.38 కోట్ల లావాదేవీలకుగాను రూ.1.11 లక్షల కోట్ల విలువతో టాప్–3లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment