సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా గ్రిడ్–ఇంటరాక్టివ్ పునరుత్పాదక విద్యుత్ మొత్తం స్థాపిత సామర్థ్యంలో రాష్ట్రాల జాబితాను ప్రకటిస్తూ గణాంకాల హ్యాండ్‌బుక్ 2021–22ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తాజాగా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో సౌర, పవన, జల వంటి పునరుత్పాదక విద్యుదుత్పత్తికి ప్రభుత్వం ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యతకు గుర్తింపుగా ఆర్‌బీఐ తన తాజా నివేదికలో మొదటి పది రాష్ట్రాల్లో ఏపీకి స్థానం కల్పించింది.
దేశంలో 2040 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం.. ఈ ఏడాది చివరి నాటికి 175 గిగావాట్లు పూర్తి చేయాలనుకుంటోంది. ఇందుకోసం 2023–2030 మధ్య 24.61 శాతం నుంచి 43.33 శాతం వరకూ రెన్యువబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్(ఆర్‌పీవో)ను పెంచుతోంది. ఈ చర్యలతో పునరుత్పాదక రంగం 2030 నాటికి 1 ట్రిలియన్, 2070 నాటికి 15 ట్రిలియన్ డాలర్ల టర్నోవర్‌కు చేరుకుంటుందని కేంద్రం అంచనా వేస్తోంది.
దీనికి తోడ్పాటునందిస్తున్న మొదటి 12 రాష్ట్రాల్లో ఏపీ(ఆరో స్థానం)తో పాటు కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి. కాగా ఏపీలో పునరుత్పాదక విద్యుత్ స్థాపిత సామర్థ్యం 10,825.28 మెగావాట్లకు చేరింది. ఇందులో 4,096.65 మెగావాట్లు పవన, 4,390.48 మెగావాట్లు సౌర, 1,610 మెగావాట్లు భారీ జల విద్యుత్, 566.04 మెగావాట్లు బయో పవర్, 162.11 మెగావాట్లు చిన్న జల విద్యుత్, 900.72 మెగావాట్లు ఇతర పునరుత్పాదక ప్రాజెక్టులున్నాయి.
ఇప్పటికే ప్రాధాన్యం
2029–30 నాటికి, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వాటా 18 శాతం నుంచి 44 శాతం వరకు పెరుగుతుందని, థర్మల్ పవర్ 78 శాతం నుంచి 52 శాతం వరకు తగ్గుతుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇటీవల(సీఈఏ) అంచనా వేసింది. కేంద్రం నిర్దేశం మేరకు 2022–23 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) కొనుగోలు చేసే విద్యుత్‌లో పునరుత్పాదక విద్యుత్ వాటా 18 శాతం ఉండాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) నిర్ణయించింది.
గతేడాది ఇది 17 శాతంగా ఉండేది. 2026–27 నాటికి మొత్తం విద్యుత్‌లో 24 శాతం పునరుత్పాదక విద్యుత్ ఉండాలని ఏపీఈఆర్‌సీ ఇటీవల ప్రకటించిన ఆర్‌పీవో నిబంధనల్లో వెల్లడించింది. కానీ రాష్ట్రంలోని మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యంలో పునరుత్పాదక విద్యుత్ వాటా సుమారు 37 శాతంతో ఏపీ ఇప్పటికే ముందంజలో ఉంది.
‘ఆర్‌బీఐ‘ టాప్ టెన్ రాష్ట్రాల్లో ఏపీ
Published Tue, Nov 22 2022 6:20 AM | Last Updated on Tue, Nov 22 2022 7:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment