‘గ్రీన్ కో’ సోలార్ సామర్థ్యం 1,300 మెగావాట్లకు పెంపు
‘ఆస్తా’ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు అదనంగా 186 ఎకరాలు
‘ఎకోరన్’ పవన విద్యుత్ సామర్థ్యం మరో 277 మెగావాట్ల పెంపు
ఉత్తర్వులు జారీ చేసిన ఇంధన శాఖ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నెలకొల్పుతున్న మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ప్రభుత్వం అదనపు వెసులుబాటు కల్పించింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ‘గ్రీన్ కో’ సంస్థ ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ నిర్మిస్తోంది. అందులో భాగంగా 800 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది. దాని సామర్థ్యాన్ని 1,300 మెగావాట్లకు పెంచుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆ సంస్థ కోరింది. గ్రీన్ కో అదనంగా అడిగిన 500 మెగావాట్లకు అనుమతిస్తూ ఇంధన శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పేర్కొన్నారు. దీంతో గ్రీన్ కో ప్రాజెక్టు సామర్థ్యం 4,230 మెగావాట్ల నుంచి 4,730 మెగావాట్లకు పెరిగింది. దీనిలో 2,800 వేల మెగావాట్ల సౌర విద్యుత్, 250 మెగావాట్ల పవన విద్యుత్, 1,680 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఉన్నాయి. అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో ‘ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ నిర్మించనున్న 1,800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు అదనంగా 186 ఎకరాలు కేటాయిస్తూ విజయానంద్ మరో ఉత్తర్వులు జారీచేశారు.
ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే 490 ఎకరాలు కేటాయించారు. అదనంగా ఇచ్చే భూమిని కొనుగోలు చేస్తే ఎకరాకు రూ.5 లక్షలు, లీజుకు తీసుకుంటే ఎకరాకు ఏడాదికి రూ.31వేలు చొప్పున చెల్లించాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఎకోరన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పవన విద్యుత్ ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 1,000 మెగావాట్ల నుంచి మరో 277 మెగావాట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ మరో ఉత్తర్వులను విజయానంద్ జారీ చేశారు.
మొత్తం సామర్థ్యం 1,277 మెగావాట్లలో 1,168.70 మెగావాట్ల ప్రాజెక్టులను ఇప్పటికే కేటాయించిన ప్రాంతాల్లో స్థాపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ఈ మూడు నిర్ణయాలను స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్‌ఐపీబీ) ఈ నెల 19న తీసుకుందని విజయానంద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment