ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన రంగంలో మెండుగా ఉద్యోగ అవకాశాలు
2050 నాటికి 43 మిలియన్‌ల మంది అవసరమని అంచనా
మన దేశంలో రానున్న పాతికేళ్లలో 8.5 మిలియన్‌ల మందికి కొలువులు
పునరుత్పాదక ఇంధన సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన రంగం పురోగమిస్తోంది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 2050 నాటికి ఈ రంగంలో పని చేసేందుకు 43 మిలియన్‌ల మంది కావాల్సి ఉంటుందని తాజాగా ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ఐఆర్‌ఈడీఏ), అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) విడుదల చేసిన సంయుక్త నివేదికలో వెల్లడించాయి.
ఇంజనీర్లు, నైపుణ్యం గల కార్మికులు, మధ్యస్థ నైపుణ్యం గల కార్మికులు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ఇతర కార్మికుల సేవలు ఎక్కువగా అవసరం ఉంటుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన రంగంలో 16.2 మిలియన్‌ల మంది పని చేస్తున్నారని, వారిలో మన దేశంలోనే 1.2 మిలియన్‌ల మంది ఉన్నారని తెలిపాయి.
విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉపాధి అవకాశాలు
⇒ దేశంలో 2032 నాటికి విద్యుత్ వినియోగం మరో 70 శాతం పెరుగుతుందని అంచనా.
⇒ 2070 నాటికి కర్బన ఉద్గారాలు నెట్ జీరో స్థాయిని చేరుకోవడంలో భాగంగా 2030 నాటికి దేశ వ్యాప్తంగా 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ స్థాపిత ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ప్రోత్సహించాలని సూచించింది.
⇒ అందువల్ల మన దేశంలో కొత్తగా ఏర్పడే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో 2050 నాటికి 8.5 మిలియన్‌ల మందికి కొలువులు లభిస్తాయని ఐఆర్‌ఈడీఏ వివరించింది.
⇒ ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి వనరులను సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే అది శిలాజ ఇంధనాల నుంచి కాకుండా స్వచ్చ ఇంధనం(గ్రీన్ ఎనర్జీ) ద్వారానే జరగాలని అంతర్జాతీయంగా అన్ని దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు...
⇒ ప్రపంచ పునరుత్పాదక రంగానికి సంబంధించి 2022లో 4.9 మిలియన్‌ల మందికి ఉద్యోగాలు లభించాయి. దీంతో 2022లో మొత్తం ఉద్యోగాలు 13.7 మిలియన్‌లకు చేరాయి. అదే 2023లో ఆ సంఖ్య 16.2 మిలియన్‌లకు పెరిగింది.
⇒ మన దేశానికి సంబంధించి 2022లో 2,82,200 మందికి ఈ రంగంలో ఉద్యోగాలు వచ్చాయి.
⇒ 2023లో ఈ సంఖ్య భారీగా పెరిగింది. జలవిద్యుత్ రంగంలో అత్యధికంగా దాదాపు 4,53,000 మందికి ఉద్యోగాలు లభించాయని అంచనా. సౌర విద్యుత్ ఫొటో వాల్టాయిస్ రంగంలో 3,18,600 మందికి ఉపాధి లభించింది. పవన విద్యుత్ రంగంలో సుమారు 52,200 మందికి, ద్రవ జీవ ఇంధన రంగంలో 35వేల మందికి, బయోమాస్‌లో 58 వేల మందికి, సోలార్ హీటింగ్, కూలింగ్ సెక్టార్‌లో 17 వేల మందికి, బయోగ్యాస్ రంగంలో 85 వేల మందికి కొలువులు లభించాయి.
⇒ భారతదేశంలో 2023లో దాదాపు 10,18,800 లక్షల ఉద్యోగాలు లభించినట్లు తమ అధ్యయనంలో తేలినట్లు ఆర్‌ఈఎన్‌ఏ, ఐఎల్‌వో వెల్లడించాయి.
⇒ ఒక్క చైనా మినహా మిగతా ప్రపంచ దేశాలన్నిటి కంటే మన దేశమే ఈ రంగంలో పురోగమనంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment