సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల వేతనాలు, జీతాల వ్యయం గత నాలుగేళ్లలో భారీగా పెరిగింది. ఎంతగా అంటే.. 67.26 శాతం మేర పెరిగింది. ఇదే సమయంలో మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో గడచిన నాలుగేళ్లలో ఈ వ్యయం కేవలం 39.34 శాతం మాత్రమే పెరిగింది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్‌లపై చేసిన అధ్యయన నివేదిక వెల్లడించింది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో అధికంగా రూ.25,086.3 కోట్ల మేర వేతనాలు, జీతాల రూపంలో వ్యయం అవుతోందని నివేదిక పేర్కొంది.
అంటే.. తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌లో జీతభత్యాల రూపంలో అధికంగా 84.5 శాతం వ్యయం అవుతోంది. అలాగే, రాష్ట్రంలో ఈ వ్యయం ఒక్క ఆర్థిక ఏడాదిలోనే ఏకంగా రూ.10 వేల కోట్లు పెరిగింది. చంద్రబాబు హయాం 2018–19లో వేతనాలు, జీతాల వ్యయం రూ.32,743.4 కోట్లు ఉండగా వైఎస్ జగన్ హయాంలో 2019–20లో రూ.42,673.8 కోట్లకు పెరిగింది.
ఈ గణాంకాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బడ్జెట్ అకౌంట్లను అధ్యయనం చేసిన తరువాత ఆర్‌బీఐ పేర్కొంది. అలాగే, 2018–19లో వేతనాలు, జీతాల రూపంలో అకౌంట్స్ ప్రకారం రూ.32,743 కోట్లు వ్యయం కాగా.. 2022–23లో బడ్జెట్ అంచనాల ప్రకారం రూ, 54,768.4 కోట్లకు చేరుతుందని నివేదిక పేర్కొంది. అంటే నాలుగేళ్లలో రూ.22,025 కోట్ల మేర జీతభత్యాల వ్యయం పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
కొత్త ఉద్యోగాలు, చిరుద్యోగుల వేతనాలు పెంపుతోనే..
ఇక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హమీ మేరకు ఉద్యోగులు, పెన్షనర్లకు 27 శాతం మధ్యంతర భృతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. అలాగే, వివిధ రంగాల్లోని 3.01 లక్షల మంది చిరుద్యోగుల వేతనాలనూ భారీగా పెంచారు. దీంతోపాటు 11వ వేతన సవరణ కమిషన్ సిఫార్సుల అమలు, వైద్య ఆరోగ్యశాఖతో పాటు వివిధ శాఖల్లో వేల సంఖ్యలో కొత్తగా ఉద్యోగాలు భర్తీ.. అలాగే, గ్రామ, వార్డు సచివాలయాల్లో పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించడంతో రాష్ట్రంలో జీతభత్యాల వ్యయం భారీగా పెరిగినట్లు ఆర్‌బీఐ తన నివేదికలో స్పష్టంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment