న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ప్రయోజనాల పరిధిని మరింత పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరో కీలక నిర్ణయాన్ని అమల్లోకి తెస్తోంది. బ్యాంకులు కస్టమర్లకు మంజూరుచేసే ‘ప్రీ–శాంక్షన్డ్ క్రెడిట్ లైన్స్’నూ యూపీఐ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం, సేవింగ్స్ ఖాతాలు, ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాలు, ప్రీపెయిడ్ వాలెట్లు, క్రెడిట్ కార్డ్‌లను యూపీఐకి లింక్ చేయవచ్చు. ఇకపై ‘ప్రీ–శాంక్షన్డ్ క్రెడిట్ లైన్స్’నూ యూపీఐకి అనుసంధానం చేయడానికి వీలవుతుంది. ప్రీ–శాంక్షన్డ్ క్రెడిట్ లైన్ అంటే– బ్యాంకులు రుణ గ్రహీతకు ముందస్తుగా మంజూరుచేసే రుణ సదుపాయం.
రుణగ్రహీత ఏ సమయంలోనైనా వినియోగించుకోగలిగే ముందస్తు ఆమోదిత (పరిమితి) రుణం. ఇది క్రెడిట్ చెల్లింపు లాంటిది. దీని కింద (క్రెడిట్ లైన్) తుది వినియోగదారు రుణాన్ని వడ్డీతో తర్వాత తేదీలో తిరిగి చెల్లించవచ్చు. ఈ సదుపాయాన్ని పొందేందుకు యూపీఐ వినియోగదారులు బ్యాంకులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ ద్వారా తక్షణ నగదు బదిలీ కోసం ఉపయోగించే యూపీఐ లావాదేవీలు ఆగస్టులో 10 బిలియన్ మార్కును దాటాయి. జూలైలో యూపీఐ లావాదేవీల సంఖ్య 9.96 బిలియన్లు (996.4 కోట్లు). జూన్‌లో 9.33 బిలియన్లు.
Comments
Please login to add a commentAdd a comment