న్యూఢిల్లీ: కూరగాయలు, నూనెలు తదితర ఆహారోత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్టానికి తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణ పరిమితి లక్ష్యానికి కాస్త చేరువగా 4.7 శాతానికి పరిమితమైంది. చివరిసారిగా 2021 అక్టోబర్‌లో ఇది 4.48 శాతం స్థాయిలో నమోదైంది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఇలా తగ్గడం ఇది వరుసగా రెండో నెల.
గతేడాది ఏప్రిల్‌లో ఇది 7.79 శాతంగా ఉండగా ఈ ఏడాది మార్చ్‌లో 5.66 శాతానికి పరిమితమైంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి (రెండు శాతం అటూ ఇటుగా) కట్టడి చేయాలని రిజర్వ్ బ్యాంక్‌ను కేంద్ర ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. తాజాగా జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసిన డేటా ప్రకారం ఏప్రిల్‌లో ఆహారోత్పత్తుల బాస్కెట్ ద్రవ్యోల్బణం 3.84 శాతంగా ఉంది. ఇది ఈ ఏడాది మార్చ్‌లో 4.79 శాతంగా, గత ఏప్రిల్‌లో 8.31 శాతంగా ఉంది.
నూనెల ధరలు 12.33 శాతం, కూరగాయల రేట్లు (6.5 శాతం), మాంసం..చేపలు (1.23 శాతం) తగ్గాయి. అటు సుగంధ ద్రవ్యాలు, పాలు.. పాల ఉత్పత్తులు మొదలైన వాటి రేట్లు పెరిగాయి. రిటైల్ ద్రవ్యోల్బణం గ్రామీణ ప్రాంతాల్లో 4.68 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 4.85 శాతంగా ఉంది. ఎంపిక చేసిన 1,114 పట్టణ మార్కెట్లు, 1,181 గ్రామాల నుంచి క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాల ఆధారంగా ఎన్‌ఎస్‌వో ఈ డేటా రూపొందించింది. మే–జూన్ మధ్యకాలంలో సీపీఐ ద్రవ్యోల్బణం 4.7–5 శాతం శ్రేణిలో తిరుగాడవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. తాజా గణాంకాలను బట్టి చూస్తే ఆర్‌బీఐ తదుపరి పాలసీ సమీక్షలో వడ్డీ రేట్ల పెంపును నిలిపే అవకాశాలు ఎక్కువే కనిపిస్తున్నాయని, అయితే రేట్ల తగ్గింపునకు మాత్రం చాలా కాలం పట్టేయవచ్చని పేర్కొంది.
సరైన దిశలోనే పరపతి విధానం: ఆర్‌బీఐ గవర్నర్
ఏప్రిల్‌లోనూ రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం ‘చాలా సంతృప్తినిచ్చే’ అంశమని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఇది .. ద్రవ్యపరపతి విధానం సరైన దిశలోనే సాగుతోందనే నమ్మకం కలిగిస్తోందని పేర్కొన్నారు. అయితే, దీని ఆధారంగా పరపతి విధానంలో ఏవైనా మార్పులు ఉండవచ్చా అనే ప్రశ్నకు.. తదుపరి పాలసీ సమీక్ష రోజైన జూన్ 8న దీనిపై స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment