న్యూఢిల్లీ: భారత స్థూల ఆర్థిక గణాంకాల విషయంలో రెండు కీలక విభాగాలకు సంబంధించి మంగళవారం వెలువడిన గణాంకాలు మిశ్రమ ఫలితాలను అందించాయి. అక్టోబర్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 11.7 శాతం వృద్ధిని (2022 అక్టోబర్ గణాంకాలతో పోల్చి) నమోదుచేసుకుంది. గడచిన 16 నెలల్లో ఇంత అధిక స్థాయిలో (2022 జూన్‌లో 12.6 శాతం తర్వాత) పారిశ్రామిక ఉత్పత్తి సూచీ నమోదుకావడం ఇదే తొలిసారి.
కాగా, గత ఏడాది ఇదే నెల్లో (2022 అక్టోబర్) ఐఐపీలో అసలు వృద్ధి లేకపోగా 4.1 శాతం క్షీణించడంతో తాజా సమీక్షానెల భారీ వృద్ధి గణాంకాలు కనబడ్డానికి ‘బేస్ ఎఫెక్ట్’ కారణమన్న విశ్లేషణలూ ఉన్నాయి. ఇక రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (పీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 5.55 శాతంగా నమోదయ్యింది. గడచిన మూడు నెలల్లో మొదటిసారి ఇంత అధిక స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయ్యింది.
నిజానికి ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతంగా ఉండాలి. దీని ప్రాతిపదికన ఎగువ దిశలో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం వరకూ ఉండవచ్చు. అయితే ద్రవ్యోల్బణం పట్ల చాలా అప్రమత్తత అవసరమని, 4 శాతం కట్టడే తమ లక్ష్యమని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన ఐఐపీ కీలక విభాగాల గణాంకాల్లో పరిశీలిస్తే..
‘బేస్ ఎఫెక్ట్’తో జూమ్!
∙భారత్ మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) దాదాపు 28.3% వాటా కలిగిన పారిశ్రామిక రంగం ఉత్పత్తి 11.7% పెరిగితే, అందులో దాదాపు 70% వాటా కలిగిన తయారీ రంగం పురోగతి సమీక్షా నెల్లో 10.4%. గత ఏడాది ఇదే నెల్లో ఈ విభాగంలో అసలు వృద్ధి లేకపోగా 5.8 శాతం క్షీణత నమోదయ్యింది.ఏప్రిల్–అక్టోబర్ మధ్య 6.9 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్–అక్టోబర్ మధ్య ఐఐపీ వృద్ధి రేటు 6.9%గా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో వృద్ధి రేటు 5.3%.
ఆహార ధరల తీవ్రత
దిగువబాటలో కొనసాగుతున్న రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) నవంబర్‌లో ‘యూ–టర్న్’ (సెపె్టంబర్‌లో 5.02 శాతం, అక్టోబర్‌లో 4.87 శాతం) తీసుకుని, 5.55 శాతంగా నమోదయ్యింది. ఆహార ధరల పెరుగుదల దీనికి కారణం. ఉత్పత్తుల బాస్కెట్‌లో ఒక్క ఫుడ్ బాస్కెట్‌ను చూస్తే, 2022 నవంబర్‌లో ద్రవ్యోల్బణం 4.67 శాతం, 2023 అక్టోబర్‌లో 6.61 శాతం ఉంటే, తాజా సమీక్షా నెల నవంబర్‌లో ఇది 8.7 శాతానికి ఎగసింది.
మొత్తం సీపీఐలో ఫుడ్ బాస్కెట్ వెయిటేజ్ 50 శాతం. ఇందులో రెండంకెల్లో ధరలు పెరిగిన జాబితాలో సుగంధ ద్రవ్యాలు (21.55 శాతం) పప్పు దినుసులు (20.23 శాతం) కూరగాయలు (17.70 శాతం), పండ్లు (10.95 శాతం), తృణ ధాన్యాలు (10.25 శాతం) ఉన్నాయి. ధరలు పెరిగిన మిగిలిన ఉత్పత్తుల్లో చక్కెర, తీపి ఉత్పత్తులు (6.55 శాతం) గుడ్లు (5.90 శాతం), పాలు, పాల ఉత్పత్తులు (5.75 శాతం), ప్రెపేర్డ్ మీల్స్ (4.22 శాతం), నాన్ ఆల్కాహాలిక్ బేవరేజెస్ (3.58 శాతం) ఉన్నాయి. ఆయిల్, ఫ్యాట్స్ ధరలు మాత్రం 15.03 శాతం తగ్గాయి. ఇక ఫుడ్ అండ్ బేవరేజెస్ ధరల పెరుగుదల 8.02 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment