రిటైల్ ద్రవ్యోల్బణం మేలో4.75 %
ఆహార ధరల తీవ్రత ఏకంగా 8.69%
ఏప్రిల్ పారిశ్రామిక ఉత్పత్తి పురోగతి 5%
మూడు నెలల కనిష్టం
న్యూఢిల్లీ: భారత తాజా కీలక ఆర్థిక గణాంకాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య, పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం మేలో 4.75 శాతంగా నమోదయ్యింది. ఇది ఏడాది కనిష్టం అయినప్పటికీ, ఆర్‌బీఐ లక్ష్యం కన్నా 75 బేసిస్ పాయింట్లు అధికం. 2024 ఏప్రిల్‌లో ఈ రేటు 4.83 శాతంకాగా, 2023 మేనెల్లో ఈ రేటు 4.31 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతంగా ఉండాలి. దీని ప్రకారం 6 శాతం వరకూ రిటైల్ ద్రవ్యోల్బణం ఉండవచ్చు.
అయితే తమ లక్ష్యం ఎప్పుడూ 4 శాతం వద్ద రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడి అని ఆర్‌బీఐ స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ గణాంకాల కార్యా లయం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. రిటైల్ ద్ర వ్యోల్బణంలో కీలక విభాగం– ఆహార ద్రవ్యోల్బణం మాత్రం మేలో తీవ్ర స్థాయిలో 8.69 శాతంగా నమోదైంది. ఏప్రిల్‌లో సైతం ఈ రేటు 8.70 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం తీవ్రత అటు సామాన్యులకు, ఇటు వృద్ధి పురోగతికి అడ్డంకి కలిగించే అంశం. సమీక్షా నెల్లో పట్టణ ప్రాంతాల్లో 4.15% ద్రవ్యోల్బణం ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఇది సగటు 4.75 శాతంకన్నా అధికంగా 5.28 శాతంగా నమోదయ్యింది.
పరిశ్రమ పేలవం
మరోవైపు పరిశ్రమల పురోగతికి సంబంధించి పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) పెరుగుదల ఏప్రిల్‌లో 5 శాతంగా నమోదయ్యింది. గత 3 నెలల్లో ఇంత తక్కువ స్థాయి ఇదే తొలిసారి. సూచీలో దాదాపు 70% వాటా కలిగిన తయారీ రంగం సమీక్షా నెల్లో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. ఎకానమీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 18.4%. పారిశ్రామిక రంగం వాటా 28.3 %. సేవల రంగం వాటా 53.3%. పారిశ్రామిక రంగంలో ఒక్క తయారీ రంగం వాటా దాదాపు 70%.
ఇంధన డిమాండ్‌కు భారత్ దన్ను
న్యూఢిల్లీ: ఈ దశాబ్దం ద్వితీయార్థంలో అంతర్జాతీయంగా ముడిచమురు డిమాండ్‌కు భారత్ చోదకంగా ఉండగలదని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ)నివేదిక తెలిపింది. 2023–2030 మధ్య కాలంలో భారత్‌లో చమురు వినియోగం చైనాను మినహాయించి మిగతా అన్ని దేశాలకన్నా అధికంగా ఉంటుందని పేర్కొంది. ఇది ఏకంగా రోజుకు 13 లక్షల బ్యారెళ్ల (బీపీడీ) మేర పెరిగే అవకాశం ఉందని ఆయిల్ 2024 రిపోర్టులో పేర్కొంది. 2023లో రోజుకు 54 లక్షల బ్యారెళ్లుగా (బీపీడీ) ఉన్న చమురు డిమాండ్ 2030 నాటికి 3.2 శాతం పెరిగి (రోజుకు 13 లక్షల బ్యారెళ్లు) 67 లక్షల బీపీడీకి చేరగలదని అంచనా వేస్తున్నట్లు ఐఈఏ వివరించింది. 2025–2030 మధ్య కాలంలో భారత్‌లో చమురుకు డిమాండ్ 9,00,000 బీపీడీ మేర పెరగనుండగా, చైనాలో ఇది 5,70,000 బీపీడీగా ఉండనుంది. అంతర్జాతీయంగా చూస్తే 2029 నాటికి ఆయిల్ డిమాండ్ తారస్థాయికి చేరుకోగలదని ఐఈఏ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment