న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మే నెల్లో పెరుగుదల లేకపోగా 3.48 శాతం (క్షీణత) తగ్గింది. గడచిన ఏడు సంవత్సరాల్లో (2015 నవంబర్‌లో మైనస్ 3.7 శాతం) ఈ స్థాయిలో టోకు ధరలు నమోదుకావడం ఇదే తొలిసారి. హైబేస్ ఎఫెక్ట్‌తోపాటు (గత ఏడాది మే నెల్లో భారీ టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం) సూచీలో మూడు ప్రధాన విభాగాలైన– ఆహార, తయారీ, ఇంధన ధరలు పూర్తిగా అదుపులోనికి వచ్చాయి.
2022లో మే నెలలో 16.63 శాతం టోకు ద్రవ్యోల్బణం (హై బేస్) నమోదుకావడం ఇక్కడ గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మేనెల్లో 25 నెలల కనిష్టం 4.25 శాతంగా నమోదయిన సానుకూల ఫలితం నేపథ్యంలోనే టోకు ధరలకు సంబంధించి కూడా ఎకానమీకి ఊరటనిచ్చే తాజా ఫలితం వెలువడింది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలిస్తే...
► ఏప్రిల్‌లో ఫుడ్ ఆర్టికల్స్ ధరల 3.54 శాతం తగ్గితే (వార్షికంగా పోల్చి) తాజా సమీక్షా నెల్లో తగ్గుదల 1.51 శాతంగా ఉంది. కూరగాయల ధరలు 20.12 శాతం తగ్గాయి. ఆలూ ధరలు 18.71%, ఉల్లిధరలు 7.25% తగ్గాయి. అయితే పప్పు దినుసుల ధరలు మాత్రం 5.76 % ఎగశాయి. గోధుమలకు సంబంధించి ద్రవ్యోల్బణం కూడా 6.15%గా ఉంది.
► ఇంధనం, విద్యుత్ బాస్కెట్ ద్రవ్యోల్బణం మేలో 9.17 శాతం (మైనస్) తగ్గింది. ఏప్రిల్ నెలలో 0.93 శాతంగా ఉంది.
► తయారీ ఉత్పత్తుల ధరలు ఏప్రిల్‌లో మైనస్ 2.42 శాతంగా ఉంటే, మేలో మైనస్ 2.97 శాతంగా నమోదయ్యింది.
ప్రతి ద్రవ్యోల్బణం... వరుసగా రెండో నెల
ద్రవ్యోల్బణం మైనస్ లోకి వెళ్లడాన్ని... సాంకేతికంగా ప్రతి ద్రవ్యోల్బణం అని పిలుస్తారు. ఈ ప్రాతిపదికన ప్రతి ద్రవ్యోల్బణం నమోదుకావడం వరుసగా ఇది రెండవనెల. ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం మైనస్ 1.51%గా నమోదయ్యింది. రానున్న నెలల్లో కూడా ఇదే ధోరణి కొనసాగితే, బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో 2023లో యథాతథంగా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. 2022 మే తర్వాత 2.50% పెరుగుదలతో 6.5 శాతానికి చేరిన రెపో రేటును గత రెండు ద్వైమాసిక సమీక్షల సందర్భంగా ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం అదుపులోనికి రావడమే దీనికి కారణం.
Comments
Please login to add a commentAdd a comment