
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గి, 0.2 శాతంగా నమోదయ్యింది. డిసెంబర్‌లో ఈ రేటు 0.27 శాతంగా ఉంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ టోకు ధరల సూచీ మైనస్ (ప్రతి ద్రవ్యోల్బణం)లో ఉంది. నవంబర్‌లో ప్లస్‌లోకి మారి 0.26 శాతంగా నమోదయ్యింది. అయితే ఆహార ధరలు మాత్రం ఫిబ్రవరిలో స్వల్పంగా పెరిగాయి.
జనవరిలో 6.85 శాతంగా ఉన్న ఆహార టోకు ధరల స్పీడ్, ఫిబ్రవరిలో 6.95 శాతానికి ఎగసింది. ఇదే సమయంలో కూరగాయల ధరలు 19.71 శాతం (జనవరి) నుంచి 19.78 శాతానికి ఎగశాయి. పప్పు దినుసుల ధరలు 16.06 శాతం నుంచి 18.48 శాతానికి చేరాయి. ఫ్యూయల్ అండ్ లైట్ విభాగానికి వస్తే, రేటు 0.51 శాతం నుంచి 1.59 శాతానికి ఎగసింది. సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ ఉత్పత్తుల ధరలు జనవరిలో 1.13 శాతం తగ్గితే, ఈ తగ్గుదల ఫిబ్రవరిలో 1.27 శాతంగా ఉంది.