Prices of vegetables
-
రిటైల్ ధరలు దిగొచ్చాయ్!
న్యూఢిల్లీ: కూరగాయలు, నూనెలు తదితర ఆహారోత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్టానికి తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణ పరిమితి లక్ష్యానికి కాస్త చేరువగా 4.7 శాతానికి పరిమితమైంది. చివరిసారిగా 2021 అక్టోబర్‌లో ఇది 4.48 శాతం స్థాయిలో నమోదైంది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఇలా తగ్గడం ఇది వరుసగా రెండో నెల. గతేడాది ఏప్రిల్‌లో ఇది 7.79 శాతంగా ఉండగా ఈ ఏడాది మార్చ్‌లో 5.66 శాతానికి పరిమితమైంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి (రెండు శాతం అటూ ఇటుగా) కట్టడి చేయాలని రిజర్వ్ బ్యాంక్‌ను కేంద్ర ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. తాజాగా జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన డేటా ప్రకారం ఏప్రిల్‌లో ఆహారోత్పత్తుల బాస్కెట్ ద్రవ్యోల్బణం 3.84 శాతంగా ఉంది. ఇది ఈ ఏడాది మార్చ్‌లో 4.79 శాతంగా, గత ఏప్రిల్‌లో 8.31 శాతంగా ఉంది. నూనెల ధరలు 12.33 శాతం, కూరగాయల రేట్లు (6.5 శాతం), మాంసం..చేపలు (1.23 శాతం) తగ్గాయి. అటు సుగంధ ద్రవ్యాలు, పాలు.. పాల ఉత్పత్తులు మొదలైన వాటి రేట్లు పెరిగాయి. రిటైల్ ద్రవ్యోల్బణం గ్రామీణ ప్రాంతాల్లో 4.68 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 4.85 శాతంగా ఉంది. ఎంపిక చేసిన 1,114 పట్టణ మార్కెట్లు, 1,181 గ్రామాల నుంచి క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాల ఆధారంగా ఎన్ఎస్వో ఈ డేటా రూపొందించింది. మే–జూన్ మధ్యకాలంలో సీపీఐ ద్రవ్యోల్బణం 4.7–5 శాతం శ్రేణిలో తిరుగాడవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. తాజా గణాంకాలను బట్టి చూస్తే ఆర్బీఐ తదుపరి పాలసీ సమీక్షలో వడ్డీ రేట్ల పెంపును నిలిపే అవకాశాలు ఎక్కువే కనిపిస్తున్నాయని, అయితే రేట్ల తగ్గింపునకు మాత్రం చాలా కాలం పట్టేయవచ్చని పేర్కొంది. సరైన దిశలోనే పరపతి విధానం: ఆర్బీఐ గవర్నర్ ఏప్రిల్‌లోనూ రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం ‘చాలా సంతృప్తినిచ్చే’ అంశమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఇది .. ద్రవ్యపరపతి విధానం సరైన దిశలోనే సాగుతోందనే నమ్మకం కలిగిస్తోందని పేర్కొన్నారు. అయితే, దీని ఆధారంగా పరపతి విధానంలో ఏవైనా మార్పులు ఉండవచ్చా అనే ప్రశ్నకు.. తదుపరి పాలసీ సమీక్ష రోజైన జూన్ 8న దీనిపై స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు. -
లాక్డౌన్ ఎఫెక్ట్: చుక్కల్లో ‘కూరలు’
సాక్షి, హైదరాబాద్: కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. లాక్‌డౌన్‌తో మార్కెట్‌కు సరిపడా రాకపోవడంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. దీనికితోడు లాక్డౌన్ సడలింపు సమయం నాలుగు గంటలే ఉండటంతో రైతులు కూడా ఇంటికి వెళ్లాలనే తొందరలోనే తక్కువ ధరకే మార్కెట్లో వ్యాపారులకు విక్రయించేసి వెళ్లిపోతున్నారు. అయితే, రైతుల నుంచి చౌకగా కొనుగోలు చేసిన కూరగాయలను రిటైల్ మార్కెట్లో మూడింతలు పెంచి విక్రయిస్తున్నారు. మరోవైపు.. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతయ్యే బంగాళదుంప, క్యాబేజీ, కీర, బీట్రూట్ల ధరలు గణనీయంగా పెరిగాయి. స్థానికంగానే అమ్ముకుంటున్న రైతులు కూరగాయల రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేనప్పటికీ, గ్రామీణా ప్రాంతాల నుంచి మార్కెట్‌కు తరలించేందుకు రవాణా చార్జీలు రైతులకు భారంగా మారాయి. హైదరాబాద్‌లోని బోయిన్పల్లి, గుడిమల్కాపూర్, ఎన్టీఆర్ నగర్, మాదన్నపేట, మీరాలం, మోండా మార్కెట్లకు నగర శివార్లలోని రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి, నల్లగొండ, సిద్దిపేట జిల్లాల నుంచి కూరగాయలు వస్తాయి. ఇప్పుడు రవాణా సౌకర్యం సరిగా లేకపోవడం.. వచ్చినా వెనువెంటనే వెనక్కి వెళ్లే పరిస్థితి కానరాకపోవడంతో చాలా మంది రైతులు తమ ఉత్పత్తులను స్థానికంగానే విక్రయించుకుంటున్నారు. దీని ప్రభావం హైదరాబాద్ మార్కెట్లపై పడింది. ఈ నేపథ్యంలోనే కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయని అంటున్నారు. తగ్గిన సరఫరా ప్రతి రోజు జంటనగరాలకు 3వేల క్వింటాళ్ల కూరగాయలు దిగుమతి అయ్యేవి. ప్రస్తుతం ఇందులో సగం కూడా మార్కెట్లకు రావడంలేదు. మార్కెటింగ్ శాఖ గణాంకాల ప్రకారం బోయిన్పల్లి హోల్‌సేల్ మార్కెట్‌కు సాధారణ రోజుల్లో సగటున 1,500 క్వింటాళ్ల కూరగాయలు వచ్చేవి. శనివారం కేవలం వేయి క్వింటాళ్లు మ్రాతమే సరఫరా అయింది. ఇదే సీను మిగతా మార్కెట్లల్లోనూ కనిపిస్తోంది. -
కూరగాయలు, పప్పుదినుసుల ధరలకు రెక్కలు
- హోల్‌సేల్ రేట్లకు, రిటైల్ రేట్లకు సగానికి సగం వ్యత్యాసం - బెంబేలెత్తుతున్న వినియోగదారులు - రేషన్ షాపుల్లో ఉచిత బియ్యం తప్ప మిగిలిన ధరలన్నీ భారీగా పెరుగుదల. సాక్షి, బళ్లారి : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ. కేజీ బియ్యాన్ని బీపీఎల్ కార్డు దారులకు ఉచితంగా పంపిణీకి శ్రీకారం చుట్టినప్పటికి పేదలకు కడుపు నిండా భోజనం తినలేని పరిస్థితి ఏర్పడుతోంది. రేషన్ షాపుల్లో బీపీఎల్‌కార్డు దారులకు ఉచితంగా బియ్యం దొరుకుతుందని సంతోషం తప్ప రేషన్ షాపుల నుంచి బయటకు వచ్చి అన్నంలో పప్పు వండేందుకు, సాంబార్ చేసేందుకు కూరగాయలు, పప్పు దినుసులు తీసుకోవాలంటే పేదలు కొనలేని పరిస్థితిలో ధరలు చుక్కలనంటుతున్నాయి. ఎండ వేడిమి రోజు రోజుకు పెరుగుతూ జనాన్ని ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారో అదే తరహాలో కూరగాయలు, పప్పు దినుసులు ధరలు పైపైకి ఎగబాకుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. పేదలకు రేషన్ షాపుల్లో ఒక్క బియ్యం మాత్రం ఉచితం అందజేసి, కంది పప్పును అందజేయకపోవడంతో పేదలకు ఎలాంటి మేలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఒక్క బియ్యం తీసుకుని ఉత్త అన్నం తినాలా అంటూ పేదలు ప్రశ్నిస్తున్నారు. కూరగాయలు, కంది పప్పులు, అలసందలు, పెసలు తదితర పప్పు దినుసులను మార్కెట్ మాయాజాలంతో వ్యాపారస్తులు విపరీతంగా పెంచుతున్నప్పటికీ సర్కార్ కళ్లు మూసుకుని చూస్తుండటంతో రైతులకు ఎలాంటి లాభం చేకూరక పోగా, వ్యాపారస్తులు కోట్లు గడిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కూరగాయల ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతుండటంతో రూ.500 లకు చిన్న బ్యాగులోకి కూడా కూరగాయలు రావడం లేదని పలువురు నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చి మిర్చి నుంచి టమోటా, క్యారెట్, బీట్రూట్, బెండ, వంకాయ తదితర కూరగాయలన్ని భారీగా పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. మొన్న మొన్నటి వరకు రూ.5లు ఉన్న టమోటా ధర ప్రస్తుతం రూ.40లకు పలుకుతోంది. అయితే ఇక్కడ రైతులు మాత్రం ఇంత భారీ స్థాయిలో నగదు రాకపోవడం గమనార్హం. టమోటాతో క్యారెట్ రూ.40, పచ్చిమిర్చి, బెండ కూడా రూ.40 ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కూరగాయలు దాదాపు రూ.40 నుంచి రూ.50లు పలుకుతుండటంతో పాటు పప్పుదినుసులు మరింత రేటు పెరగడంతో పేదలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కంది పప్పు రూ.130, పెసర, అలసంద, మినపప్పులు కూడా రూ.150లు పైకి ఎగబాకడంతో వాటిని కొనుగోలు చేసి వంట వండుకునేందుకు మహిళలు నానా అవస్థలు పెడుతున్నారు. ఉన్నది సర్దుకుని వంట చేయమని పురుషులు ఆర్డర్ వేస్తున్నారు. ఎలా వండి వడ్డించాలని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బియ్యంతో పాటు సబ్సిడీతోనైనా కందిపప్పు, ఇతర పప్పుదినుసులు సరఫరా చేస్తే పేదలకు ఎంతో మేలు జరుగుతుందని పలువురు మహిళలు రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు. -
పప్పు.. నిప్పు
- అమాంతం పెరిగిన ధరలు - ఓవైపు ఎండలు.. మరోవైపు ధరల భగభగ - కిలో రూ.120కి ఎగబాకిన కంది, పెసర పప్పులు - పెళ్లిళ్ల సీజన్‌తో కొరత సృష్టించిన వ్యాపారులు - కొరవడిన అధికారుల నిఘా - మండిపడుతున్న సామాన్యులు పప్పుల ధరలు నిప్పులు కురిపిస్తున్నాయి. ఎండలతో పోటీపడుతూ రేట్లు మండిపడుతున్నాయి. వారం రోజుల్లోనే ధరల్లో భారీ వ్యత్యాసం రావడంతో కొనేందుకు సామాన్యులు జంకుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి ధరలు భారీగా పెంచినట్టు తెలుస్తోంది. అధికారుల నిఘా కొరవడడంతో వ్యాపారుల దోపిడీ సాగుతోందని పలువురు మండిపడుతున్నారు. మెదక్ టౌన్: వేసవిలో కూరగాయలు ధరలు చుక్కలనంటడం మామూలే. కానీ ఈసారి పప్పుల ధరలూ అనూహ్యంగా పెరిగాయి. మొన్నటి వరకు కంది పప్పు ధర కిలో రూ.100 ఉండగా ఏకంగా కిలోకు రూ.20 పెరిగింది. వేసవిలో కూరగాయలు కొనలేని సామాన్యులు పప్పుచారుతో సరిపెట్టుకునే వారు. కానీ ఇప్పుడు పప్పులూ అందకుండా పోవడంతో జనం విలవిలలాడుతున్నారు. నెల క్రితం కందిపప్పు కిలో రూ.60 నుంచి 70, పెసర పప్పు ధర రూ.90 నుంచి 100 ఉండగా తాజాగా ఈ రెండు రకాల పప్పుల ధరలు రూ.120కి చేరుకున్నాయి. దీనికితోడు కంది మార్కెట్లో లభించడం లేదని వినియోగదారులు అంటున్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పప్పులు కొనేందుకూ అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్లలో కందిపప్పు ధర ఇంత భారీగా పెరగడం ఇదే మొదటి సారి అని వినియోగదారులు అంటున్నారు. శనగ, మినప పప్పుల ధరలూ పెరిగాయి. మినప పప్పు కిలో రూ.80 నుంచి 90 వరకు ఉండగా ప్రస్తుతం రూ.110కి, శనగ పప్పు రూ.60 ఉండగా రూ.70కి ఎగబాకింది. శనగ పిండి కిలో రూ.50 నుంచి 70కి పెరిగింది. ప్రస్తుతం కూరగాయల ధరలు పెరగడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొంతమంది వ్యాపారులు పప్పుల కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలు అమాంతం పెంచేస్తున్నారు. ప్రభుత్వం కృత్రిమ కొరతను నియంత్రించి ధరలను తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు. -
ప్రక్షాళనా...పెత్తనమా?
కూర గాయల ధరలు తగ్గించాలని అధికారులపై ఒత్తిడి గిట్టుబాటు కాక రైతుల గగ్గోలు తెలుగు తమ్ముళ్లే పర్యవేక్షకులు ఇతర పార్టీల సానుభూతి పరులను వెళ్లగొట్టే యత్నం విజయవాడ : రైతుబజార్ల నిర్వహణలో అధికారపార్టీ నాయకుల జోక్యం ఎక్కువవుతోంది. వీరి ఒత్తిడితో అధికారులు అడ్డగోలుగా కూరగాయల ధరలను తగ్గిస్తున్నారంటూ రైతులు మండిపడుతున్నారు. ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్న మాట నిజమేగానీ, ఒక్క రైతుబజార్లలోని ధరలను పూర్తిగా తగ్గించి వినియోగదారులకు అందించాలనేది సరైన నిర్ణయం కాదని రైతులు పేర్కొంటున్నారు. బహిరంగ మార్కెట్లో వ్యాపారులు ఇష్టారీతిగా అమ్ముకుంటుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. పొలంలో నాటువేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు అయ్యే ఖర్చుకు అనుగుణంగా కూరగాయల ధరలను నిర్ణయించాల్సి ఉందని, విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై అందించి, దళారీ వ్యవస్థను అరికట్టినట్లయితే తక్కువ ధరకు కూరగాయలు అందించేవారమని రైతులు చెబుతున్నారు. మంత్రి హల్చల్.. జిల్లాకు చెందిన మంత్రి రైతుబజార్ల ప్రక్షాళన పేరుతో హల్చల్ చేస్తున్నారు. తమ పార్టీ వారు కాకుండా ఇతర రాజకీయ పార్టీల సానుభూతిపరులను టార్గెట్ చేస్తున్నారు. రైతుబజార్లలో అధికార పార్టీకి చెందిన సానుభూతిపరులతో నేతలు కుమ్మక్కై చర్చలు జరిపినట్లు సమాచారం. కొన్నిరోజులపాటు అతి తక్కువ ధరలకు కూరగాయలు అందించే దిశగా చర్యలు తీసుకున్నట్లయితే ఇతర రాజకీయ పార్టీలకు చెందిన సానుభూతిపరులు బయటకు వెళ్లగొట్టవచ్చని కుట్ర పన్నుతున్నట్లు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ధరల నిర్ణయాధికారం రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులకు.. గతంలో రైతుబజార్లలో కూరగాయల ధరలను ఎస్టేట్ ఆఫీసర్లు, మార్కెటింగ్ శాఖాధికారులు నిర్ణయించేవారు. కాళేశ్వరరావు మార్కెట్‌కి రైతుబజార్ల ధరలకు రూ.1లేదా 2లు మాత్రమే వ్యత్యాసం ఉండేది. అయితే అధికార పార్టీ కుట్రలో భాగంగా ధరల నిర్ణయాధికారం రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులకు కేటాయించారు. వారికి ఎటువంటి అవగాహన లేకపోవడం, కుట్ర కారణంగా కూరగాయలకు అతి తక్కువ ధరలను నిర్ణయిస్తున్నారు. దీంతో గిట్టుబాటు లేక రైతులు కూరగాయలను రైతుబజార్లకు తీసుకురాకుండా మార్కెట్ లేదా, బహిరంగ ప్రదేశాలలో విక్రయించుకుంటున్నారు. రైతుబజార్ కు వ చ్చే వినియోగదారులు ఒట్టి చేతులతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. బహిరంగ మార్కెట్లో టమోటా కేజీ రూ.40లు ఉంటే రైతుబజార్లో రూ.28లుగా నిర్ణయించారు. వంకాయలు రూ.25లు ఉండగా రూ.8గా నిర్ణయించారు. పచ్చిమిర్చి బయట రూ.35ఉంటే రూ.15లుగా నిర్ణయించారు. దీంతో ధర గిట్టుబాటు కాక రైతులు లబోదిబోమంటున్నారు. తక్కువ ధరలకు కూరగాయలు దొరుకుతున్నాయని వస్తున్న వినియోగదారులు మాత్రం సరకు లేక వెనుతిరుగుతున్నారు. ప్రస్తుతం రైతుబజార్లలో ఆకుకూరలు, దోస, ములక్కాయలు వంటి కూరగాయలు తప్ప ఏమీ ఉండడం లేదు. పటమట రైతుబజార్లో ఎమ్మెల్యేకు చెందిన ఇద్దరు అనుచరులు తరచూ వచ్చి కార్డుదారుల యొక్క సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారు. ఎటువంటి అధికారం లేకుండానే కార్యకర్తలు కూడా వచ్చి రైతుబజారును పరిశీలించడం రైతులకు ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇప్పటికైనా అధికారులు అటు రైతులకు, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ధరలు నిర్ణయించి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. -
కర్రీ వర్రీ -
కొండెక్కిన కూరగాయల ధరలు మిర్చి ఘాటు.. ఉల్లి లొల్లి పచ్చడి మెతుకులూ కష్టమే! నోరు కట్టేసుకుంటున్న పేదోడు కరెంటు లేక.. నీరు రాక తగ్గిన సాగు విస్తీర్ణం మిర్చి ఘాటెక్కింది.. ఉల్లి లొల్లి చేస్తోంది.. ఇక కూరగాయలు చూస్తే ఏదీ కొనలేని స్థాయిలో ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీంతో జనం కూరగాయలు కొనలేక.. తినలేక అల్లాడిపోతున్నారు. మిర్చి ధర ఘాటు దిమ్మతిరిగేలా ఉండటంతో సామాన్యుడు పచ్చడి మెతుకులకూ దూరమవుతున్నాడు. గుడివాడ : మండుటెండల ప్రభావం వ్యవసాయ రంగం మీద తీవ్రంగా పడుతోంది. సాగునీరు లేక, కరెంటు రాక రైతుతో పాటు సామాన్య మానవుడు అల్లాడిపోతున్నాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఆకుకూరలు, కూరగాయల పంటలు ఎండిపోయాయి. దీంతోధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. దీనికితోడు వారం రోజులుగా ఉల్లి ధర సామాన్యుడికి కళ్లవెంట నీళ్లు తెప్పిస్తోంది. కూరగాయల సాగుపై ఉద్యానవన శాఖ అధికారులకు ముందుచూపు లోపించిన కారణంగా నేడు ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుబజార్లకు తగ్గిన దిగుమతులు... జిల్లాలో ఉన్న 15 రైతుబజార్లకు రోజుకు 100 టన్నులకు పైగా కూరగాయలు వస్తుంటాయి. రెండు నెలలుగా రైతుబజార్లకు వచ్చే కూరగాయలు 20 శాతం తగ్గాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ కోత అధికంగా ఉండటంతో వేసిన ఆ కాస్త పంటలు సైతం ఎండిపోతున్నాయని కొర్నిపాడుకు చెందిన రైతు గోవిందరావు చెప్పారు. నెలరోజుల్లో ధరలు రెట్టింపు... నెలరోజుల కాలంలో రెట్టింపు అయ్యాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రజలు నిత్యం ఉపయోగించే సాధారణ కూరగాయల రకాలు మార్కెట్లో దొరకడం లేదు. రైతుబజార్లలో తక్కువ ధర వస్తున్నందున ప్రైవేటు మార్కెట్లకు తరలిస్తున్నారు. కర్రీ పాయింట్లకు పెరిగిన డిమాండ్... కూరగాయలు కొని తినలేని పరిస్థితి ఏర్పడటంతో సామాన్య ప్రజలు కర్రీ పాయింట్ల వద్ద కూరలు కొని సరిపెట్టుకుంటున్నారు. సాంబారు, రసం, పప్పు, ఇతర కూరలు ఐదు, పది రూపాయలతో కొని సరిపెట్టుకుంటున్నామని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో రోజువారీ కూలీలు, పేదలు, రిక్షా కార్మికులు కర్రీ పాయింట్ల వద్ద కూరలు కొంటున్నారు. దీంతో కర్రీ పాయింట్లకు డిమాండ్ పెరిగింది.