కూరగాయలు, పప్పుదినుసుల ధరలకు రెక్కలు | all rate are high except rice | Sakshi
Sakshi News home page

కూరగాయలు, పప్పుదినుసుల ధరలకు రెక్కలు

Published Tue, May 26 2015 5:49 AM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM

all rate are high except rice

- హోల్‌సేల్ రేట్లకు, రిటైల్ రేట్లకు సగానికి సగం వ్యత్యాసం
- బెంబేలెత్తుతున్న వినియోగదారులు
- రేషన్ షాపుల్లో ఉచిత బియ్యం తప్ప మిగిలిన ధరలన్నీ భారీగా పెరుగుదల.
సాక్షి, బళ్లారి :
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ. కేజీ బియ్యాన్ని బీపీఎల్ కార్డు దారులకు ఉచితంగా పంపిణీకి శ్రీకారం చుట్టినప్పటికి పేదలకు కడుపు నిండా భోజనం తినలేని పరిస్థితి ఏర్పడుతోంది. రేషన్ షాపుల్లో బీపీఎల్‌కార్డు దారులకు ఉచితంగా బియ్యం దొరుకుతుందని సంతోషం తప్ప రేషన్ షాపుల నుంచి బయటకు వచ్చి అన్నంలో పప్పు వండేందుకు, సాంబార్ చేసేందుకు కూరగాయలు, పప్పు దినుసులు తీసుకోవాలంటే పేదలు కొనలేని పరిస్థితిలో ధరలు చుక్కలనంటుతున్నాయి. ఎండ వేడిమి రోజు రోజుకు పెరుగుతూ జనాన్ని ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారో అదే తరహాలో కూరగాయలు, పప్పు దినుసులు ధరలు పైపైకి ఎగబాకుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు.

పేదలకు రేషన్ షాపుల్లో ఒక్క బియ్యం మాత్రం ఉచితం అందజేసి, కంది పప్పును అందజేయకపోవడంతో పేదలకు ఎలాంటి మేలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఒక్క బియ్యం తీసుకుని ఉత్త అన్నం తినాలా అంటూ పేదలు ప్రశ్నిస్తున్నారు. కూరగాయలు, కంది పప్పులు, అలసందలు, పెసలు తదితర పప్పు దినుసులను మార్కెట్ మాయాజాలంతో వ్యాపారస్తులు విపరీతంగా పెంచుతున్నప్పటికీ సర్కార్ కళ్లు మూసుకుని చూస్తుండటంతో రైతులకు ఎలాంటి లాభం చేకూరక పోగా, వ్యాపారస్తులు కోట్లు గడిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కూరగాయల ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతుండటంతో రూ.500 లకు చిన్న బ్యాగులోకి కూడా కూరగాయలు రావడం లేదని పలువురు నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చి మిర్చి నుంచి టమోటా, క్యారెట్, బీట్‌రూట్, బెండ, వంకాయ తదితర కూరగాయలన్ని భారీగా పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. మొన్న మొన్నటి వరకు రూ.5లు ఉన్న టమోటా ధర ప్రస్తుతం రూ.40లకు పలుకుతోంది.

అయితే ఇక్కడ రైతులు మాత్రం ఇంత భారీ స్థాయిలో నగదు రాకపోవడం గమనార్హం. టమోటాతో క్యారెట్ రూ.40, పచ్చిమిర్చి, బెండ కూడా రూ.40 ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కూరగాయలు దాదాపు రూ.40 నుంచి రూ.50లు పలుకుతుండటంతో పాటు పప్పుదినుసులు మరింత రేటు పెరగడంతో పేదలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కంది పప్పు రూ.130, పెసర, అలసంద, మినపప్పులు కూడా రూ.150లు పైకి ఎగబాకడంతో వాటిని కొనుగోలు చేసి వంట వండుకునేందుకు మహిళలు నానా అవస్థలు పెడుతున్నారు. ఉన్నది సర్దుకుని వంట చేయమని పురుషులు ఆర్డర్ వేస్తున్నారు. ఎలా వండి వడ్డించాలని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బియ్యంతో పాటు సబ్సిడీతోనైనా కందిపప్పు, ఇతర పప్పుదినుసులు సరఫరా చేస్తే పేదలకు ఎంతో మేలు జరుగుతుందని పలువురు మహిళలు రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement