BPL card
-
కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం.. వాళ్లందరికి రేషన్ కార్డు రద్దు!
శివాజీనగర: వైట్‌బోర్డు కారు కలిగినవారి బీపీఎల్ కార్డు (రేషన్ కార్డు) రద్దు చేస్తామని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి కే.హెచ్.మునియప్ప వెల్లడించారు. అయితే ఉపాధి కోసం కారు కొనుగోలు చేసిన వారి కార్డును రద్దు చేయబోమని చెప్పారు. శుక్రవారం విధానసౌధలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం 5కేజీల బియ్యం, మిగతా ఐదు కేజీలకు బదులుగా నగదు ఇస్తున్నామని, దీర్ఘకాలం నగదు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. సెప్టెంబర్ నుంచి బీపీఎల్ కార్డుదారులకు 10 కేజీల బియ్యం ఇస్తామన్నారు. బియ్యం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. బియ్యంతో పాటు రాగి, జొన్నలు పంపిణీ చేసే విషయంపై కూడా యోచిస్తున్నామన్నారు. ఇందుకోసం 2023–24వ సంవత్సరంలో 8 లక్షల టన్నుల రాగులు, 3 లక్షల టన్నుల జొన్నలు కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు. చదవండి మళ్లీ పెళ్లికి సిద్ధమైన.. ముగ్గురు భార్యల ముద్దుల లాయర్‌కు దేహశుద్ది! -
సగం మందికి నో గ్యాస్
♦ ఇంటిగ్రేటెడ్ సర్వేలో గుర్తింపు ♦ జిల్లాలో 5.50 లక్షల కార్డుదారులకే గ్యాస్ ♦ అర్హుల గుర్తింపునకు ప్రత్యేక చర్యలు ♦ మార్చి 31లోగా 1.50 లక్షల దీపం కనెక్షన్లు ♦ నెలకు 25 వేల కనెక్షన్ల పంపిణీకి చర్యలు సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో అల్పాదాయ వర్గాల(బీపీఎల్)కు చెందిన వారిలో సగం మందికి గ్యాస్ కనెక్షన్ లేదని లెక్కతేల్చారు. వీరిలో అర్హులను గుర్తించి దీపం పథకంలో కొత్త కనెక్షన్లు మంజూరుకు చర్యలు చేపట్టారు. నెలకు కనీసం 25వేల కనెక్షన్ల చొప్పున 2016 మార్చి 31లోగా జిల్లాలో 1.50 లక్షల కనెక్షన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బీపీఎల్ కార్డు కలిగి ఆ కుటుంబంలో ఏ ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ లేకుంటే కొత్త గ్యాస్ కనెక్షన్ వచ్చినట్టే. ఏజెన్సీలో 43,978 మందికే గ్యాస్ ఇంటిగ్రేటెడ్ సర్వే మేనేజ్మెంట్ ఇన్ ఫర్మేషన్ సిస్టమ్ వద్ద ఉన్న గణాంకాలను బట్టి జిల్లాలో 10,85,573 బీపీఎల్ కార్డుల్లో 5,49,595 కార్డుదారులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మిగిలిన 5,35,978 కార్డుదారులకు గ్యాస్ కనెక్షన్ లేదని నిర్ధారణకు వచ్చారు. వీరిలో అత్యధికం ఏజెన్సీ పరిధిలోనే ఉన్నారు. ఏజెన్సీలో 2,19,092 కార్డుదారులుంటే వారిలో కేవలం 43,978 మందికి మాత్రమే గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కార్డు తీసుకునేటప్పుడు, ఆ తర్వాత డీలర్ల ద్వారా సేకరించిన వివరాల ప్రకారం లెక్కతేలిన ఈ జాబితాపై నిగ్గు తేల్చేందుకు ఇంటింటా సర్వే జరపాలని ఇప్పటికే తహశీల్దార్లను జిల్లా యంత్రాంగం ఆదేశించింది. గ్యాస్ కనెక్షన్లు లేని వారిలో ఎవరైనా ఈ మధ్యకాలంలో గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారా? లేదా అని ఆరా తీస్తున్నారు. ఎంతలేదనుకున్నా మరో నాలుగు లక్షలకుపైగా గా్యస్ కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉంటుందని అంచనా. బీపీఎల్ కార్డుదారులందరికీ గ్యాస్ సాచురేషన్ పద్ధతిలో అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్న సర్కారు తొలి విడతగా జిల్లాకు 1.50 లక్షల దీపం కనెక్షన్లు మంజూరు చేసింది. గతేడాది మంజూరు చేసిన 33 వేల కనెక్షన్లు ఇంకా పంపిణీ జరగకపోవడంతో వాటితో సహా 2016 మార్చి 31లోగా జిల్లాలో 1.50 లక్షల దీపం కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించింది. ఆ మేరకు గ్యాస్ కంపెనీలకు సబ్సిడీమొత్తాన్ని సర్కార్ జమ చేసిందంటున్నారు. జన్మభూమి కమిటీలతో ప్రమేయం లేకుండా గ్యాస్ కనెక్షన్ లేని బీపీఎల్ కార్డుదారులందరికీ దీపం కనెక్షన్ మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టామని రూరల్ డీఎస్ఓ శాంతకుమారి తెలిపారు. -
కూరగాయలు, పప్పుదినుసుల ధరలకు రెక్కలు
- హోల్‌సేల్ రేట్లకు, రిటైల్ రేట్లకు సగానికి సగం వ్యత్యాసం - బెంబేలెత్తుతున్న వినియోగదారులు - రేషన్ షాపుల్లో ఉచిత బియ్యం తప్ప మిగిలిన ధరలన్నీ భారీగా పెరుగుదల. సాక్షి, బళ్లారి : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ. కేజీ బియ్యాన్ని బీపీఎల్ కార్డు దారులకు ఉచితంగా పంపిణీకి శ్రీకారం చుట్టినప్పటికి పేదలకు కడుపు నిండా భోజనం తినలేని పరిస్థితి ఏర్పడుతోంది. రేషన్ షాపుల్లో బీపీఎల్‌కార్డు దారులకు ఉచితంగా బియ్యం దొరుకుతుందని సంతోషం తప్ప రేషన్ షాపుల నుంచి బయటకు వచ్చి అన్నంలో పప్పు వండేందుకు, సాంబార్ చేసేందుకు కూరగాయలు, పప్పు దినుసులు తీసుకోవాలంటే పేదలు కొనలేని పరిస్థితిలో ధరలు చుక్కలనంటుతున్నాయి. ఎండ వేడిమి రోజు రోజుకు పెరుగుతూ జనాన్ని ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారో అదే తరహాలో కూరగాయలు, పప్పు దినుసులు ధరలు పైపైకి ఎగబాకుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. పేదలకు రేషన్ షాపుల్లో ఒక్క బియ్యం మాత్రం ఉచితం అందజేసి, కంది పప్పును అందజేయకపోవడంతో పేదలకు ఎలాంటి మేలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఒక్క బియ్యం తీసుకుని ఉత్త అన్నం తినాలా అంటూ పేదలు ప్రశ్నిస్తున్నారు. కూరగాయలు, కంది పప్పులు, అలసందలు, పెసలు తదితర పప్పు దినుసులను మార్కెట్ మాయాజాలంతో వ్యాపారస్తులు విపరీతంగా పెంచుతున్నప్పటికీ సర్కార్ కళ్లు మూసుకుని చూస్తుండటంతో రైతులకు ఎలాంటి లాభం చేకూరక పోగా, వ్యాపారస్తులు కోట్లు గడిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కూరగాయల ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతుండటంతో రూ.500 లకు చిన్న బ్యాగులోకి కూడా కూరగాయలు రావడం లేదని పలువురు నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చి మిర్చి నుంచి టమోటా, క్యారెట్, బీట్రూట్, బెండ, వంకాయ తదితర కూరగాయలన్ని భారీగా పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. మొన్న మొన్నటి వరకు రూ.5లు ఉన్న టమోటా ధర ప్రస్తుతం రూ.40లకు పలుకుతోంది. అయితే ఇక్కడ రైతులు మాత్రం ఇంత భారీ స్థాయిలో నగదు రాకపోవడం గమనార్హం. టమోటాతో క్యారెట్ రూ.40, పచ్చిమిర్చి, బెండ కూడా రూ.40 ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కూరగాయలు దాదాపు రూ.40 నుంచి రూ.50లు పలుకుతుండటంతో పాటు పప్పుదినుసులు మరింత రేటు పెరగడంతో పేదలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కంది పప్పు రూ.130, పెసర, అలసంద, మినపప్పులు కూడా రూ.150లు పైకి ఎగబాకడంతో వాటిని కొనుగోలు చేసి వంట వండుకునేందుకు మహిళలు నానా అవస్థలు పెడుతున్నారు. ఉన్నది సర్దుకుని వంట చేయమని పురుషులు ఆర్డర్ వేస్తున్నారు. ఎలా వండి వడ్డించాలని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బియ్యంతో పాటు సబ్సిడీతోనైనా కందిపప్పు, ఇతర పప్పుదినుసులు సరఫరా చేస్తే పేదలకు ఎంతో మేలు జరుగుతుందని పలువురు మహిళలు రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు. -
‘సరుకు’ లేని కానుక
శ్రీకాకుళం పాతబస్టాండ్: సంక్రాంతికి చంద్రన్న కానుక.. ఉచితంగా ఆరు రకాల సరుకుల ప్యాక్.. అంటూ ప్రభుత్వం హడావుడి చేస్తున్నప్పటికీ ఆ గిఫ్ట్ ప్యాక్ సకాలంలో పేద కార్డుదారులకు అందుతుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రకటనల్లో చేస్తున్న ఆర్భాటం ఆచరణలో కనిపించకపోవడమే దీనికి కారణం. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రేషన్‌కార్డుదారులు కూడా పిండివంటలతో సంక్రాంతికి నోరు తీపి చేసుకునేందుకు ఆరు రకాల సరుకులతో కూడిన గిఫ్ట్ ప్యాక్‌ను పూర్తి ఉచితంగా అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల పదో తేదీ నాటికి లబ్ధిదారులందరికీ ఈ ప్యాక్‌లు అందించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ప్రభుత్వం పేర్కొన్న సరుకులేవీ ఇంకా జిల్లాకు చేరుకోలేదు. సరుకుల పంపిణీకి అవసరమైన సంచులు మాత్రమే చేరాయి. సరుకులను స్థానికంగానే సమకూర్చుకోవాలా.. ప్రభుత్వమే సరఫరా చేస్తుందా అన్న దానిపై కూడా స్పష్టత లేక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. సరుకులు ఎప్పుడు వస్తాయి.. వాటిని ఎప్పుడు ప్యాక్ చేయించాలో అర్థం కాని పరిస్థితి. ఈ కారణాల వల్ల పంపిణీలో జాప్యం జరిగితే ఆ అపవాదు తమ మీదకే వస్తుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీపీఎల్ కార్డుదారులందరికీ.. గిఫ్ట్ ప్యాక్‌లో అరకేజీ గోధుమ పిండి, కేజీ శనగలు, అరకేజీ పంచదార, అర లీటర్ పామాయిల్, అరకేజీ కందిపప్పు, వంద గ్రాముల నెయ్యి ఇస్తారు. వీటి ధర రూ.220, వీటితోపాటు ఇచ్చే సంచి ఖరీదు రూ.11.60.. అంటే మొత్తం రూ.231.60 విలువైన గిఫ్ట్ ప్యాక్‌ను కార్డుదారులకు ఉచితంగా ఇస్తారన్నమాట. జిల్లాలో ఉన్న అందరు బీపీఎల్ కార్డుదారులకు ఈ గిఫ్ట్ ప్యాక్ ఇస్తారు. జిల్లాలో మొత్తం 7,96,641 కార్డులు ఉన్నాయి. వీటిలో 7,03,166 తెల్లకార్డులు, 51,069 ఏఏవై కార్డులు. 1123 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. మరో 44,283 కార్డులు చెలామణీలో లేవు. వీటన్నింటికీ గిఫ్ట్ ప్యాక్ ఇస్తారు. మళ్లీ జన్మభూమి కమిటీలకే.. గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీ బాధ్యతను కూడా గ్రామాల్లోని జన్మభూమి కమిటీలకే అప్పజెప్పడంతో కమిటీల సభ్యులు సంబరపడుతున్నా.. లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. హుద్‌హుద్, పింఛన్లు, రేషన్‌కార్డుల చేదు అనుభవాలు తలచుకొని సంక్రాంతి కానుక హుష్‌కాకి అవుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్ తుపాను బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీని జన్మభూమి కమిటీలకే అప్పగించారు. కమిటీల ముసుగులో ఉన్న టీడీపీ కార్యకర్తలు చేతివాటం, పక్షపాతం చూపడంతో అనేక గ్రామాలు, పట్టణాల్లో తుపాను సహాయం అర్హులైన బాధితులకు అందకుండాపోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటువంటి సంఘటనలపై విచారణలు కూడా జరిగాయి. ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.