శ్రీకాకుళం పాతబస్టాండ్: సంక్రాంతికి చంద్రన్న కానుక.. ఉచితంగా ఆరు రకాల సరుకుల ప్యాక్.. అంటూ ప్రభుత్వం హడావుడి చేస్తున్నప్పటికీ ఆ గిఫ్ట్ ప్యాక్ సకాలంలో పేద కార్డుదారులకు అందుతుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రకటనల్లో చేస్తున్న ఆర్భాటం ఆచరణలో కనిపించకపోవడమే దీనికి కారణం. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రేషన్‌కార్డుదారులు కూడా పిండివంటలతో సంక్రాంతికి నోరు తీపి చేసుకునేందుకు ఆరు రకాల సరుకులతో కూడిన గిఫ్ట్ ప్యాక్‌ను పూర్తి ఉచితంగా అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల పదో తేదీ నాటికి లబ్ధిదారులందరికీ ఈ ప్యాక్‌లు అందించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ప్రభుత్వం పేర్కొన్న సరుకులేవీ ఇంకా జిల్లాకు చేరుకోలేదు. సరుకుల పంపిణీకి అవసరమైన సంచులు మాత్రమే చేరాయి. సరుకులను స్థానికంగానే సమకూర్చుకోవాలా.. ప్రభుత్వమే సరఫరా చేస్తుందా అన్న దానిపై కూడా స్పష్టత లేక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. సరుకులు ఎప్పుడు వస్తాయి.. వాటిని ఎప్పుడు ప్యాక్ చేయించాలో అర్థం కాని పరిస్థితి. ఈ కారణాల వల్ల పంపిణీలో జాప్యం జరిగితే ఆ అపవాదు తమ మీదకే వస్తుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీపీఎల్ కార్డుదారులందరికీ..
గిఫ్ట్ ప్యాక్‌లో అరకేజీ గోధుమ పిండి, కేజీ శనగలు, అరకేజీ పంచదార, అర లీటర్ పామాయిల్, అరకేజీ కందిపప్పు, వంద గ్రాముల నెయ్యి ఇస్తారు. వీటి ధర రూ.220, వీటితోపాటు ఇచ్చే సంచి ఖరీదు రూ.11.60.. అంటే మొత్తం రూ.231.60 విలువైన గిఫ్ట్ ప్యాక్‌ను కార్డుదారులకు ఉచితంగా ఇస్తారన్నమాట. జిల్లాలో ఉన్న అందరు బీపీఎల్ కార్డుదారులకు ఈ గిఫ్ట్ ప్యాక్ ఇస్తారు. జిల్లాలో మొత్తం 7,96,641 కార్డులు ఉన్నాయి. వీటిలో 7,03,166 తెల్లకార్డులు, 51,069 ఏఏవై కార్డులు. 1123 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. మరో 44,283 కార్డులు చెలామణీలో లేవు. వీటన్నింటికీ గిఫ్ట్ ప్యాక్ ఇస్తారు.
మళ్లీ జన్మభూమి కమిటీలకే..
గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీ బాధ్యతను కూడా గ్రామాల్లోని జన్మభూమి కమిటీలకే అప్పజెప్పడంతో కమిటీల సభ్యులు సంబరపడుతున్నా.. లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. హుద్‌హుద్, పింఛన్లు, రేషన్‌కార్డుల చేదు అనుభవాలు తలచుకొని సంక్రాంతి కానుక హుష్‌కాకి అవుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్ తుపాను బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీని జన్మభూమి కమిటీలకే అప్పగించారు. కమిటీల ముసుగులో ఉన్న టీడీపీ కార్యకర్తలు చేతివాటం, పక్షపాతం చూపడంతో అనేక గ్రామాలు, పట్టణాల్లో తుపాను సహాయం అర్హులైన బాధితులకు అందకుండాపోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటువంటి సంఘటనలపై విచారణలు కూడా జరిగాయి. ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
‘సరుకు’ లేని కానుక
Published Sun, Jan 4 2015 4:00 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement