- కూర గాయల ధరలు తగ్గించాలని అధికారులపై ఒత్తిడి
- గిట్టుబాటు కాక రైతుల గగ్గోలు
- తెలుగు తమ్ముళ్లే పర్యవేక్షకులు
- ఇతర పార్టీల సానుభూతి పరులను వెళ్లగొట్టే యత్నం
విజయవాడ : రైతుబజార్ల నిర్వహణలో అధికారపార్టీ నాయకుల జోక్యం ఎక్కువవుతోంది. వీరి ఒత్తిడితో అధికారులు అడ్డగోలుగా కూరగాయల ధరలను తగ్గిస్తున్నారంటూ రైతులు మండిపడుతున్నారు. ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్న మాట నిజమేగానీ, ఒక్క రైతుబజార్‌లలోని ధరలను పూర్తిగా తగ్గించి వినియోగదారులకు అందించాలనేది సరైన నిర్ణయం కాదని రైతులు పేర్కొంటున్నారు.
బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు ఇష్టారీతిగా అమ్ముకుంటుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. పొలంలో నాటువేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు అయ్యే ఖర్చుకు అనుగుణంగా కూరగాయల ధరలను నిర్ణయించాల్సి ఉందని, విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై అందించి, దళారీ వ్యవస్థను అరికట్టినట్లయితే తక్కువ ధరకు కూరగాయలు అందించేవారమని రైతులు చెబుతున్నారు.
మంత్రి హల్‌చల్..
జిల్లాకు చెందిన మంత్రి రైతుబజార్‌ల ప్రక్షాళన పేరుతో హల్‌చల్ చేస్తున్నారు. తమ పార్టీ వారు కాకుండా ఇతర రాజకీయ పార్టీల సానుభూతిపరులను టార్గెట్ చేస్తున్నారు. రైతుబజార్లలో అధికార పార్టీకి చెందిన సానుభూతిపరులతో నేతలు కుమ్మక్కై చర్చలు జరిపినట్లు సమాచారం. కొన్నిరోజులపాటు అతి తక్కువ ధరలకు కూరగాయలు అందించే దిశగా చర్యలు తీసుకున్నట్లయితే ఇతర రాజకీయ పార్టీలకు చెందిన సానుభూతిపరులు బయటకు వెళ్లగొట్టవచ్చని కుట్ర పన్నుతున్నట్లు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.
ధరల నిర్ణయాధికారం రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులకు..
గతంలో రైతుబజార్‌లలో కూరగాయల ధరలను ఎస్టేట్ ఆఫీసర్లు, మార్కెటింగ్ శాఖాధికారులు నిర్ణయించేవారు. కాళేశ్వరరావు మార్కెట్‌కి రైతుబజార్‌ల ధరలకు రూ.1లేదా 2లు మాత్రమే వ్యత్యాసం ఉండేది. అయితే అధికార పార్టీ కుట్రలో భాగంగా ధరల నిర్ణయాధికారం రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులకు కేటాయించారు. వారికి ఎటువంటి అవగాహన లేకపోవడం, కుట్ర కారణంగా కూరగాయలకు అతి తక్కువ ధరలను నిర్ణయిస్తున్నారు. దీంతో గిట్టుబాటు లేక రైతులు కూరగాయలను రైతుబజార్‌లకు తీసుకురాకుండా మార్కెట్ లేదా, బహిరంగ ప్రదేశాలలో విక్రయించుకుంటున్నారు.
రైతుబజార్ కు వ చ్చే వినియోగదారులు ఒట్టి చేతులతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. బహిరంగ మార్కెట్‌లో టమోటా కేజీ రూ.40లు ఉంటే రైతుబజార్‌లో రూ.28లుగా నిర్ణయించారు. వంకాయలు రూ.25లు ఉండగా రూ.8గా నిర్ణయించారు. పచ్చిమిర్చి బయట రూ.35ఉంటే రూ.15లుగా నిర్ణయించారు. దీంతో ధర గిట్టుబాటు కాక రైతులు లబోదిబోమంటున్నారు. తక్కువ ధరలకు కూరగాయలు దొరుకుతున్నాయని వస్తున్న వినియోగదారులు మాత్రం సరకు లేక వెనుతిరుగుతున్నారు.
ప్రస్తుతం రైతుబజార్‌లలో ఆకుకూరలు, దోస, ములక్కాయలు వంటి కూరగాయలు తప్ప ఏమీ ఉండడం లేదు. పటమట రైతుబజార్‌లో ఎమ్మెల్యేకు చెందిన ఇద్దరు అనుచరులు తరచూ వచ్చి కార్డుదారుల యొక్క సర్టిఫికెట్‌లను పరిశీలిస్తున్నారు. ఎటువంటి అధికారం లేకుండానే కార్యకర్తలు కూడా వచ్చి రైతుబజారును పరిశీలించడం రైతులకు ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇప్పటికైనా అధికారులు అటు రైతులకు, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ధరలు నిర్ణయించి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.