
సాక్షి, విజయవాడ : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు(బుధవారం) విజయవాడలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆమె నియోజకవర్గంలోని జక్కుల, నెక్కలం, గూడవల్లి సర్కిల్ వద్ద వ్యవసాయ క్షేత్రంలో నేరుగా రైతులను కలిసి మాట్లాడారు. అనంతరం విజయవాడలోని ది వెన్యూ ఫంక్షన్‌హాల్లో వ్యవసాయ బిల్లులపై వ్యవసాయరంగ నిపుణులతో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..' పార్లమెంట్ లో ఇటీవల సవరించిన మూడు యాక్ట్ కపై దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రులంతా పర్యటిస్తున్నాం. వ్యవసాయ విధానాలపై బిల్లుల సవరణ చేస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టాం. సంస్కరణల ద్వారానే రైతులకి మేలు జరుగుతుందని.. రైతు సంక్షేమమే మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల సవరించిన మూడు యాక్ట్ లను ఒకేసారి సవరణలు చేయడం ద్వారానే రైతులకి మేలు జరుగుతుంది. గతంలో రైతులు తమ ఉత్పత్తులని ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలో అమ్ముకోవడానికి కుదిరేది కాదు. కానీ కొత్తగా సవరించిన చట్టం వల్ల రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు.
గతంలో 8.5 % వరకి పన్నులు చెల్లించాల్సి వచ్చేది. మా ప్రభుత్వంలో దాదాపు 23 రకాల ఆహార ఉత్పత్తులకి కనీస మద్దతు ధర కల్పించాం. గతంలో కనీస మద్దతు ధర కేవలం వరి, గోధుమకి మాత్రమే ప్రకటించేవారు.. కానీ ఇప్పుడు ఆయా ఆహార ఉత్పత్తుల కొనుగోలు కూడా పెరిగాయి. టమాటో పండించే రైతుకి గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు పడేవారు.. నూతన చట్ట సవరణల వల్ల టమాటా లాంటి రైతులకి మేలు జరగనుంది.
పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకి కూడా ప్రోత్సాహం ఇస్తున్నాం. నూతన చట్ట సవరణల వల్ల సన్న, చిన్నరైతులకి నష్టం జరగదు. ఉత్తర భారతంలో గుంటూరు మిర్చికి మంచి డిమాండ్ ఉన్నా కూడా గతంలో సరఫరా చేయలేకపోయాం. వ్యవసాయపరమైన చట్ట సవరణలపై కాంగ్రెస్ ద్వంద్వ నీతి ప్రదర్శిస్తోంది. కొన్నిపార్టీలు కావాలనే పార్లమెంట్ లో ఈ చట్ట సవరణలపై గొడవలు చేశారు. చిన్న రైతులు సైతం ఈ-నామ్ డిజిటల్ వ్యవస్ధ ద్వారా ఎక్కడైనా తమ ఉత్పత్తులని సులువుగా అమ్ముకోవచ్చు. కోవిడ్ కి ముందు నాటి ఆర్ధిక పరిస్ధితులకి చేరుకుంటున్నాం. రాష్డ్రాలకి జీఎస్టీలోటు భర్తీపై ఈ నెల 12న మరోసారి రాష్డ్రాలతో సమావేశమం కానున్నాం. ఇప్పటికే ఈ అంశాలపై ఏడు గంటలపాటు సుధీర్ఘంగా చర్చించాం ' అంటూ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment