కర్రీ వర్రీ - | Curry Worry | Sakshi
Sakshi News home page

కర్రీ వర్రీ

Published Mon, Jul 7 2014 1:29 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

కర్రీ వర్రీ - - Sakshi

కర్రీ వర్రీ -

  • కొండెక్కిన కూరగాయల ధరలు    
  •  మిర్చి ఘాటు.. ఉల్లి లొల్లి
  •  పచ్చడి మెతుకులూ కష్టమే!    
  •  నోరు కట్టేసుకుంటున్న పేదోడు
  •  కరెంటు లేక.. నీరు రాక తగ్గిన సాగు విస్తీర్ణం
  • మిర్చి ఘాటెక్కింది.. ఉల్లి లొల్లి చేస్తోంది.. ఇక కూరగాయలు చూస్తే ఏదీ కొనలేని స్థాయిలో ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీంతో జనం కూరగాయలు కొనలేక.. తినలేక అల్లాడిపోతున్నారు. మిర్చి ధర ఘాటు దిమ్మతిరిగేలా ఉండటంతో సామాన్యుడు పచ్చడి మెతుకులకూ దూరమవుతున్నాడు.
     
    గుడివాడ : మండుటెండల ప్రభావం వ్యవసాయ రంగం మీద తీవ్రంగా పడుతోంది. సాగునీరు లేక, కరెంటు రాక రైతుతో పాటు సామాన్య మానవుడు అల్లాడిపోతున్నాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఆకుకూరలు, కూరగాయల పంటలు ఎండిపోయాయి. దీంతోధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. దీనికితోడు వారం రోజులుగా ఉల్లి ధర సామాన్యుడికి కళ్లవెంట నీళ్లు తెప్పిస్తోంది. కూరగాయల సాగుపై ఉద్యానవన శాఖ అధికారులకు ముందుచూపు లోపించిన కారణంగా నేడు ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
     
    రైతుబజార్లకు తగ్గిన దిగుమతులు...

    జిల్లాలో ఉన్న 15 రైతుబజార్లకు రోజుకు 100 టన్నులకు పైగా కూరగాయలు వస్తుంటాయి. రెండు నెలలుగా రైతుబజార్లకు వచ్చే కూరగాయలు 20 శాతం తగ్గాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ కోత అధికంగా ఉండటంతో వేసిన ఆ కాస్త పంటలు సైతం ఎండిపోతున్నాయని కొర్నిపాడుకు చెందిన రైతు గోవిందరావు చెప్పారు.
     
    నెలరోజుల్లో ధరలు రెట్టింపు... నెలరోజుల కాలంలో రెట్టింపు అయ్యాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రజలు నిత్యం ఉపయోగించే సాధారణ కూరగాయల రకాలు మార్కెట్‌లో దొరకడం లేదు. రైతుబజార్లలో తక్కువ ధర వస్తున్నందున ప్రైవేటు మార్కెట్‌లకు తరలిస్తున్నారు.
     
    కర్రీ పాయింట్లకు పెరిగిన డిమాండ్...

    కూరగాయలు కొని తినలేని పరిస్థితి ఏర్పడటంతో సామాన్య ప్రజలు కర్రీ పాయింట్ల వద్ద కూరలు కొని సరిపెట్టుకుంటున్నారు. సాంబారు, రసం, పప్పు, ఇతర కూరలు ఐదు, పది రూపాయలతో కొని సరిపెట్టుకుంటున్నామని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో రోజువారీ కూలీలు, పేదలు, రిక్షా కార్మికులు కర్రీ పాయింట్ల వద్ద కూరలు కొంటున్నారు. దీంతో కర్రీ పాయింట్లకు డిమాండ్ పెరిగింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement