పల్లెలకు పచ్చని పందిరి | Irrigation Minister Harish Rao interview with Sakshi | Sakshi
Sakshi News home page

పల్లెలకు పచ్చని పందిరి

Published Sun, May 28 2017 12:16 AM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM

పల్లెలకు పచ్చని పందిరి - Sakshi

పల్లెలకు పచ్చని పందిరి

‘సాక్షి’ ఇంటర్వ్యూలో నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు
- కోటి ఎకరాల సాగును మాటల్లో కాదు.. చేతల్లో చూపుతున్నాం
- ఇప్పటికే ప్రాజెక్టుల కింద 12 లక్షల ఎకరాలకు సాగునీరు
- ఒక్క పాలమూరులోనే 4.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి వలసలు ఆపాం
- వచ్చే ఏడాది 9.67 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు సిద్ధం చేశాం
- రీ ఇంజనీరింగ్‌తో గోదావరిని సజీవం చేస్తామని వ్యాఖ్య


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగంలో తెచ్చిన మార్పులు విప్లవాత్మకమని, పల్లె ప్రజల జీవన చిత్రమే మారుతోందని నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రానికి ఉన్న నీటి వాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తేవడం, అసెంబ్లీ నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున నీరందించడం లక్ష్యంగా సాగుతు న్న ప్రభుత్వం... ఇప్పటికే బీడు భూముల్లో హరిత పందిరి వేసిం దన్నారు. పలు ప్రాజెక్టుల పూర్తి, మిషన్‌ కాకతీయ కారణంగా ఈ ఏడాది 60 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయన్నారు. ఆరునూరైనా లక్ష్యం మేరకు కోటి ఎకరాలకు నీరందించి ప్రజల ఆశలు నెరవేరుస్తామని... తెలంగాణను కోటి ఎకరాల మాగాణగా మారుస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల స్థితిగతులు, లక్ష్యాలు, వివాదాలు, భూసేకరణ తదితర అంశాలపై హరీశ్‌రావు ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు.

ప్రశ్న: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి?
హరీశ్‌రావు:
సాగునీటి రంగ అభివృద్ధి మీదే తెలంగాణ పునర్నిర్మాణం ఆధా రపడి ఉన్నదన్న సంగతి ప్రభుత్వానికి తెలుసు. వ్యవసాయాభివృద్ధి జరిగితే తెలంగాణ నుంచి ప్రజల వలసలు ఆగిపో తాయి. రైతుల ఆత్మహత్యలు ఆగుతాయి. వ్యవసాయం పుంజుకుంటే గ్రామాల్లో వృత్తులవారు బతుకు తారు. ఇక పంటలకు గిట్టుబాటు ధరలు లభించాలి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు దొరకాలి. పంటలకు నిల్వ, మార్కెటింగ్‌ సౌకర్యం ఉండాలి. ఇవన్నీ అందుబాటులో ఉన్నా సాగునీటి సర ఫరా లేకుంటే వ్యవసాయ సంక్షోభం సమసిపోదు. అందువల్లే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం లక్ష ఎకరాల చొప్పున సాగునీరు అందించి.. తెలంగాణను కోటి ఎకరాల మాగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ కంకణం కట్టుకున్నారు. 36 నెలల పసి తెలంగాణ అయినప్పటికీ.. మిషన్‌ కాకతీయ, ఎత్తిపోతల పథకాలు, మధ్యతరహా, భారీ ప్రాజెక్టులు విజయవంతంగా సాగుతున్నాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాక కొత్తగా 6.54 లక్షల ఎకరాలకు సాగునీరివ్వడంతోపాటు మరో 5.82 లక్షల ఎకరాలను స్థిరీకరించి మా సత్తా చూపాం. వచ్చే సంవత్సరం మరో 9.67 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావడంతోపాటు 3.08 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

ప్రాజెక్టుల పరిధిలో ప్రధాన సమస్యలకు పరిష్కారమేదీ?
ప్రాజెక్టులు నత్తనడకన సాగడానికి ప్రధాన అవరోధమైన భూసేక రణ సమస్యను పరిష్కరించేందుకు తీసుకువచ్చిన జీవో 123 మంచి ఫలితాలు ఇచ్చింది. ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. చిన్న నీటి పారుదల పనులూ గాడిన పడ్డాయి. కానీ ప్రతిపక్ష నేతలు కొందరు రైతుల పేర్ల మీద, ఎప్పుడో చనిపోయిన వారి పేర్లతో, ఏళ్ల కింద వలసవెళ్లినవారి పేర్లతో 123 జీవోపై తప్పుడు కేసులు వేసి.. స్టే వచ్చేలా చేశారు. దానివల్ల 4 నెలల విలువైన కాలం వృథా అయింది. ఇప్పుడు జీవో 123కి చట్ట రూపం కూడా కల్పించాం. దీని ద్వారా భూసేకరణ వేగంగా జరిగి ప్రాజెక్టుల పనులు పుంజుకుంటాయి.

అనుమతుల్లో జాప్యం మాటేమిటి?
అటవీ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి వేగంగా అనుమతులు పొందుతున్నాం. రైల్వే, రోడ్డు భవనాల శాఖలతో ప్రతీ నెలా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నందున ఆయా శాఖల క్లియరెన్స్‌తో పనులు ముందుకు సాగుతున్నాయి.

రీ ఇంజనీరింగ్‌పై వ్యతిరేకత వస్తోంది కదా..
కొన్నేళ్ల కింద చేపట్టిన పలు ప్రాజెక్టు ల్లో సాంకేతిక, డిజైన్ల లోపాలు, నీటి లభ్యతపై, అమలులో ఎదురవుతున్న సమస్యలు, అంత ర్రాష్ట్ర సమస్యలు, వన్యప్రాణి కేంద్రా లు, బొగ్గు గనుల వంటివి ప్రాజెక్టులకు అవరోధాలుగా మారనున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. సీఎం స్వయంగా ఇంజనీరింగ్‌ నిపుణులతో, రిటైర్డ్‌ ఇంజనీర్లతో సమావేశమై.. సర్వే ఆఫ్‌ ఇండియా మ్యాపులు, గూగుల్‌ ఎర్త్‌ సహా యంతో పరిశీలించారు. ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్‌ చేస్తే అవరోధాలను అధిగమించవచ్చని గుర్తించారు. అనంతరమే ప్రాణహిత–చేవెళ్ళ సుజల స్రవంతి, దుమ్ముగూడెం, ఇందిరా సాగర్, ఎస్సారెస్పీ వరద కాలువ, దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్‌ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇక రీ ఇంజనీ రింగ్‌తో కొత్త బ్యారేజీల నిర్మాణం జరిగి గోదావరి నది సజీవంగా మారుతుంది.

ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్‌ జలాశ యాలను కలుపు కొంటే నిజామాబాద్‌ జిల్లా కందకుర్తి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం దాకా 470 కిలోమీటర్ల పొడవున్న గోదావరి నది.. దాదాపు 274 కిలోమీటర్ల పొడవునా 365 రోజులు సజీవంగా ఉంటుంది. శ్రీరాంసాగర్‌ (90 టీఎంసీలు), సదర్‌ మాట్‌ (1.58), ఎల్లంపల్లి (20), సుందిళ్ల (9), అన్నారం (10), మేడిగడ్డ (16), తుపాకుల గూడెం (7), దుమ్ముగూడెం ఆనకట్ట (1.3) కలిపి మొత్తం 146.3 టీఎంసీల నీటి నిల్వ సాధ్యపడుతుంది. ఇలా గోదావరి నది సజీవం అవుతు న్నందున ఉత్తర తెలంగాణ రూపురేఖలు మారబోతున్నాయి. వ్యవసాయం, చేపల పెంపకం, టూరిజం, జల రవాణా వంటి రంగాల్లో అనూహ్య ఆర్థిక ప్రగతి జరగనుంది.

కాళేశ్వరం వివాదాలపై మీ కామెంట్‌
ప్రాణహిత–చేవెళ్ల పథకాన్ని రీ డిజైన్‌ చేసి రెండు భాగాలుగా విభజించడం జరిగింది. ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్‌ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు, కాళేశ్వరం ద్వారా 18 లక్షల కొత్త ఆయకట్టుకు నీరందించడంతోపాటు.. శ్రీరాం సాగర్, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల కింద ఉన్న మరో 18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాల నేది లక్ష్యం. కాళేశ్వరంలో మార్పులు కేవలం బీడు భూములకు నీళ్లందించడం, దారిలో గ్రామాలకు తాగునీటిని అందించడమే. కానీ ప్రతిపక్షాలు దీన్ని అర్థం చేసుకోకుండా రాద్ధాంతం చేస్తున్నాయి. దేశంలోని ఎక్కడి కాంట్రాక్టర్లయినా టెండర్లలో పాల్గొంటా రు. తక్కువ ధర కోట్‌ చేసినవారు కాంట్రాక్టు పొందుతారు. అందులో మేం చేకూర్చిన లబ్ధి ఏమిటి? ఇక ప్రాజెక్టుపై ఏపీ కొర్రీలు పెడుతోంది. కానీ అవి పెద్ద అడ్డంకి అని మేం భావించడం లేదు.

నదీ జలాల వినియోగంపై వివాదాలు ఇంకెన్నాళ్లు?
ఇది దురదృష్టకరం. ఉమ్మడి ఏపీలో జరుగుతున్న అన్యాయమే ఇప్పుడూ జరిగితే అంగీకరించబోం. అందుకే కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా కోసం ట్రిబ్యునళ్లు, కోర్టులు, బోర్డుల ముందు కొట్లాడుతున్నాం. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి ఉన్న హక్కుల మేరకే వినియోగం చేస్తున్నాం. ఒక్క చుక్క అదనంగా కోరుకోవడం లేదు. కృష్ణా నికర జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల కేటాయింపులో... ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు వాటాగా ఉన్నాయి. తెలంగాణకు మరో 77 టీఎంసీల మిగులు జలాల కేటాయింపులూ ఉన్నాయి. అయినా రాష్ట్రం 200 టీఎంసీలకు మించి వాడటం లేదు. నీటి వాటాను తమ పరిధిలో ఎక్కడైనా వాడుకునే వెసులుబాటు తెలంగాణకు ఉన్నందున.. పాలమూరు–రంగారెడ్డి, డిండిలకు నీటిని వాడుకుందామని నిర్ణయించాం. పాలమూరు ద్వారా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు.. డిండి ఎత్తిపోతల ద్వారా నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాల్లో 3.41 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇక గోదావరిలో హక్కుగా ఉన్న 954 టీఎంసీలను పూర్తిగా వాడుకునేలా పథకాలు చేపడుతున్నాం.

మిషన్‌ కాకతీయ లక్ష్యాలు నెరవేరుతున్నాయా?
మూడేళ్లలో 24 వేల చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. మొదటి విడతకు సంబంధించి 7,896 చెరువుల పనులు పూర్తయ్యాయి. మిగతావాటి పనులు వచ్చే నెలలో పూర్తికానున్నాయి. రెండో విడతలోని 4,802 పనులు పూర్తికాగా.. మిగతా పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మూడో విడతలో 6,500 చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకున్నాం. 2016లో విస్తారంగా వర్షాలు కురవడంతో చాలా చెరువులు జలకళ సంతరించుకున్నాయి. పునరుద్ధరణ జరిగిన 17 వేల చెరువులతోపాటు ప్రాజెక్టుల ద్వారా నింపిన పలు చెరువుల నీటితో.. 2016–17లో రికార్డు స్థాయిలో 15.70 ఎకరాలకు సాగునీరు అందించాం. చెరువుల కింద ఖరీఫ్, రబీ కలిపి గతంలో ఎన్నడూ 11 లక్షల ఎకరాలకు మించి నీరివ్వకపోవడం గమనార్హం. ఇక చెరువుల పూడిక మట్టి చల్లుకున్న పొలాల్లో పంటల పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టు తేలింది. పంట ఏపుగా పెరిగిందని, రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకం తగ్గిందని రైతులు చెబుతున్నారు. ఈ అంశాలపై వ్యవసాయ శాఖ, మిచిగాన్‌ యూనివర్సిటీవారి అధ్యయనం కొనసాగుతోంది. త్వరలోనే ఇక్రిశాట్‌ ఆధ్వర్యంలో సమగ్ర అధ్యయనం జరపడానికి అవగాహన కుదుర్చుకున్నాం. చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలూ వృద్ధి చెందినట్లు ఆ శాఖ అధ్యయనంలో తేలింది.

నీటి పారుదలకు నిధులు, కేంద్ర సాయం మాటేమిటి?
మా ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే నీటి పారుదల శాఖకు నిధులు రూ.8,500 కోట్లు కేటాయించింది. ఇక పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పూర్తి, పాలమూరు, డిండి, ప్రాణహిత, కాళేశ్వరం, ఛనాకా–కొరట, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయ పనుల పూర్తికోసం.. 2016–17 బడ్జెట్‌ నుంచి రికార్డు స్థాయిలో రూ.25,000 కోట్లు కేటాయించటం జరిగింది. 2017–18 బడ్జెట్‌లోనూ అదే ఒరవడి కొనసాగిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన కింద 11 ప్రాజెక్టులకు నిధులు ఇచ్చేందుకు సుముఖత తెలిపింది. మరో 28 ప్రాజెక్టులను క్యాడ్‌వామ్‌ పథకంలో చేర్చి కాలువల ఆధునీకరణకు నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement