
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు పనులను మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జనవరి మొదటి వారంలోగా బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టులోకి చెరువులు నింపడానికైనా నీళ్లు విడుదల చేస్తామన్నారు. వీటన్నింటినీ తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరించి ముందుకెళుతోం దన్నారు. టన్నెల్లో ఇంకా 675 మీటర్ల పని మిగిలి ఉందని, నెలకు 200 మీటర్ల చొప్పున మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారు లను, ఏజెన్సీని ఆదేశించామన్నారు. 15 రోజులకోసారి ఈ పనుల విషయమై కలెక్టర్‌ను రివ్యూ చేయాలని చెప్పామన్నారు.
సకాలంలో నిర్ధారిత పని చేయకపోతే సదరు ఏజెన్సీని తొలగించి బ్లాక్‌లిస్టులో పెట్టి ప్రత్యామ్నాయ ఏజెన్సీకి పనులు అప్పగిం చాలని ప్రాజెక్టు సీఈ సునీల్‌ను ఆదేశిం చామని మంత్రి పేర్కొన్నారు. పనులన్నీ పూర్తి చేసి డిసెంబర్‌లో ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. ప్రాజెక్టు పరిధిలో ముం దుగా 40 వేల ఎకరాలకైనా నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కానీ కృష్ణానదిలో ఇప్పటి వరకు నీళ్లు ఆశాజనకంగా లేవని, ఇటీవల కొంత వరద వచ్చిందన్నారు. తాగునీటికి ఇక ఢోకా లేదని, ఇంకా కొంత వరద వస్తే అటు ఎన్నెస్పీకి, ఇటు లోలెవల్ కెనాల్, ఉదయ సముద్రం, ఏఎమ్మార్పీకి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుం దని ఆయన వివరించారు. మిగిలి ఉన్న భూ సేకరణ కూడా త్వరితగతిన పూర్తి చేయాల న్నారు. ఏఎమార్పీ కాలువల్లో జంగిల్ కటిం గ్ కోసం నిధులు మంజూరు చేస్తామన్నారు.