సాక్షి, హైదరాబాద్: నేరగాళ్ల కదలికలపై పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో దృష్టి సారించడం, పట్టుబడిన వారికి శిక్షలు పడేలా శ్రద్ధ తీసుకోవటంతో రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని సీఎం కేసీఆర్ చెప్పారు. పదేపదే నేరాలకు పాల్పడే వారికి కళ్లెం పడిందని, కానీ ఇందులో పాక్షికంగానే విజయం సాధించినందున పూర్తిగా నిరోధించేందుకు ఇటీవలే ఉన్నతాధికారులతో సమీక్ష కూడా నిర్వహించినట్లు సోమవారం శాసనసభలో వెల్లడించారు. నేరాలు జరిగినపుడు బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్న నిర్ణయంతో ఖాళీగా ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పోస్టులనూ భర్తీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పీపీల నియామకం కీలక అంశం కాబట్టి ఇందుకు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో సమీక్షించనున్నట్లు తెలిపారు. వెరసి నేరాల అదుపులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ప్రతి గ్రామంలో కంటి పరీక్ష శిబిరాలు
ప్రతి గ్రామంలో కంటి పరీక్ష శిబిరాలు ఏర్పాటు చేసి కంటి చూపు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి కళ్లజోళ్లు పంపిణీ చేయనున్నట్లు వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర విశ్వజనీన నేత్ర సర్వే చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల సహకారం తీసుకుంటామని, అవసరమైన చోట్ల ప్రైవేటు వైద్యులనూ వినియోగించుకుంటామని చెప్పారు. ఆస్పత్రుల్లోని అన్ని రకాల సిబ్బంది ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ‘హైదరాబాద్‌లోని ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాలలో 75, ప్రభుత్వ యునానీ డిస్పెన్సరీలో 178, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ప్రభుత్వ యునానీ డిస్పెన్సరీల్లో 57 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు ఆయుష్, ఇతర విభాగాల్లోని ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం’అని మంత్రి చెప్పారు.
‘మహా’తరహాలో నీరా ఉత్పత్తి: పద్మారావు
నీరా ఉత్పత్తి, మార్కెటింగ్‌లో మహారాష్ట్ర తరహా విధానం అనుసరించాలని నిర్ణయించినట్లు అబ్కారీ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. ఇందుకోసం మహారాష్ట్రలోని దీహెన్ ప్రాంతం లో ఇటీవలే పర్యటించి అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేశామన్నారు. హరితహారం కార్యక్రమంలో రాష్ట్రంలో 1.70 కోట్ల తాటి, ఈత మొక్కలు నాటామని.. మరో 5 కోట్లు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా, నల్లగొండ జిల్లాలో 3 రోజుల క్రితం రిజర్వాయర్‌లో మునిగి మృతి చెందిన ఐదుగురు బాలల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అధికార పార్టీ సభ్యుడు రవీంద్రకుమార్ కోరారు. అసంపూర్తిగా పనులు చేసిన కాంట్రాక్టర్‌పై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజకీయాలకతీతంగా నిర్మాణం: హరీశ్
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మండలాలు సహా కొన్ని పాత మండలాల్లోనూ కొత్త గిడ్డంగులు నిర్మించనున్నట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. మొత్తంగా 164 గిడ్డంగులు నిర్మించాలని నిర్ణయించామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆయా ప్రాంతాల్లో డిమాండ్, ఎంత సామర్థ్యంతో వాటిని నిర్మించాలో అధ్యయనం చేసి నివేదికివ్వా లని నాబార్డును కోరామన్నారు. నివేదిక రాగానే రాజకీయాలకతీతంగా నిర్మాణం చేపడతామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment