ముంబై: భారత్ విదేశీ రుణ భారం 2022 జనవరి–మార్చి త్రైమాసికంతో పోల్చితే ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 2.5 బిలియన్ డాలర్లు తగ్గి 617.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన సమాచారం ప్రకారం, 2022 మార్చి త్రైమాసికంలో జీడీపీ విలువలో విదేశీ రుణ నిష్పత్తి 19.9 శాతం అయితే, ఇది జూన్ త్రైమాసికానికి 19.4 శాతానికి దిగివచ్చింది.
డాలర్ మారకంలో భారత్ రూపాయి, ఇతర కరెన్సీ విలువల సర్దుబాటు, లాభ నష్టాల నేపథ్యం రుణ భారం తగ్గడానికి కారణమని గణాంకాలు పేర్కొన్నాయి. ‘వాల్యుయేషన్ ప్రభావం మినహాయిస్తే, విదేశీ రుణం 2022 మార్చి చివరితోపోల్చి 2022 జూన్ చివరి నాటికి 2.5 బిలియన్ డాలర్లు తగ్గడానికి బదులుగా 11.9 బిలియన్ డాలర్లు పెరిగింది‘ అని కూడా సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. కాగా, 2022 చివరినాటికి దీర్ఘకాలిక రుణం (ఏడాది కన్నా ఎక్కువ వాస్తవ మెచ్యూరిటీ విషయంలో) 487.3 బిలియన్ డాలర్లుగా ఉందని ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి. 2022 మార్చి చివరి నాటితో పోల్చితే ఈ విలువ 10.6 బిలియన్ డాలర్లు తగ్గడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment