ఈ రద్దు ఓ రాజకీయ వ్యూహమా? | Sakshi Guest Column On RBI 2000 currency note withdrawing | Sakshi
Sakshi News home page

ఈ రద్దు ఓ రాజకీయ వ్యూహమా?

Published Sun, May 21 2023 3:35 AM | Last Updated on Sun, May 21 2023 3:35 AM

Sakshi Guest Column On RBI 2000 currency note withdrawing

మే 19వ తారీఖున 2000 కరెన్సీ నోటును చలామణీ నుంచి ఉపసంహరించుకుంటూ రిజర్వు బ్యాంక్‌ నిర్ణయాన్ని ప్రకటించింది. కాగా ఈ నోట్లను మే 23 నుంచి మొదలుకొని సెప్టెంబర్‌ 30 లోపుగా వివిధ బ్యాంకు లలో లేదా రిజర్వు బ్యాంకులో ఇతర డినామినేషన్ల కరెన్సీ నోట్లలోకి మార్చుకోవచ్చునని రిజర్వు బ్యాంక్‌ చెప్పింది. అలాగే, సెప్టెంబర్‌ 30 కి లోపుగా ఈ నోట్లు చెల్లుబాటు అవుతూనే ఉంటాయని బ్యాంకు పేర్కొంది. రోజువారీ ఒకో వ్యక్తి 20 వేల రూపాయల పరిమితికి లోబడి ఈ 2వేల నోట్లను మార్చుకోవచ్చని పరిమితిని కూడా చెప్పింది. ప్రస్తుత ఈ నోట్ల ఉపసంహరణ ‘క్లీన్‌ మనీ’ విధానంలో భాగమని బ్యాంక్‌ వివరించింది. 

ఇక్కడ క్లీన్‌ మనీ అంటే  చలామణీలో ఒక నిర్దిష్ట కాల వ్యవధి దాటి మనుగడ సాగించిన, కరెన్సీ నోట్లను ఉపసంహరించుకునే ప్రక్రియ.  ప్రస్తుతం మార్కెట్‌లో వున్న 2000 రూపాయల నోట్ల కనీస వయస్సు ఐదు సంవత్సరాలుగా ఉంది. సాధారణంగా నాలుగైదు సంవత్సరాల కాల వ్యవధిని ఒక కరెన్సీ నోటు తాలూకు జీవిత కాలంగా పరిగణిస్తారు. కాబట్టి, ఈ కోణం నుంచి చూస్తే ప్రస్తుత రూ. 2000  నోట్ల ఉపసంహరణ, కేవలం ఒక సాధారణ పరిపాలనా సంబంధిత వ్యవహారంగా కనపడుతుంది.

అలాగే, 2016 నవంబర్, పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రజా జీవితంలో ఏర్పడిన తీవ్ర సంక్షోభం, ఇక్కట్ల నేపథ్యంలోనే, నాడు తక్షణం నోట్ల కొరత సమస్య పరిష్కారం కోసమే రూ. 2000 నోట్ల ముద్రణ జరిగిందనేది ఒక అభిప్రాయం. కాగా, నేడు 2016 పెద్ద నోట్ల రద్దు కాలం నాటి కంటే, దరిదాపు రెట్టింపు (సుమారు 31 లక్షల కోట్ల రూపాయల మేర) విలువ గల కరెన్సీ చలామణీలో ఉంది. ఈ మొత్తం చలామణీలోని రూ. 2000 నోట్ల మొత్తం విలువ నేడు 3.62 లక్షల కోట్ల రూపాయలు అనీ, కాబట్టి ప్రస్తుతం నోట్ల ఉపసంహరణ వలన  జన జీవితంలో నోట్ల కొరత తాలూకు ఎటువంటి ఇబ్బంది రాదనేది నిర్ధారణ. 

ఆ నోటు కేవలం, కొద్దిమంది రియల్టర్లు, రాజకీయ నేతలు, ఇతర పెద్ద వ్యాపారులు నల్ల డబ్బుగా దాచుకుంటున్నారనేది బహుళ ప్రచారంలో ఉన్న అంశం. ఈ కారణం చేత కూడా ప్రజా జీవితంలో ఏ ఒడిదుడుకులు లేకుండా ఈ నోట్ల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయవచ్చనేది సాధారణ అభిప్రాయం. 

కాగా, ఈ ప్రక్రియలో రిజర్వు బ్యాంక్‌ ఎక్కడా నల్ల డబ్బు ప్రస్తావన చేయకున్నా... ఈ ఉపసంహరణకు నల్ల డబ్బుతోనూ, రాజకీయ వ్యవహారాల తోనూ ఉన్న సంబంధాల గురించే ప్రతిపక్షాలతో సహా అందరూ చర్చిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం చర్చ రిజర్వు బ్యాంక్‌ పేర్కొన్న ‘క్లీన్‌ మనీ’ గురించినదిగా కాక  ఈ నోట్ల ఉపసంహరణ, నల్ల డబ్బును పట్టుకోగలదా? లేదా? అలాగే ఇది, కొద్ది నెలలలో  వివిధ రాష్ట్రాలలో జరుగనున్న శాసనసభల ఎన్నికలలో  తన ప్రత్య ర్థులను నిరాయుధులను చేసేందుకు బీజేపీ వేసిన పాచికనా అనే చర్చ కూడా ఉంది.

ఇటువంటి చర్చలే, 2016 పెద్ద నోట్ల రద్దు కాలంలో కూడా జరిగాయి. నాడు ఆ నోట్ల రద్దు అనంతరం కొద్ది కాలంలోనే జరిగిన ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలలో ప్రతిపక్షాలను దెబ్బ తీసి తాను లబ్ధి పొందేందుకే బీజేపీ నోట్ల రద్దును ముందుకు తెచ్చిందనే విమర్శలు వచ్చాయి. అలాగే, నాడు పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని  ప్రకటిస్తూ మోదీనే స్వయంగా నల్ల డబ్బు నియంత్రణను గురించి మాట్లాడారు. అందుకే ఇప్పుడు రూ. 2000 నోటు ఉపసంహరణ క్రమంలో మరలా తిరిగి నల్ల డబ్బు చర్చకు కారణం అవుతోంది.

పైగా, నాటి పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ, నల్ల డబ్బును పట్టుకోవడంలో బొక్క బోర్లా పడ్డ అంశం ప్రజలింకా మరచిపోలేదు. అందుకే 2016 పెద్ద నోట్ల రద్దు క్రమంలో లాగా నేడు జన సామాన్యం, 2 వేల నోటు ఉపసంహరణ, నల్ల డబ్బుకు చరమ గీతం పాడుతుందనేది నమ్మలేకు న్నారు. అందుచేతనే, ఒక తత్వవేత్త చెప్పినట్టు ‘చరిత్రలో ఏ ఘటన అయినా మొదటి దఫా విషాదంగానూ, రెండవ దఫా ఒక ప్రహసనంగానూ లేదా పరిహాసాస్పదమైనదిగానూ ఉంటుంది.’ 

స్థూలంగా, 2016 నాటి పెద్ద నోట్ల రద్దు అనంతరం, దేశంలో భారీగా పెరిగిన డిజిటల్‌ లావాదేవీలు ఒక పక్కా, చలామణీలో రెట్టింపు అయిన కాగితం కరెన్సీ విలువ మరొక పక్కా నేడు పరస్పర విరుద్ధ అంశాలుగా మన ముందు ఉన్నాయి. మరి ఈ చిక్కు ముడిని అర్థం చేసుకోవడం ఎలా? దీనికి జవాబు సులువు! నేడు అత్యధిక శాతం జన సామాన్యం, డిజిటల్, ఆన్‌లైన్, యూపీఐ లావాదేవీలు చేస్తున్నారు. అంటే ఆ మేరకు వారి వద్ద కరెన్సీ నిల్వ తగ్గిపోయింది. కాగా, రెండవ పక్కన 2016 కంటే రెట్టింపు అయిన చలామణీలోని కరెన్సీ విలువ మన కళ్ల ముందర ఉంది.

మరి ఈ పెరిగిపోయిన అదనపు కరెన్సీ అంతా ఎక్కడ ఉంది? ఏం చేస్తోంది? సామాన్యజనం పారదర్శకంగా ఉండే డిజిటల్, ఆన్‌లైన్‌ లావాదేవీలను కొనసాగిస్తుంటే... కులీనులూ, ఘరానా పెద్ద మనుషులూ, నల్ల డబ్బు బాబులు ఏ పారదర్శకత లేని కాగితం కరెన్సీ ఆధారిత నల్ల డబ్బు లావాదేవీలను అనుసరిస్తున్నారు. ఈ లావాదేవీల్లోనే ఈ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. అంటే నేడు 2016 కంటే కూడా ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత స్థూలంగా తగ్గిపోయింది. ఇది కఠోర వాస్తవం!

కాబట్టి, నేడు ప్రజలు మరింత ఆసక్తిగా 2 వేల రూపాయల నోట్ల ఉపసంహరణ ముగిసే సెప్టెంబర్‌ 30 అనంతర కాలం వైపు చూస్తుంటారు. ఆ రోజు ముగిసిన అనంతరం రిజర్వ్‌ బ్యాంక్‌కు చేరిన 2000 నోట్ల మొత్తం విలువ ఎంత? నల్ల డబ్బు ఎంత పరిమాణంలో గుట్టు చప్పుడు కాకుండా దాని యజ మానుల దగ్గరే మిగిలిపోయింది? వంటి ప్రశ్నలపై దృష్టిపెడతారు. ప్రజల ఈ ప్రశ్నలకు లభించే జవాబులు నేటి మోదీ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఏమాత్రం అనుమానం లేని నిదర్శనాలుగా నిలుస్తాయి.

అలాగే ప్రస్తుత 2 వేల రూపా యల నోట్ల ఉపసంహరణ ప్రక్రియ కూడా దాని రాజకీయ క్రీనీడలను బీజేపీపై సారిస్తోంది. ఉదాహరణకు, నిన్న గాక మొన్న కర్ణాటక ఎన్నికలలో అవినీతి ఆరోపణల మరకలు పడి మసి బారిన బీజేపీ ప్రభను, మోదీ ప్రచార హోరు కూడా గట్టెక్కించలేకపోయిందనేది తెలిసిందే. ఇక ఇప్పుడు 2 వేల నోటు ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రకటించింది రిజర్వు బ్యాంకే అయినా దాని వెనుక రాజకీయ రంగు లేదంటే నమ్మటం లేదా నమ్మించడం కష్టం.

ఈ క్రమంలోనే బ్యాంక్‌ తీసుకున్న ఈ ప్రస్తుత నిర్ణయాన్ని... బీజేపీ అవినీతికి అతీతమైనదిగా లేదా నల్ల డబ్బు తదితర వ్యవహారాలకు బద్ధ శత్రువు అనీ కలరింగ్‌ ఇచ్చే ప్రయత్నమని సందేహం వస్తే తప్పు కాదేమో. అలాగే, కర్ణాటకలో తన వైఫల్యాన్ని బేరీజు వేసుకొనే క్రమంలో ఉన్న బీజేపీ... రానున్న కాలంలో ఏ ఎన్నికలలోనూ ప్రతిపక్షాలకు ఊపిరి పీల్చుకునేందుకు అవకాశం ఇవ్వకూడదనే తలంపుతో ఈ నోట్ల రద్దు వ్యవహారాన్ని ఒక వ్యూహంగా ముందుకు తెచ్చిందేమో అనే సందేహమూ కచ్చితంగా తప్పు కాదు.  

యుద్ధంలో కూడా ఒక నీతి ఉంటుంది. దీనిని అతిక్రమించిన వారు యుద్ధ నేరస్థులుగా ప్రకటించబడతారు. ఆ మేరకు శిక్షించబడతారు. కానీ, నేటి భారతీయ రాజకీయ యవనికలో  గెలుపు... ఏ నీతికీ తావు లేని గెలుపు... బరిలో ప్రత్యర్థే లేకుండా చూసుకొనీ, చేసుకొనీ తనకు తానే విజేతగా తీర్పులను ఇచ్చేసుకునే ఏ నీతీ లేని ఒక అమూర్త, అవ్యక్త ‘అవి’ నీతి రాజ్యమేలుతోంది. రాజు వెడలె రవి తేజము లదరగా!
డి. పాపారావు 
వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు ‘ 98661 79615

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement