న్యూఢిల్లీ: పేటీఎం పేమెట్స్ బ్యాంక్‌పై (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆంక్షల వల్ల తమ వార్షిక నిర్వహణ లాభాలపై రూ. 300–500 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడొచ్చని ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం అంచనా వేసింది. పీపీబీఎల్ డిపాజిట్లను స్వీకరించకుండా విధించిన ఆంక్షలతో, కస్టమర్లు తమ వాలెట్లలో డబ్బును డిపాజిట్ చేసే అవకాశం లేకపోవడం ఇందుకు కారణమని పేర్కొంది. అయితే, లాభదాయకతను మెరుగుపర్చుకునే దిశగా తమ ప్రయాణం ముందుకు కొనసాగుతుందని వివరించింది.
డిసెంబర్‌లో పీపీబీఎల్ ద్వారా 41 కోట్ల యూపీఐ రెమిటెన్సుల లావాదేవీలు జరిగాయి. పేటీఎం బ్రాండ్ మాతృసంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్‌కి (ఓసీఎల్) పీపీబీఎల్‌లో 49 శాతం వాటాలు ఉన్నాయి. 50 శాతం లోపు మైనారిటీ వాటాలే ఉన్నందున దాన్ని అనుబంధ సంస్థగా కాకుండా అసోసియేట్ సంస్థగా పరిగణిస్తోంది. ఒక పేమెంట్స్ కంపెనీగా పీపీబీఎల్‌తో పాటు వివిధ బ్యాంకులతో ఓసీఎల్ కలిసి పని చేస్తోందని పేటీఎం తెలిపింది.
తాజా పరిణామం కారణంగా ఇకపై పీపీబీఎల్‌తో కాకుండా ఇతర బ్యాంకులతో మాత్రమే ఓసీఎల్ పని చేస్తుందని వివరించింది. పదే పదే నిబంధనల ఉల్లంఘనల కారణంగా ఫిబ్రవరి 29 నుంచి కస్టమర్ల ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్టాగ్‌లు మొదలైన వాటిల్లో డిపాజిట్లు, టాప్‌అప్‌లను స్వీకరించరాదంటూ పీపీబీఎల్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment